పాప్‌ కార్న్‌ కొన్నా పన్ను రాలుడే!

`అటు పన్నులు, ఇటు సెస్సులు మనిషిని గుళ్ల గుళ్ల చేస్తున్నారు.

`అర్థిక వేత్తలు సలహాలిస్తున్నారు.

`పాలకులు అమలు చేస్తున్నారు.

`బ్యాంకులను ముంచుతున్న వారికి రాయితీలు.

`కష్టపడి సంపాదించే జనం జేబుకు చిల్లులు.

`జనం పడే కష్టాలు వినడానికి ఎవరికీ తీరిక లేదు.

`సామాన్యులను పిండి పిప్పి చేస్తున్నారు.

`ధరల మోతతో దడదడలాడిస్తున్నారు.

`స్లాబుల మీద స్లాబ్‌లు పెట్టి దోచేస్తున్నారు.

`సగటు వ్యక్తి సంపాదన ఖర్చులకు సరిపోవడం లేదు.

`బిడ్డ పుట్టడం నుంచి మొదలు పన్ను లేని వస్తువు లేదు.

`ఉప్పు మీద, పప్పు మీద దాహాం తీర్చే నీటి మీద…

`ఆసుపత్రిలో ఆక్సీజన్‌ మీద,

`ఆరోగ్యం కాపాడే మందుల మీద,

`బతకాలన్నా పన్నులే…

`బతకలేక చచ్చినా పన్నులే.

`ధరల దెబ్బకు జనం జడుసుకుంటున్నారు.

`పన్నుల బాదుడుకు విలవిలలాడుతున్నారు.

`దేశం ట్రిలియన్‌ డాలర్లు దాటుతుందని గొప్పలు చెబుతున్నారు.

`జనం బతకలేక, చావలేక నరకం చూస్తున్నారు.

`ఆఖరుకు పాప్‌ కార్న్‌ మీద కూడా జిఎస్టీ.

`మొక్క జొన్న పండిరచే రైతుకు మద్దతు ధరలేదు.

`పిల్లల చదువుల మీద పన్నులు.

`పోటీ పరీక్షలకు పన్నులు.

`కారు కొనుక్కున్న పన్ను చెల్లించాల్సిందే.

`అమ్ముకున్న చెల్లించాల్సిందేనా!

`పెళ్ళికి, చావుకు పన్నులే!

`170 దేశాలలో పన్నులలో మొదటి స్థానం మనమే.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

