Farmers Protest Against Jharasangam MRO
ఈ ఎమ్మార్వో మాకొద్దు.. రైతులు, ప్రజల ఆగ్రహం
తహశీల్దార్ ఆదేశాలు ప్రజల ఆత్మగౌరవాన్ని కాళ్లతో తొక్కుతున్నట్లుగా మారాయి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం : ప్రజాస్వామ్య భారతదేశంలోనూ నిజాం కాలం నాటి దొరల దర్బార్ కొనసాగుతోందా అన్న అనుమానాలకు బలం చేకూర్చే ఘటనలు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం తహశీల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, మహిళలు, విద్యార్థులు, భూముల క్రయవిక్రయ దారులు చెప్పులు విడిచి లోపలికి వెళ్లాలన్న తహశీల్దార్ ఆదేశాలు ప్రజల ఆత్మగౌరవాన్ని కాళ్లతో తొక్కుతున్నట్లుగా మారాయి. ప్రభుత్వ కార్యాలయం భక్తి మందిరమా..? రైతు సేవకుడిగా ఉండాల్సిన అధికారి, తన కార్యాలయాన్ని వ్యక్తిగత దర్బార్‌గా మార్చుకుని “నేనింతే… నేను చెప్పిందే వేదం” అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారు చెప్పులను బయట వదిలి తన వద్దకు రావాలన్న ఎమ్మార్వో అహంకారానికి పరాకాష్ఠగా నిలుస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
బాధ్యతలు గత 2024 జూలై 31న తహశీల్దార్ గా పనిచేసిన సంజీవరావు పదవీ విరమణ అనంతరం, జహీరాబాద్ ఆర్డీవో కార్యాలయంలో డీఏవో బాధ్యతలు నిర్వహిస్తున్న ముత్యాల తిరుమలరావు తహసిల్దార్‌గా చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యాలయ నిబంధనలను తన ఇష్టానుసారంగా మార్చి, రైతులు మాత్రమే కాదు మహిళలు, విద్యార్థులు, ఇతర అధికారులు కూడా బయటే చెప్పులు వదలాలన్న అధికారపు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని పలుమార్లు రెవెన్యూ డివిజనల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాఖపరమైన చర్యలు కనిపించకపోవడం పై అధికారులు పై మరింత అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల గత శనివారం జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితాదేవి, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి ఆకస్మిక పరిశీలన సందర్భంగా రైతులు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో రైతులు బహిరంగంగానే దరిద్రపు ఎమ్మార్వో ను తొలగించండి అని ముక్తకంఠంతో అధికారులకు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఎమ్మార్వోతో నేను మాట్లాడతా ..
జహీరాబాద్ ఆర్డీవో దేవుజా రైతులు కార్యాలయానికి వచ్చే ఇతర ప్రజల ప్రజల చెప్పులు విషయాన్ని జహీరాబాద్ ఆర్డీవో దేవుజా “దిశ” వివరణ కోరగా ఎమ్మార్వోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.
ఎమ్మార్వోను తొలగించండి : నరసింహ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా యువత అధ్యక్షులు
రైతులకు సరైన పరిధిలో న్యాయం చేయకపోవడం, విచ్చలవిడిగా జరుగుతున్న మట్టి తవ్వకాలను పట్టించుకోకపోవడం, అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా ఏమాత్రం తనకు తెలియనట్టుగా నటిస్తున్న తహశీల్దార్ తిరుమలరావును వెంటనే తొలగించాలని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ యువత అధ్యక్షుడు నరసింహ డిమాండ్ చేశారు. రైతులు, సామాన్యులు ఎవరు తన వద్దకు వెళ్లినా చెప్పులను బయట విడిచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ విషయంపై పలువురు ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
