పేరు కార్యకర్తలది…భోగాలు నాయకులవి!

ఒక్కసారైనా పదవులు త్యాగం చేసే శక్తి వుందా?

ఏ పార్టీ అయినా సామాన్య కార్యకర్త కు మునుగోడులో టిక్కెట్టు ఇవ్వగలదా?

ప్రజా బలం మాకుందని నిరూపించుకోగలరా?

అందరూ గెలుపు గుర్రాల వేటనే!

ఎన్నికలగానే కార్యకర్తలకు ఎక్కడ లేని విలువ

నాలుగు రోజులు కాగానే ఇక అంతే!

ఎన్నికల ముందు చొచ్చుకొని వస్తారు..

ఆ తర్వాత ముఖం చాటేస్తారు?

అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!

కార్యకర్తలకు అండగా వున్నామన్న నాయకులున్నారా?

జంపింగ్‌ జపాంగ్‌ లంతా స్వార్థపరులే!

అందరూ కార్యకర్తల జీవితాలతో ఆడుకునే వారే!

హైదరాబాద్‌,నేటిధాత్రి: మునుగోడు నియోజకవర్గంలో కొత్త సంప్రదాయానికి తెర తీసే ధైర్యం రాజకీ పార్టీలకు వుందా? ఎంత సేపు బలవంతమైన నాయకుల మీదనే ఆధారపడి రాజకీయాలు సాగిస్తారా? ఎన్నికలలో కోట్లు ఖర్చు చేయగల నాయకులకే టిక్కెట్లు ఇస్తారా? మునుగోడు విషయంలో ఏమైంది? రాజగోపాల్‌ రెడ్డిని నమ్మి కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇస్తే, తనను గెలిపించిన ప్రజల మనోభావాలను గాలికి వదిలేసి, తన దారి తాను రాజగోపాల్‌ రెడ్డి చూసుకోవడం లేదా? పార్టీలు నాయకులను శాసించే కాలం నుంచి నాయకులే పార్టీలను శాసించే పరిస్థితి రావడానికి కారణం ఎవరు? గెలుపు గుర్రాలు అనే ఒకే ఒక్క మాటతో రాజకీయాలను సమూలంగా మార్చేస్తున్నారు. అనుక్షణం నాయకులు ఏం చేస్తున్నారు? ఎవరితో కలుస్తున్నారు? ఎక్కడ సమావేశమౌతున్నారు? ఇలాంటి జాగ్రత్తలతోనే పార్టీలకు పుణ్యకాలం పూర్తవుతోంది. ఎప్పుడూ ఎన్నికల కోసం ఎదురుచూడడం అలవాటైంది. తమ బలం తగ్గిందా? పెరిగిందా? అని తెలుసుకోవడం కోసం నిత్యం సర్వేలేనా? ఐదేళ్ల కాలంలో ఏదో ఒక పార్టీ తరఫున ఎవరో ఒకరు సర్వేలు, చేయడం మేం బలంగా వున్నామని చెప్పుకోవడం తప్ప, ప్రజలకేం కావాలి. అభివృద్ది మంత్రమేమిటి? గుడ్డిగా ఒక రాజకీయ పార్టీని మరో రాజకీయ పార్టీ దుమ్మెత్తి పోసే రాజకీయాలు తప్ప, ప్రజల కోసం ఆలోచనే మర్చిపోయాయి. ఎంత సేపూ ఆధిపత్య రాజకీయాల యావ తప్ప మరొకటి లేదు. అందుకే కొత్త తరం రాజకీయాలు పురుడుపోసుకోవడం లేదు. నూతన తరం ఆవిష్కరణ జరగడం లేదు…మూస రాజకీయాలు…ముతక నాయకులు తప్ప ప్రజా సేవ చేయాలన్న దృక్పథంతో వస్తున్నారెంత మంది? రియలెస్టేట్‌ వ్యాపారాలు, ఆ సంపాదనతో రాజకీయాలు…వాటిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు…ఇదే ఇప్పుటి రాజకీయం…ఇలాంటి పరిస్థితులలో ఒక సామాన్య కార్యకర్త నాయకుడు అయ్యే అవకాశం వుందా? హుజూరాబాద్‌ లో ఏం జరిగింది. గెల్లు శ్రీనివాస్‌ పేరు అప్పటికే తెరమీదకు వచ్చినా, ఎమ్మెల్సీ కౌషిక్‌ రెడ్డి సీటు నాదే అన్నాడు. ఇంకే ముంది తర్వాత ఎంత దిద్దుబాటు చర్యలు చేపట్టినా లాభం లేకపోయింది. బలమైన నేతలు వున్న చోట ఒక రకంగా, లేని చోట మరోకరంగా రాజకీయాలు సాగుతున్నా బలవంతులే గెలుస్తున్నారు. రాజకీయాలు శాసిస్తున్నారు. ఇప్పుడు మునుగోడులోనూ అదే జరగబోతోంది. నిజానికి టిఆర్‌ఎస్‌ మునుగోడులో బలంగా వుంది. కాకపోతే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. టిఆర్‌ఎస్‌ లో ఆశావహుల సంఖ్య ఆరు వరకు వుంది. మరి ఎవరిని ఎంపిక చేయొచ్చు అనే దశ రాకముందే ఎవరికి వారే తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రచారానికి కూడా శ్రీకారం చుడుతూనే వున్నారు. ఎవరికి వారు, మేమంటే మేం ముందున్నామని, ప్రజల్లో పలుకుబడి వుందని చూపించుకుంటున్నారు. ఇది చివరికి మళ్ళీ హుజూరాబాద్‌ ఎన్నికలో జరిగిన పొరపాటుకు దారితీసే పరిస్థితి లేకపోలేదు.ఇక బిజేపి పార్టీ పూర్తిగా అద్దె నాయకుల మీదనే రాజకీయాలు చేయాలనుకుంటోంది. 

