వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
పిల్లల వైద్య నిపుణులు ఎండి.డాక్టర్ మామిడి తిరుపతి
పరకాల,నేటిధాత్రి
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండలు ఎక్కువవుతున్న తరుణంలో చిన్నారులు,వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.మధ్యాహ్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని,ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుందని బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ,గుడ్డ లేదా గొడుగు వాడాలని సూచించారు.శరీరంలో నీరు తగ్గిపోకుండా తరచూ నీరు,మజ్జిగ,కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలని అన్నారు.చిన్నారులకు జ్యూసులు,లస్సీ వంటి పానీయాలు ఇవ్వడం మంచిదని పేర్కొన్నారు.వడదెబ్బ లక్షణాలు అయిన తలనొప్పి,వాంతులు,అధిక దాహం,అలసట కనిపించినప్పుడు వెంటనే నీడలో విశ్రాంతి తీసుకోవాలని,అవసరమైతే సమీప వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.బయట నుంచి వచ్చిన వెంటనే చల్లని నీటితో స్నానం చేయడం లేదా ముఖం కడుక్కోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గించుకోవచ్చని తెలిపారు.అలాగే తేలికపాటి దుస్తులు ధరించడం మంచిదని సూచించారు.ప్రజలు ఎండ తీవ్రతను నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బను సులభంగా నివారించవచ్చని డాక్టర్ మామిడి తిరుపతి స్పష్టం చేశారు.
