హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య
హనుమకొండ, నేటిధాత్రి :
హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని అన్ని గురుకుల హాస్టళ్లలో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య తెలిపారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గురుకుల హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలఫై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను పెంచిందన్నారు. అదేవిధంగా 16 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలను 200% పెంచిందని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఈనెల 14వ తేదీ నుండి అమలయ్యే నూతన డైట్, కాస్మోటిక్ చార్జీల ఫై జిల్లాలోని ప్రతి గురుకుల హాస్టల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సంబంధిత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లను ప్రతి గురుకుల హాస్టల్ లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గురుకుల విద్యాసంస్థ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, డీఈవో వాసంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.