సిట్ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాల ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.
వైసీపీ హయాంలో హిందూ మతంపై దాడులు..
గురువారం.. అమరావతి సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన పవన్.. ఐదేళ్లు తామే అధికారులంలో ఉంటామని.. రాజకీయలబ్ధి కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ.. భగవంతుడిపై పగబట్టిందని ధ్వజమెత్తారు. అందరం ఏడు కొండలు అంటామని.. వైసీపీ వాళ్లు రెండు కొండలు అంటారని అన్నారు. వైసీపీ హయాంలో హిందూ మతంపై చాలా దాడులు జరిగాయని ఆరోపణలు చేశారు. రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకొకటి కొందామన్నారని గుర్తుచేశారు. అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివారు చేశారని చెప్పారన్నారు.
మతాల ప్రస్తావన లేదు..
నెయ్యి కల్తీ అంశంలో మతాల ప్రస్తావన లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘తప్పు చేసి క్షమాపణ అడగకుండా మమ్మల్నే క్షమాపణ అడుగుతున్నారు. శ్రీవారి విషయంలో తప్పుచేసిన వారు నాశనమైపోతారు. సిట్ రిపోర్ట్ ఎక్కడా వైసీపీకి క్లీన్చిట్ ఇవ్వలేదు. రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది. భగవంతుడితో పెట్టుకున్నవారు సర్వనాశనం అయిపోతారు తప్ప బతికున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా చేసిన మహాపాపానికి దేవుడిని క్షమాపణ కోరుకోవాలి. భగవంతుడికి మోకరిల్లే వరకూ విషయాన్ని వదిలిపెట్టం. హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాం. కల్తీ లడ్డూ వ్యవహారం ముమ్మాటికీ తెలిసి చేసిన నేరం. 2022లోనే కల్తీ నిర్ధారణ అయిననూ.. అయోధ్యకు అవే కల్తీ లడ్డూలు పంపి మహాపాపానికి ఒడిగట్టారు’ అని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు.
