మల్లక్కపేటలో గ్రామ సభ రోడ్డు భద్రతపై అవగాహన…

మల్లక్కపేటలో గ్రామ సభ రోడ్డు భద్రతపై అవగాహన

పరకాల,నేటిధాత్రి

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో సర్పంచ్ దొమ్మటి కవిత మధు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్బంగా గ్రామ అభివృద్ధి అంశాలతో పాటు,పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా చర్చించారు.అనంతరం నో హెల్మెట్ నో ఎంట్రీ నినాదంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలోఉన్న ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఇతరులు హెల్మెట్ లేకుండా గ్రామంలోకి ప్రవేశాన్ని నిరోధించే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,అధికారులు రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణాలు,వాటి నివారణ చర్యలపై గ్రామస్థులకు వివరించారు.అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్,ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.హెల్మెట్ వినియోగం ద్వారా ప్రాణ నష్టం తగ్గించవచ్చని సూచించారు.గ్రామస్థులు, ముఖ్యంగా యువత రోడ్డు భద్రత విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.గ్రామ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయాలను కచ్చితంగా అమలు చేస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొమ్మటి కవిత మధు,ఉపసర్పంచ్ పాలకుర్తి నాగశ్రీకాంత్,పంచాయతీ కార్యదర్శి సుమలత,కానిస్టేబుల్ రామకృష్ణ,వార్డు మెంబర్లు,గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి..

మృతుల కుటుంబాలను పరామర్శించిన చల్లా ధర్మారెడ్డి

పరకాల,నేటిధాత్రి

మండలం మల్లక్కపేట గ్రామాలలో ఇటీవలే మృతిచెందిన బిఆర్ఎస్ నాయకులు సాదు రాములు,రాసమల్ల సురేందర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు.అనంతరం వారి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2ఏప్రిల్ న ఆంజనేయస్వామి కల్యాణమహోత్సవం..

2ఏప్రిల్ న ఆంజనేయస్వామి కల్యాణమహోత్సవం

భక్తులు పాల్గొని దైవాశిస్సులు పొందండి

పరకాల,నేటిధాత్రి

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఉన్న శ్రీ భక్తంజనేయ స్వామి దేవస్థానంలో ఏప్రిల్ 2న ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు,కల్యాణోత్సవ కార్యక్రమాలు బండ్లు తిరుగుట భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.ఉదయం నుంచే ఆలయంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని,అనంతరం ఆంజనేయ స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని భక్తులకు పిలుపునిచ్చారు.భక్తుల కోసం తాగునీరు,ప్రసాదం,అన్నప్రసాదం వంటి ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ కోరింది.

మల్లక్కపేటలో మిర్చి దొంగతనం

మల్లక్కపేటలో మిర్చి దొంగతనం

దాదాపు 6బస్తాల వరకు మిర్చిని ఎత్తుకెళ్లిన దొంగలు

తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు

మిర్చి ఎత్తుకెళ్లడంతో కుటుంబం పై ఆర్థిక ప్రభావం పడుతుంది-రైతు దొమ్మటి బాబు

పరకాల,నేటిధాత్రి

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో మిర్చి దొంగతనం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు దొమ్మటి బాబు పండించిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు దోచుకెళ్లిన ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు ఎత్తుకెళ్లడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే, మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు తన వ్యవసాయ భూమిలో పండించిన మిర్చిని కోసి పొలంవద్ద నిల్వ ఉంచాడు.మార్కెట్ కు తరలించేందుకు సిద్ధంచేసుకునే క్రమంలో మిర్చీని బావి వద్దనే ఎందబోసిన క్రమంలో రాత్రికి రాత్రే మాయం కావడంతో రైతు తీవ్రంగా కలత చెందాడు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 6బస్తాల వరకు మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.రోజులాగానే తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు మిర్చి కుప్ప అనుమానస్పదంగా చిందర మందరగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.వెంటనే గ్రామస్థులకు విషయం తెలియజేశాడు.రైతులు తమ పంటలను రాత్రి వేళల్లో కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామంలోని ఇతర రైతులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి దొంగతనాలు కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలపై ఆధారపడి జీవించే రైతులకు ఇది పెద్ద దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు.

దొంగతనానికి గురైన మిర్చి పంట రైతు-దొమ్మటి బాబు

ఈ సందర్భంగా రైతు దొమ్మటి బాబు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు దోచుకెళ్లడం తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.నెలల తరబడి శ్రమించి పండించిన మిర్చిని మార్కెట్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన సమయంలో ఈ దొంగతనం జరగడం చాలా బాధ కలిగించిందని పేర్కొన్నాడు.రాత్రికి రాత్రే దాదాపు పది బస్తాల మిర్చి మాయం కావడంతో తనకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపాడు.మార్కెట్‌లో మిర్చి ధరలు కొంత మెరుగ్గా ఉన్న సమయంలో అమ్మేందుకు సిద్ధం చేసిన పంట ఇలా పోవడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని వాపోయాడు. రైతులు ఎంతో కష్టపడి పండించే పంటలను కాపాడుకునేందుకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version