Collector Inspects Paddy Procurement and Hospital Facilities in Mancherial
ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఇటిక్యాల 1, తిమ్మాపూర్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం దిశగా ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చే సమయంలో నిబంధన ప్రకారం మట్టి గడ్డలు, తప్ప, తేమ ఇతర నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని,రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు,నీడ,తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు.కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసిన తర్వాత ఆన్ లైన్ లో ట్రక్ షీట్ జనరేట్ చేయబడుతుందని,కొనుగోలు కేంద్రం,మిల్లుల టాగింగ్ ఆటోమేటిక్ గా అవుతుందని, ధాన్యం లారీ పక్కదారి పట్టకుండా జిపిఎస్ పరికరం బిగించబడి ఉంటుందని తెలిపారు.రైతు వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని,రైతు భూమి విస్తీర్ణం,పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు.కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని రైతులు ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మండల కేంద్రంలోని 30 పడకుల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అవుట్ పేషెంట్ రిజిస్టర్,మందుల నిల్వలు,ల్యాబ్,వార్డులు, పరిసరాలను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని,వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని,వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు.ఆసుపత్రి ఆవరణలో కొనసాగుతున్న పోస్టుమార్టం గది నిర్మాణ పనుల వివరాలు తెలుసుకొని త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
