గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా

కిట్టుబాయి దేనా…

  • – గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో విచ్చలవిడిగా గంజాయి దందా
  • – సిగరేట్ల రూపంలో విక్రయం…ఒక్కో సిగరేట్‌ ఐదువందల రూపాయలు
  • – కోడ్‌ చెపితేనే సిగరేట్‌ దొరుకుతుంది
  • – లేదంటే…అలాంటివి మా దగ్గర దొరకవని అమాయకత్వం నటిస్తారు
  • – పాన్‌షాపులే ప్రధాన విక్రయ కేంద్రాలు

నేటిధాత్రి బ్యూరో: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి దందా ఏ ఆటంకం లేకుండా సాఫీగా సాగుతోంది. సినిమా తరహాలో గంజాయిని విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు గంజాయి విక్రయదారులు. గంజాయికి అలవాటుపడిన యువత దానికి బానిసలా మారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఒక్క గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోనే గంజాయి విక్రయం లక్షల్లో నడుస్తుందని ఓ అంచనా. గట్టుచప్పుడు కాకుండా గంజాయిని విక్రయిస్తున్న కేటుగాళ్లు ఓ మాఫియా తయారై అన్ని ప్రతికూల పరిస్థితులను చక్కదిద్దుకుని నగరంలో ఈ వ్యాపారాన్ని మూడు పువ్వులు…ఆరు కాయల్లా కొనసాగిస్తున్నారు. వీరికి తెర వెనుక అన్నిరకాల సపోర్టు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా కేవలం పరిచయం ఉన్న వారికే వీరు గంజాయి సిగరేట్లను విక్రయిస్తున్నారు.

ఒక్కసారి పీల్చారా…?

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో సిగరేట్ల రూపంలో దొరుకుతున్న గంజాయిని ఒక్కసారి పీల్చారా…? ఇక అంతే సంగతులు. ఆ సిగరేట్‌కు బానిస కావాల్సిందే. ఒక్క దమ్ములాగితే…ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్లు అవుతుందట. ఎవరితో సంబంధం లేకుండా, అసలు ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా 24గంటలు మత్తులో జోగవచ్చు. ఎక్కువగా అలవాటు ఉన్న వారు. సిగరేట్‌ను ఒక్కసారే కాల్చి మత్తులో ఊగుతుంటే, కొందరు ఈ ఒక్క సిగరేట్‌ను మూడురోజులపాటు తాగుతూ మత్తులో ఏం కానరాకుండా ఊగి…ఊగి పోతున్నారట. ఐదువందల రూపాయల ధర ఉనన& ఈ సిగరేట్‌ కొనడానికి యువత నుంచి మొదలుకుని అన్ని వయస్సుల వారు విక్రయిస్తూ మత్తులో చిత్తవుతూ జేబు గుల్ల చేసుకుంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని హన్మకొండ, వరంగల్‌ ప్రాంతాలలో ఈ గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. హన్మకొండ అశోకా థియేటర్‌ ప్రాంతం, వరంగల్‌ రైల్వేస్టేషన్‌ వెనకాల ప్రాంతాల్లో ప్రధానంగా పాన్‌సాపులల్లో ఈ సిగరేట్‌లను విక్రయిస్తున్నట్లు తెలిసింది. గంజాయి సిగరేట్లు గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని పాన్‌షాపులలోనే కాకుండా యాచకుల ద్వారా రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, హోటళ్లు రద్దీగా ఉండే ప్రాంతాలలో యాచకుల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిసింది. వీరికి ఎంతో కొంత కమీషన్‌ ముట్టజెపుతూ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. యాచకుల ద్వారా గంజాయి సిగరేట్లను అమ్మిస్తే ఎవరికి అనుమానం రాదని గంజాయి కేటుగాళ్లు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

కిట్టుబాయ్‌…హోనా…

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని కొన్ని పాన్‌షాపులలో గంజాయి సిగరేట్లు లభిస్తున్నాయి. అయితే ఈ సిగరేట్లను ఎవరికి పడితే వారికి విక్రయించకుండా కేవలం పరిచయం ఉన్న వారికే విక్రయిస్తున్నారు. వీటిని కొనుగోలు చేయాలంటే ‘కిట్టుబాయ్‌’ అనే కోడ్‌ చెప్పాలి. గంజాయి సిగరేట్‌ అనకుండా కిట్టుబాయ్‌ కావాలంటే ఆ పాన్‌షాప్‌ యజమానికి అర్థం అయిపోతుందట. ఐదువందలు చెల్లించగానే గంజాయి సిగరేట్‌ చేతిలో పెడతారట.

కొరవడిన నిఘా

గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో గంజాయి మాఫియా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించకుంటుపోతుంటే నిఘా వ్యవస్థలు కళ్లు మూసుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. బహిరంగంగా, ఇంత విచ్చలవిడిగా కోడ్‌ భాషలో రోజు లక్షల రూపాయల బిజినెస్‌ నడుస్తున్నా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పాన్‌షాపులు కేంద్రాలుగా గంజాయి సిగరేట్లు విక్రయిస్తున్న సిగరేట్లు పీల్చి యువత మత్తులో చిత్తవుతున్న వీరు మాత్రం తమకేం పట్టనట్లుగానే వ్యవహారిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *