రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను విచారణ వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి నేటిధాత్రి
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, అసైన్డ్ భూముల విచారణ, భూ భారతి, 22-ఏ తదితర కీలక అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు.
మండలాల వారీగా దరఖాస్తుల స్థితిని తెలుసుకున్న కలెక్టర్ దరఖాస్తుల విచారణను వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారం కావాలంటే అధికారులు వచ్చిన దరఖాస్తులు ఆదారంగా క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. భూ రికార్డుల ప్రామాణికతను నిర్ధారిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని, అవసరమైన సందర్భాల్లో సంబంధిత అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.