ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి…

ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

గ్రామ సభలు నిర్వహించి నిధులను ఖర్చు చేయాలి.

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలి.

దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చడానికి కృషి చేయాలి.

గ్రామ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించాలి.

99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు మండలం ఇంచర్ల గ్రామం లోని ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు మహిళా, శిశు సంక్షేమ, సెర్ప్, వైద్య ఆరోగ్య, విద్యా మరియు సంక్షేమ శాఖలు, పర్యావరణ, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మార్కెటింగ్, సహకార, పౌర సరఫరాల, మున్సిపల్ (పురపాలక), పంచాయతీ రాజ్, పోలీస్ రవాణా, గృహ నిర్మాణ, విద్యుత్, యువజన మరియు క్రీడా శాఖల పై శిక్షణ తరగతులు నిర్వహించగా మహిళా, శిశు సంక్షేమం, వైద్యం పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ప్రారంభించారు.
జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు 12 శాఖలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మధ్యాహ్నం మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ
దేశంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి సర్పంచ్ కృషి చేయాలని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలను గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటిలో భావించుకోవాలని, ప్రజా ప్రతినిధులు స్వార్థం కోసం పనిచేయకుండా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందని అన్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 6 వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు కేటాయించిందని, మరో 12 వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని ఆ నిధులను తీసుకోరావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలలో ప్రజా ప్రతినిధుల ప్రాతినిద్యం లేకపోయినప్పటికీ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఒక వెయ్యి మూడు కోట్ల రూపాయలను కేటాయించిందని, ఆనాడు చేసిన పనులకు కొంత మేరకు బిల్లులు చెల్లించగా ప్రస్తుతం 50 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇటీవల సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నేడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు, పురపాలక కౌన్సిలర్లకు 12 శాఖలపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణను ఏర్పాటు చేశామని, శిక్షణలో అవగాహన చేసుకున్న ప్రజాప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి తొమ్మిది రకాల అంశాలను పొందుపరచిందని, వాటిని అవగాహన చేసుకుని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలని అన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీ కోటి రూపాయలు, మరో రెండు గ్రామపంచాయతీలకు అదనంగా నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు. మారుమూల గ్రామాలు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీతక్క తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version