మేడారం సమ్మక్క సారలమ్మ పాదయాత్ర ప్రారంభం

మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా బయలుదేరిన భక్తజనులు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

మేడారం సమ్మక్క–సారలమ్మ తల్లులపై అచంచలమైన భక్తితో వరంగల్ ఉమ్మడి జిల్లా, ప్రస్తుత మానుకోట జిల్లా తొర్రూర్ నుంచి భక్తజనులు పాదయాత్రగా మేడారం వైపు ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్ర బృందం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రజలకు, భక్తి భావంతో దర్శనమిచ్చారు.ప్రతి ఏటా ఆనవాయితీగా కొనసాగుతున్న ఈ పాదయాత్రను ఈ సంవత్సరం కూడా గురువారం 22వ తేదీ నుంచి ప్రారంభించగా, సోమవారం 26వ తేదీన మేడారం చేరుకోనున్నట్లు పాదయాత్రకు సమన్వయం వహిస్తున్న కూరపాటి కామారాజు తెలిపారు.
ఈ పాదయాత్రలో స్త్రీలు, పురుషులు కలిపి సుమారు 300 మంది భక్తులు గ్రూపులుగా బయలుదేరగా, ఒక్కో గ్రూపులో సుమారు 45 మంది భక్తులు పాల్గొంటున్నారని తెలిపారు. పూర్వీకుల కాలం నుంచే తమ కుటుంబాల్లో కొనసాగుతున్న సంప్రదాయంగా ప్రతి జాతర సమయంలో పాదయాత్రగా వెళ్లి తల్లుల దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన పేర్కొన్నారు.
పాదయాత్రలో హస్తం వెంకన్న, తిరుపటి శ్రీనివాస్, కిన్నెర మోహన్, హస్తం వెంకటమ్మ, తిరుపటి శైలజ, లక్ష్మి, సారమ్మ, ధనమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, యువకులు, యువత సమాన ఉత్సాహంతో మేడారం తల్లుల దర్శనానికి పాదయాత్రగా సాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పాదయాత్ర భక్తుల హృదయాలను కదిలిస్తోంది.

మేడారం మహాజాతర తేదీలు ఖరారు .

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

 

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు

 

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరుగనుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు.

 

 

 

ఆపై 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుంది. 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరుతున్నారు. కాగా.. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం జాతర జరుగుతుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగ.

 

మేడారం జాతర నిర్వహణ తేదీలను విడుదల

“నేటిధాత్రి”, మేడారం.

 

మేడారం సమ్మక్క సారలమ్మ -2026 జాతర నిర్వహణ తేదీలను విడుదల చేసిన పూజారులు..

జతర ఏర్పాట్లను పరిశీలించిన ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్..

 

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి..

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఐటీడీఏ ఏపీవో డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం జతర ఏర్పాట్లను పరిశీలించి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆలయ కమిటీ సమన్వయంతో అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లు పూర్తి చేశారని ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాలతో ఏర్పాట్లు అనుకున్న స్థాయిలో పూర్తయ్యాయని ఆయన తెలిపారు. మూడు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, త్రాగునీరు, పారిశుద్ధ్యం విద్యుత్ లైన్లో ఏర్పాటుచేసి ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నింపామని ఆయన తెలిపారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం, ఆర్డబ్ల్యూఎస్ విభాగం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ శాఖ, వైద్యశాఖ, ఆలయ కమిటీ, సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. సమస్యలు ఉంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని పిఓ గారితో చర్చించి సమస్యల త్వరితగతిన పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. గుడికి బోర్వెల్, కాంపౌండ్ వాల్, స్నానాల ఘట్టాలు, త్రాగునీరు, షెడ్లు, సత్తర్ నిర్మించాలని మాజీ శాసనసభ్యులు మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య కోరారు, ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన జాతరకు ఈ సంవత్సరం ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తాత్కాలిక ఏర్పాట్లు పూర్తయ్యాయని, గుడికి సంబంధించిన శాశ్వత పనులు గురించి, చందా లింగయ్య తెలిపిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.అధికారులందరూ జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దేవ వర కుమార్, తహసిల్దార్ నాగప్రసాద్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజేందర్, ఐ టి డి ఎ డి ఈ మధుకర్, ఏఈ యోగేశ్వరావు, జూనియర్ అసిస్టెంట్లు వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ తిరుమలేష్, డి ఈ బ్రహ్మదేవ్, ఏఈ విజయ్ కృష్ణ, కార్యదర్శులు, రామకృష్ణ, రవి, మారుతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version