జిఎస్టీ తేవడానికి ముందు ఊరించారు. దేశమంతా ఒకే పన్ను అని ప్రచారం చేశారు. దాన్ని రూపకల్పన చేసినప్పుడు గుడ్‌ అండ్‌ సింపుల్‌ ట్యాక్స్‌ అన్నారు. అందరూ ఆనందించారు. అమలు సమయం వచ్చే సరికి గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ అన్నారు. అయినా జనం సంతోషంగానే ఆహ్వానించారు. దేశంలో ఒక వస్తువు ఒక చోట ఒక ధర, మరో చోట మరో ధర లేకుండా, అంతటా ఒకే పన్ను వుంటుందనుకున్నారు. కాని బాదుడులో జీఎస్సీ అంటే బంపర్‌ ఆఫర్‌ అనుకోలేదు. చితికి వేసారి పోతామనుకోలేదు. కోలుకోలేని పన్నుల దెబ్బలు తింటామని ఎవరూ ఊహించుకోలేదు. మొదట్లో తర్వాత తగ్గకపోతాయా? అనుకున్నారు. పన్నుల మీద పన్నులు, వాయింపుల మీద వాయిపుంలు పడుతున్నా ఓర్చుకున్నారు. ఆదాయానికి, రాబడికి, వ్యయానికి అర్ధం మార్చి వాయింపుల మీద వాయిపుంపులతో వీపులు విమానం మోత మోగిస్తున్నారు. ఈ పన్నులను చూసి కుబేరులు దేశాలు దాటి పోతున్నారు. తక్కువ పన్నులున్న దేశాలలో స్ధిరపడుతున్నారు. సామాన్యులు మాత్రం బతకలేక, చావలేక పన్నులు భరిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. దేశాన్ని పోషిస్తున్నారు. ఆకలిని కడుపులో దాచుకుంటూ పస్తులుంటున్నారు. ఏం కొనేటట్లు లేదు..ఏం తినేటట్లు లేదు.. అని ఎల్ల కాలం పాటలు పాడుకుంటూ, కడుపు మాడ్చుకోవడమేనా బతుకంటే! పాలకులు ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతున్న పన్నులు కట్టుకుంటూ పోవడమేనా జీవితమంటే…ఏటా పెరుగుతున్న పన్నుల పోటు వెన్ను విరిచేస్తున్నాయి. సంపాదన మూరెడు..ఖర్చులు బారెడైపోతున్నాయి. జిఎస్టీపేరుతో విధిస్తున్న పన్నులు సామాన్యుల గుండెల మీద బండలైపోతున్నాయి. గుణపాలు దించుకున్నాయి. బతకలేని సమాన్యులు చితికిపోతున్నారు. బతుకుభారమైన చితికి చేరుకుంటున్నారు. ఆకలి కేకలు పెట్టలేక, అన్నమో రామచంద్రా అనలేక మధ్య తరగతి విలవిలలాడిపోతోంది. ఆదాయాం సమకూరని బతుకులపై పాలకులు పన్నుల శిక్షలు వేస్తుంటే భరిస్తున్నారు. అన్నానికి దిక్కులేని పేదల పన్నుల పేరుతో నడ్డి విరుస్తున్నారు. ఆదాయం సక్కలేక, వ్యయానికి దిక్కులేని వారు పన్నులు కట్టలేక గుండెలు బాదుకుంటున్నారు. పాప్‌ కార్న్‌ కొన్నా పన్నులు బాదుడే అని తెలిసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ మధ్య పాల మీద, పెరుగు మీద కూడా పన్నులు వేశారు. ఆఖరుకు సమోసాల మీద కూడ పన్నులు వేసినా కట్టుకుంటున్నారు. ఇప్పుడు జీఎస్టీకి మూలం మీరంటే మీరని, తెచ్చి నడ్డి విస్తుంది మీరని పార్టీలు కొట్టుకోవడం తప్ప, జనానికి పన్నుల మోత ఆపుతున్నవారు లేరు. ఆపాలని కోరుతున్న వారు లేరు. దేశమంతా ఒకే పన్ను అంటే అందరూ సంతోషించారు. పన్నుల బారం తగ్గుతుందని ఆనందపడ్డారు. కాని ఏమైంది? పన్ను అంటేనే జనం వెన్నులు వణుకుపుడుతోంది. ఇవేం పన్నులు రా బాబూ అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉప్పు నుంచి మొదలు, ఏది కొన్నా పన్నుల మీద పన్నులేనా? పూసుకునే ఫౌడర్‌ మీదనో, సువాసనలు వెదలజల్లే సెంట్ల మీదనో పన్నులు వేశారంటే అర్దముంది. కాని పిల్లలు రాసుకునే పెన్నులు, పెన్సిళ్లు, బ్లేడ్లు, ఏరేజర్లు, నోటు పుస్తకాలను దాటి పరీక్షలకు కూడా పన్నులు కట్టే విధానం ఏమిటో ఎవరికీ అర్దం కావడం లేదు. ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నవారెవరో మానవత్వం లేని ఆర్ధికవేత్తలెవరో తెలియడంలేదు. ప్రపంచంలోని 170 దేశాలలో మన దేశంలోనే పన్నులు ఎక్కువ అని తెలిసినా ప్రశ్నించేవారు లేరు. అతి తక్కువ పన్నులున్న సింగపూర్‌ ఎలా అభివృద్ది చెందింది? అసలు పన్నులే లేని దుబాయ్‌ లాంటి దేశాలలో ప్రజలకు సేవలెలా అందుతున్నాయి. ప్రతీదానికి పన్నులు పెంచుకుంటూ పోతే తప్ప దేశం బాగుపడదా? ఇలా పన్నుల మీద పన్నులు వేసినా బాగుపడుతుందెవరు? సామాన్యులకు కష్టాలు. బ్యాంకులను ముంచేస్తున్నవారికి రాయితీల మీద రాయితీలు ఇస్తున్నారు. బ్యాంకులను దివాళా తీస్తున్న వారు దేశం దాటి వెళ్లిపోతున్నారు. సామాన్యులు గత్యంతరం లేక, కష్టపడిన సొమ్ములో పన్నులే ఎక్కువ చెల్లిస్తున్నారు. సేవలకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రోజంతా కష్టపడి ఒళ్లు హూనం చేసుకొని రూపాయి సంపాదించుకునే సామాన్యుడి కష్టం ఆ రాత్రికే ఆవిరౌతుంటే..