సంజీవని ప్రాజెక్టు, ఆర్టీజీఎస్, అమరావతిపై బిల్ గేట్స్ ప్రశంసలు
ఆర్టీజీఎస్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు.
అమరావతి, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో (CM Chandrababu Naidu) కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ (Bill Gates) సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించారు బిల్ గేట్స్. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా పౌర సేవల్ని వేగంగా అందిస్తున్న తీరు, ఫలితాలను గేట్స్‌కు ముఖ్యమంత్రి వివరించారు. డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి బిల్ గేట్స్ తెలుసుకున్నారు. ఆర్టీజీఎస్‌లోని డిస్ ప్లే వాల్స్‌పై ప్రజెంటేషన్లను పరిశీలించారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు. డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవల్ని సులభతరం చేయడం బాగుందన్నారు గేట్స్.
అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి, వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గేట్స్‌కు సీఎం తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని బిల్ గేట్స్ ప్రశ్నించారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామని… అలాగే, భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. ట్యాక్స్ కలెక్షన్ ప్రక్రియ అద్భుతంగా ఉందని గేట్స్ కొనియాడారు. జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు కూడా గణనీయంగా పెరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