వలసలు ప్రోత్సహిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులను ఆకర్షణ అన్నది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాగిస్తూనే వుంది. రాష్ట్రంలో ఈ మధ్య మొదలు పెట్టింది. జోరుమీద వున్నట్టు మాత్రం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. మూడున్నరేళ్లుగా మునుగోడు ప్రజలకు న్యాయం చేయలేకపోయిన రాజగోపాల్‌ రెడ్డి ఒక వేళ గెలిస్తే ఏం చేస్తాడు? అప్పుడు రాష్ట్రంలో వుండేది టిఆర్‌ఎస్‌ ప్రభుత్వమే. గెలిచామని సంబరపడుతున్న రఘునందన్‌ దుబ్బాకకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడా? అధికార టిఆర్‌ఎస్‌ లో ఆరేళ్లు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్‌ చేసిందెంత? ఇప్పుడంటే ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని తప్పించుకుంటున్నాడు. మరి మంత్రిగా పని చేసినంత కాలం ఏం చేశాడు. వ్యాపార సంస్థలు, సామ్రాజ్యం పెంచుకున్నడన్న ఆరోపణలు వున్నవే. అసైన్డ్‌ భూముల వ్యవహారం నానుతున్నదే. మరి అలాంటి నాయకుడికి జాతీయ పార్టీ ఆశ్రమం కావాలి. బిజెపి ఆర్థిక మూలాలున్న నాయకులు కావాలి. ఇదేనా ప్రజా స్వామ్యం ఫరిఢవిల్లేలా చేయడం? ఇక కాంగ్రెస్‌ చేసుకున్న పాపానికి అనుభవిస్తోంది. మునుగోడులో స్థానిక నాయకులు లేరన్నట్లుగా, రాజగోపాల్‌ రెడ్డి కి అడిగిన అవకామల్లా ఇచ్చింది. అన్న పేరు చెప్పుకొని రాజకీయాలు చేసిన రాజగోపాల్‌ రెడ్డి కూడా బ్రాండ్‌ అని మాట్లాడుతున్నాడే గాని, ప్రజల హృదయాలలో వున్నామని అనడం లేదు. అంతగా తన బ్రాండ్‌ గురించి పదే పదే చెప్పుకునే రాజగోపాల్‌ రెడ్డి తన అనుచరులైన ఎంత మంది నాయకులు, కార్యకర్తలకు ఆర్థిక బలానికి తోడ్పాటు పడ్డాడో కూడా చెప్పాలి. ఎంత సేపు తన వ్యాపార ముసుగు రాజకీయాలే గాని మరేం కనిపించడం లేదు. కార్యకర్తల పేరు చెప్పి రాజకీయాలు చేయడం నాయకులు, పార్టీలు బాగా అలవాటు చేసుకున్నాయి. ఇదిలా వుంటే తాజాగా పిసిసి ఆధ్వర్యంలో మునుగోడులో పెద్ద ఎత్తున సభ నిర్వహించారు. ఆఖరుకు గెలవకపోయినా నష్టం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇది దేనికి సంకేతం. మునుగోడు లో సామాన్య కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటామనాల్సిన చోట మొదటనే చేతులెత్తేయడం కాదా? అంత పెద్ద సభ ఏర్పాటు చేసి తుస్సుమనిపించినట్లు కాదా? వచ్చిన అంత మంది జనాలను పిచ్చోళ్లను చేయడం కాదా? దీనికి రేవంత్‌ సమాధానం చెప్పాల్సిన అవసరం లేకపోలేదు. అంతే కాదు పార్టీ బలంగా వున్న సీటు చేజార్చుకోవడం అంటే ముందే అస్త సన్యాసం చేసినట్లౌతుంది. నిజానికి మునుగోడు అన్ని పార్టీలకు ఎంతో ప్రతిష్టాత్మకం. వరుస ఓటములతో కుదేలైనట్లురాజకీయ పార్టీలు నాయకులను తయారు చేయలేవా? 

కొత్త తరం రాజకీయాలు ఆవిష్కరించలేవా? ఎంత సేపు అరువు తెచ్చుకున్న నాయకులపై ఆధారపడి రాజకీయాలు చేస్తాయా? అంటే అలాగే కనిపిస్తోంది. గత రెండు దశాబ్దాల క్రితం ఇలాంటి రాజకీయ పోకడలు వెలుగుచూడడం మొదలుపెట్డాయి. వాటిని అన్ని పార్టీలు అనుసరిస్తున్నాయి. అందుకు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్నీ ఆ తాను ముక్కలే. గడచిన ఇరవై సంవత్సరాలుగా అదే నాయకులు, అవే పెత్తనాలు…వారికే పదవులు. కొత్త వాళ్లు రారు…రానీయరు. అయితే వారసులు, లేకుంటే వారి బంధువులు…ఇంతకు మించి కొత్త నాయకత్వం ఎక్కడా కనిపించదు. తెలంగాణ ఉద్యమం మొదలైన నుంచి నాయకులైన వారిలో కొంత కొత్త తరం పురుడుపోసుకుంటుందనే ఆశ అందరిలోనూ చిగురించింది. కానీ ఆ ఆశ సజీవం కావడానికి చాలా కాలం పట్టలేదు. ఉద్యమ కారులతో పాటు టిఆర్‌ఎస్‌ లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు పెరిగిపోవడంతో సహజంగా నాయకులలో నిస్తేజం ఆవహించింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనాదిగా రాజకీయాలలు చేస్తున్న కాంగ్రెస్‌ దానికి బాటలు వేసింది. మరో రాజకీయ పార్టీ కనిపించకుండా పోవాలంటే ఆ పార్టీ నాయకులను లాగేయాలి. పార్టీలలో చేర్చుకోవాలి. ఆ పరంపర బీజేపీ పార్టీ హయాం వచ్చే సరికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ అన్న నినాదంలోనే ఆ పార్టీ నాయకులను లాగేసుకోవడం అన్నది వుంటుందని ఎవరూ ఊహించలేదు. జాతీయ స్థాయి పార్టీల వ్యవహారం అలా వుంటే ప్రాంతీయ పార్టీలు అదే బాటలో పయనిస్తున్నాయి. రాను రాను కొత్త రాజకీయ పార్టీల పుట్టుక అనేది ఎలా వున్నా, అధికారం సాధించేంత శక్తివంతమైన నాయకులు తయారు కావడం లేదు. ప్రజల ఆలోచనా విధానాలలో కూడా మార్పులు రావాల్సిన అవసరం వుంది. అయితే కేవలం రాజకీయాలు అధికారం పరమావధి అనుకునే పార్టీలు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. సిద్ధాంతాలు, రాద్దాంతాల గురించి మాట్లాడే పార్టీలకు కాలం చెల్లిపోయింది. దానికి కారణం రాజకీయ పార్టీలే. ప్రజలు ఎప్పుడూ సమస్యల మీద మాట్లాడే అవసరం, అవకాశం లేకుండా తాయిలాల రాజకీయాలు నెరపడం మొదలుపెట్టాయి. అందుకే ప్రజలకు కూడా ఏవగపు మొదలైంది. కొత్త రాజకీయ పార్టీలకు చోటు లేకుండా పోతోంది. నూతన రాజకీయ నిర్మాణం జరగకుండా అడ్డుకుంటోంది. ప్రజలు కూడా అభివృద్ధి చేస్తున్న పార్టీల నుంచి కూడా తాయిలాలు ఆశించడం తప్పు. అది ముందు ప్రజల్లో మార్పు రావాలి. అప్పుడు గాని రాజకీయ పార్టీలు ప్రజలంటే భయపడతాయి. ప్రజా సంక్షేమ రాజకీయాలు చేస్తాయి. ఆ రోజు రావాలని ఆశిద్దాం.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *