నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ…

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ (BJP MP Paka Satyannarayana) వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రజల ఆశలకు అనుగుణంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ బడ్జెట్‌తో దేశ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారని తెలిపారు.
ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని వివరించారు. 2014లో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, నేడు నాల్గోస్థానానికి చేరుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదేళ్ల అద్భుత పరిపాలనకు నిదర్శనమని ఉద్ఘాటించారు. 2014లో రూ. 14.30 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్, నేడు రూ. 50.40 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పుకొచ్చారు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడమే కాకుండా, ప్రపంచ యుద్ధాల ప్రభావం భారత్‌పై పడకుండా ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులు, యూరోపియన్ యూనియన్‌తో కుదుర్చుకున్న ఒప్పందాలు భారతదేశ పరపతిని పెంచాయని తెలిపారు.

భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు చెప్పడం విశేషమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్‌లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందనుందని వెల్లడించారు.

ప్రపంచ ఆక్వా ఎగుమతుల్లో భారత్ వాటా 76 శాతం కాగా, అందులో 60శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వివరించారు. ఈ రంగానికి బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం పెరిగి, భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా, ఈ బడ్జెట్ అటు దేశ భద్రతకు, ఇటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.

విజయవాడలో బీజేపీ వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకా సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కరించేలా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ‘వారధి’ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలపారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను, సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య ఒక ‘వారధి’లా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version