పది నిమిషాలలో రోజు కష్టం ఖర్చవుతుంటే పొదుపెలా సాద్యం. అనారోగ్యం వస్తే వైద్యం ఎలా చేసుకోవడం. అందరూ ఆరోగ్య భీమా చేసుకోవాలంటారు. భీమా చేసుకున్నవారంతా పన్నులు చెల్లించాలంటారు. జనం బాగుంటేనే కదా? ఆరోగ్యంగా వుంటేనే కదా? పన్నులు చెల్లించేది. వందల ఎకరాల భూములు ప్రభుత్వం నుంచి తీసుకొని, మందులు తయారు చేసి మందులకు ఇష్టాను సారం ధరలు నిర్ణయించి వైద్యం కోసం అందించే మందులపై కూడా పాలకులు పన్నులు వేస్తుంటే, ఇక ప్రజలు బతికేదెలా? వారి ఆరోగ్యాలకు భరోసా ఎలా? దేశంలో నాసిరకం మందులు మార్కెట్‌లోకి వదులుతున్న వారు బాగానే వున్నారు. వాటిపై జీఎస్టీ వేసి పన్నులు వసూలు చేస్తున్న పాలకులు బాగనేవున్నారు. కాని ఆ మందులు కొని వేసుకున్న వారు హరీ మంటున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయేలా చేస్తున్నారు. ఏది కొనాలన్నా కొనబోతే కొరివి. అమ్మ బోతే అడవి అన్నట్లు వుంది. రైతులు పండిరచే పంటలకు ధరలు నిర్ణయించుకునే అధికారం రైతులకు లేదు. కాని వస్తువులుతయారు చేసే వారికి మాత్రం స్చేచ్చ వుంది. రైతులు పండిరచే ధాన్యాన్ని అడ్డికిపావుసేరుకు కొనే మిల్లర్లు , బియ్యంగా మార్చి, పరిశ్రమమలు, పిండిగా మార్చి, నూనెలుగా మార్చి ధరలు నిర్ణయిస్తే మాత్రం అదే రైతులు కొనుగోలు చేసుకోవాలి. పన్నుల భారం మోయాలి. మొక్క జొన్న పండిరచే రైతులకు లాభం లేదు. కాని వాటిని అమ్ముకునే వ్యాపారులకు లాభాల పంటలు పాలకులే చూపిస్తున్నారు. అందుకు పన్నుల మీద పన్నుల వసూలు చేస్తున్నారు. టైంపాస్‌ కోసం తినే పాప్‌ కార్న్‌ మీద కూడా రకరకాల పన్నులు ఏమిటో వినడానికే ఆశ్చర్యంగా వుంది. సగటు వ్యక్తి సంపాదన పన్నులకే సరిపోవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఒక బిడ్డ భూమ్మీదికి రావాలంటే వైద్య ఖర్చులు.దానికి పన్నులు. ఆ వ్యక్తి బతకాలంటే క్షణ, క్షణం అనుక్షణం ఖర్చులు. వాటికి పన్నులు. ఆఖరుకు చచ్చినా స్మశానానికి చెల్లింపులకు కూడా పన్నులు. అంటే బతకాలన్నా, చచ్చినా చచ్చినట్లు పన్నులు కట్టిన తర్వాతే కడతేరిపోవాలి. ప్రాణం గాలిలో కలవాలి. మనదేశం ట్రిలియల్‌ డాలర్ల ఎకానమీ దాటుతుందని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప దేనికీ పనికి రావడం లేదు. మన దేశంలో ఇప్పటికీ కోట్ల మంది ఆకలికి అలమటిస్తున్నారు. బతకలేక చస్తున్నారు. పన్నులు చెల్లించలేక నరకంచూస్తున్నారు. ప్రభుత్వాలు ఎలాగూ ఉపాది చూపించే పరిస్ఠితి లేదు. ఎవరైనా నలుగురికి ఉపాది కోసం ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా పన్నుల మీద పన్నులు వాయిస్తుండడంతో, ఎవరి కోసం కష్టడాలన్న దిగులు ప్రజల్లో మొదలౌతుంది. ఒక ఏడాదిసంపాదనలో నాలుగు నెలల సంపాదన ఇన్‌కం ట్యాక్స్‌లకు పోతుంది. నిత్యం చేసే ఖర్చులో సగానికి పైగా ఆదాయం పన్నులకే తరిగిపోతోంది. ఇక పొదుపు చేసుకునేందుకు దారేది. బ్యాంకుల్లో పది లక్షల కంటే ఎక్కువ వుంటే చాలు ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించకుంటే జైలు..ఇలా ఆర్ధిక వ్యవస్ధ పెరుగుతోందా? తరుగుతోందా? అన్న ఆలోచన రాజకీయ పార్టీలకు రావడం లేదు. పాలకులు అయ్యే నా ప్రజలు అనుకోవడం లేదు. కారు కొన్నా పన్నుల వాయింపు తప్పదు. పాతదైపోయిందని అమ్ముకున్నా పన్నుల వాయింపు మినహాయింపు లేదు. ఇల్లు కొనుక్కున్నా పన్ను తప్పదు. దానిని అమ్ముకున్నా తప్పదు. ఇక సగటు వ్యక్తికి గూడు కూడా లేకుండా భూమ్మీదకు వచ్చేది పన్నులు చెల్లించేందుకేనా? అన్నట్లు వ్యక్తి బతుకు తయారైంది. వాహనాలు కొనుగోలు చేస్తుంటే పన్నులు వేస్తున్నారు. రోడ్డు ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. దానికి తోడు పెట్రోలు, డీజెల్‌పై రోడ్డు సెస్సులు వసూలు చేస్తున్నారు. రోడ్లు వేసేవారికిమో బిల్లులు చెల్లిస్తున్నారు. పన్నుల మీద పన్నులు చెల్లిస్తున్న వాహనదారుల నుంచి టోల్‌ వసూలు చేస్తూ తోలు తీస్తున్నారు. ఎన్ని రకాలగా పన్నుల రూపంలో పీడిస్తున్నా చెల్లిస్తున్న మన భారతీయులు ఎంతటి ఓపిక మంతులో ఇక్కడ కూడా నిరూపించుకుంటున్నారు. నోరు మూసుకొని వుంటున్నారు. నోట్లోకి ముద్దలేకున్నా పస్తులుంటున్నారు. నాయకులకు జేజేలు కొడుతూ కాలం గడుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!