కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి వార్డు ప్రజలను కోరారు. నర్సంపేట పట్టణంలోని 30వ వార్డులో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన వార్డు సభలో 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోని ఇందిరమ్మ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి జరుగుతోందని పేర్కొన్నారు.వార్డు సభలో మహిళలు తమ ప్రాంతంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని వినతిపత్రం సమర్పించగా, వాటి తొలగింపుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, డివిజన్ ఆర్‌పి, మున్సిపల్ జవాన్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
