జైపూర్, నేటి ధాత్రి:
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని నక్షత్రం మొదలుకుని రేవతి నక్షత్రం వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తెలు నిర్ణయించడం జరుగుతుంది. భారతీయ సనాతన జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి హిమాలయ పర్వతాల నుండి నైరుతి రుతుపనాలు వీస్తుంటాయి. వీటి వలన వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలాగే ప్రస్తుతం భానుడి వేడి నుండి ఉపశమనం లభించి వాతావరణం చల్లగా మారి తరచు వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతులు పంట సాగు కోసం పొలాలను సిద్ధం చేసుకోవడం, దుక్కి దున్నడం, సేంద్రియ ఎరువులు చల్లడం తదితర పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. మృగశిర కార్తెలో ప్రకృతి పురుడు పోసుకున్నట్లుగా లేత చిగురులతో, అందమైన పూలతో, పండ్లతో వృక్షాలన్నీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి.