నూతన టిటిడి ఛైర్మన్‌గా బి.ఆర్. నాయుడు
శ్రీవారికి, భక్తులకు మధ్య అనుసంధానతను పెంచాలి
మధ్య దళారులతో భక్తులకు ఇబ్బందులు
శ్రీవారి దర్శనం అత్యంత ఖరీదైంది కారాదు
పుణ్యక్షేత్రంలో వ్యాపార పోకడలు తగదు
హైదరాబాద్,నేటిధాత్రి:
తిరుమల తిరుపతి బోర్డు నూతన ఛైర్మన్‌గా టీవీ5 ఛానల్ అధినేత బి.ఆర్. నాయుడును ప్ర భుత్వం నియమించింది. ప్రస్తుతం బోర్డు సభ్యుల సంఖ్య 23. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన బోర్డు సభ్యుల్లో ఏపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, తెలంగాణ నుంచి ఐదుగు రు, కర్ణాటక నుంచి ముగ్గురు, తమిళనాడు నుంచి ఇద్దరు, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలనుంచి ఒక్కొక్కరు చొప్పున వున్నారు. త్వరలో భాజపాకు చెందిన మరో సభ్యుడు ఇందులో చేరే అవకాశముంది. తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు వాడుతున్నారని చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో రేగిన వివాదం తర్వాత ఛైర్మన్‌తో పాటు కమిటీ సభ్యుల నియామకాలు జరిగిన నేపథ్యంలో, ఇక ముందు ఇటువంటి వివాదాలకు తావులేకుండా కొత్త ట్రస్ట్ సభ్యులు తగిన చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చు. ప్రస్తుత టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన వారైనప్పటికీ, హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు మాత్రమే కాదు దాతృత్వ కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటారని హిందువుల్లో మంచి పేరుసంపాదించకున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతరాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2007, అక్టోబర్ 2న టీవీా5 పేరుతో 24I7 తెలుగు వార్తల ఛానల్‌ను శ్రేయ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కింద ప్రారంభించారు. ఆయనకు మంచి లాభాలతో నడిచే నూజెన్ హెయిర్ ఆయిల్ కంపెనీ వుంది. ఈ కంపెనీ దన్ను తోనే ఆయన టీవీా5 ఛానల్‌ను ప్రారంభించినట్టు చెబుతారు. ప్రస్తుతం ఆయన టీటీడీ ఛైర్మన్‌గా నియమితులు కావడంవల్ల, తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాలకు మరింతప్రా చుర్యం లభించే అవకాశం ఏర్పడిరది.
అవినీతిని అరికట్టాలి
మాజీ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ తదితరులపై తిరుమలలో వి.ఐ.పి. టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.10500 విలువైన టిక్కెట్లను ఏకంగా రూ.65వేలకు అమ్మి భక్తులను మోసం చేసారని తిరుమల విజిలెన్స్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. సెప్టెంబర్‌నెలలో చంద్రబాబు నా యుడు తిరుపతి లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపినట్టు చేసిన ఆరోపణ ఒక వివాదం సృష్టించ గా ఈ టిక్కెట్ల అక్రమ అమ్మకం వివాదం రెండవది. ఇంతగా వివాదం రేగినప్పటికీ లడ్డూల అ మ్మకాలు పెరిగాయే తప్ప తగ్గకపోవడం, శ్రీ వేంకటేశ్వరస్వామిపై భక్తులకున్న అపార భక్తి విశ్వాసాలే కారణం. అయితే తిరుమలలో వసతి, దర్శన టిక్కెట్లు ప్రత్యేక దర్శన టిక్కెట్లు, వివిధ రకాల సేవల విషయంలో మధ్యదళారీలు విపరీతంగా భక్తులనుంచి వసూలు చేస్తున్న నేపథ్యంలో టి.టి.డి. ఇటువంటి వారిని అరికట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఎంతగా చర్యలు తీసుకున్నప్పటికీ పాతుకు పోయిన దళారీవ్యవస్థ వల్ల భక్తులకు తిప్పలు తప్పడంలేదు. దూరప్రాంతాల భ క్తులకు రైళ్లు, విమానాల్లో టిక్కెట్లు దొరుకుతున్నాయి కానీ శ్రీవారి దర్శన టిక్కెట్లు దొరకడం దుర్లభమవుతోంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శ్రీవారి దర్శనం చేసుకోకుండానే ఎంతోమంది భక్తు లు తిరిగి వెళ్లిపోయే సంఘటనలు కూడా సర్వసాధారణమైపోయాయి. ఆన్‌లైన్లో వివిధ సేవలకు టిక్కెట్లు క్షణాల్లో అయిపోతాయి. అదే దళారీలను ఆశ్రయిస్తే అప్పటికప్పుడుకూడా టిక్కెట్లు ఇ బ్బంది లేకుండా లభిస్తున్నాయి. ఇది చాలా దారుణం. కుబేరుడికి, శ్రీవారు బాకీ…మరి శ్రీవారికిభక్తులు బాకీ…ఇప్పుడు శ్రీవారు, భక్తులు దళారులకు బాకీ అన్నట్టు తయారైంది! పాపం కుబేరుడు కుదేలైపోయాడు!! స్వామికి నిలువు దోపిడీ ఇష్టం…కానీ ఇప్పుడు దళారులకు నిలువుదోపిడీ చెల్లిస్తే కానీ స్వామి వారి దర్శనం కావడంలేదు. ఆదాయ వనరులున్న ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంతో పోటీ వుంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా టీటీడీలో కూడా అటువంటి పోస్టులకు పోటీ దారుణంగా వుంటోందన్న ఆరోపణలున్నాయి. ఎంత మొత్తమైనా లంచంగా చెల్లించి ఆ పోస్టులను దక్కించుకోవడానికి వెనుకాడటం లేదు. రూములు కేటాయించే ఉద్యోగి రోజువారీ ఆదాయం రూ.20వేలు అంటే ఇంకా ఇటువంటి పోస్టుల్లో వున్నవారి అదనపు ఆదాయం ఏస్థాయిలో వుంటుందో అంచనా వేయవచ్చు. ఇక టీటీడీ బోర్డు మెంబర్ల పోస్టులు పొందాలన్నా ముడుపులు చెల్లించకపోతే దక్కని పరిస్థితి వుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు మెంబరు పదవికి రూ.40లక్షల వరకు ధర పలికితే ఇప్పుడది ఏకంగా రూ.కోటీ ఇరవై లక్షలకు పెరిగిందన్న ఆరోపణలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు రూ.80లక్షల వరకు చెల్లించడానికి ముందుకొచ్చినా ఇంకా పెరిగిన డిమాండ్‌తో వెనక్కి తగ్గినట్టు తెలిసింది.మరి బోర్డు సభ్యుడి పదవికి అంత డిమాండ్ ఏంటని అనుమానం రావచ్చు. వీరిలో కొందరు తిరుపతిలో లాడ్జ్‌లు అద్దెకు తీసుకొని తమకు రోజువారీగా కేటాయించే దర్శన టిక్కెట్లను, తమ ఆధీనంలో వున్న లాడ్జ్ ఖర్చులతో సహా ప్యాకేజీ నిర్ణయించి భక్తులనుంచి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆవిధంగా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తున్నప్పుడు, బంగారు బాతు లాంటి బోర్డు సభ్యుడి పదవిని పొందడానికి ఎంతైనా ఖర్చుకు వెనుకాడరు మరి! ఈవిధంగా భక్తి స్థానాన్ని బిజినెస్ ఆక్రమించడం ఘోరం! దిగువస్థాయినుంచి పైస్థాయి వరకు జరుగుతున్న ఇంతటి అవినీతి అడుగడుగునా భక్తుల దోపిడీని అరికట్టడానికి నూతన టిటిడి ఛైర్మన్ కఠిన చర్యలు తీసు కోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.
భారీ బడ్జెట్
2023-24 టీటీడీ బడ్జెట్ అంచనా రూ.4385.25 కోట్లు. 2022-23 బడ్జెట్‌లో హుండీ ఆదాయం రూ.900 కోట్లు వస్తుందని అంచనా వేయగా, తాజాగా సవరించిన అంచనాల ప్రకారం ఈ ఆదాయం రూ.1588కోట్లుగా తేలింది. వివిధ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ ద్వారా రూ.990 కోట్లు ఆదాయం లభించగలదని టీటీడీ అంచనా. అదేవిధంగా ప్రత్యేక దర్శన టిక్కెట్ల అమ్మకం ద్వారా రూ.330కోట్లు, ఆర్జిత సేవల ద్వారా రూ.140కోట్లు, వసతి మరియు కళ్యాణ మండపాలనుంచి అద్దెల రూపంలో రూ.129కోట్లు, తలనీలాల అమ్మకాల ద్వారా రూ.126.50కోట్లు రాగలవని ఈ ఏడాది టీటీడీ బడ్జెట్ అంచనా.
టీటీడీ ఒక స్వతంత్ర ప్రభుత్వ ట్రస్ట్
తిరుమలాతిరుపతి దేవస్థానం (టీటీడీ) ఒక స్వతంత్ర ప్రభుత్వ ట్రస్ట్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దేశంలో ఇటువంటి స్వతంత్ర ట్రస్ట్ మరొకటి లేదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఆర్థిక వ్యవహారలను ఈ ట్రస్ట్‌నిర్వహిస్తుంటుంది. నిత్యం అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. కాగా ఈ ట్రస్ట్ అనేక సామాజిక, మతపరమైన, సాహిత్య మరియు విద్యాకార్యక్రమాలను నిర్వహి స్తుంటుంది. టీటీటీ ప్రధాన కార్యాలయం తిరుపతిలో వుండగా, ఈ దేవస్థానం కింద 16వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రోత్సహించే సంకల్పంతో టీటీడీ 2019లోశ్రీవారి ట్రస్ట్‌ను నెలకొల్పింది. దీని ప్రధాన ఉద్దేశం ఎస్సీ/బీసీ/ఎస్టీలు నివాసముండే ప్రాంతాల్లో దేవాలయాల నిర్మాణం చేపట్టడం, పురాతన దేవాలయాల పునరుద్ధరణ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేవాలయాలకు ధూపాదీపానైవేద్యాల కోసం తగిన ఆర్థిక సహాయం అందించడం ఈ ట్రస్ట్ ప్రధాన విధి. 2023 జనవరి నెలఖారు నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల్లో టీటీడీ మొత్తం 2068 దేవాలయాల నిర్మాణం చేపట్టింది. 2024 నాటికి దేవాలయం నికర ఆస్తుల విలువ రూ.3లక్షల కోట్లు (36బిలియన్ డాలర్లు). ప్రపంచంలో ఇంతటి సంపన్న హిందూ దేవాలయం మరోటి లేదు.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర హయాంలో ఏర్పాటు
1932లో నాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ యాక్ట్ ద్వారా, టీటీడీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏడుగురు కమిటీ సభ్యులుండగా, ప్రభుత్వ జీతభత్యాలతో పనిచేసే ఒక కమిషనర్ నేతృత్వం వహించేవారు. ఈ కమిషనర్‌ను మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వం నియమించేది. ఈ కమిటీకి రెండు సలహా మండళ్లు వుండేవి. ఇందులో ఒకటి పూజార్లు, దేవాలయ పాలనాధికార్లతో , రెండవది రైతులతో కూడి వుండేవి. మొదటి కమిటీ దేవాలయ వ్యవహారాలపై, రెండవ కమిటీ ఆలయ భూములు, లావాదేవీలపై కమిటీకి ఎప్పటికప్పడు తగిన సలహాలు సూచనలు ఇస్తుండేవి. 1969లో ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఎండో మెంట్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంలోని 85 నుంచి 91 వరకు వు న్న సెక్షన్లు టీటీలో అప్పటివరకు అమలవుతున్న నిబంధనలను మరింత విస్తృతం చేశాయి. వీటి ప్రకారం అప్పటివరకు వున్న ట్రస్టీల సంఖ్య 5నుంచి 11కు పెరగడమే కాదు, కొన్ని వర్గాలకు ఈ ట్రస్ట్‌లో భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేశారు. దేవస్థానం అప్పటివరకు నిర్వహిస్తున్న బాధ్యతలకు అదనంగా భారతీయ భాషల అధ్యయనానికి ప్రోత్సాహం కల్పించడం, పరిశోధనల ద్వారా హైందవ ధర్మానికి ప్రచారం, బోధన, శిక్షణ మరియు ఇందుకు అవసరమైన సాహిత్యాన్ని సృష్టించడం వంటి కార్యకలాపాలను కూడా చేపట్టాలని ఈ చట్టం నిర్దేశించింది. 1987లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ ఎండో మెంట్ యాక్ట్ పేరుతో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ట్రస్ట్ సభ్యుల సంఖ్యను 11నుంచి 15కు పెరిగింది. ఆలయ పూజారుల వంశపారంపర్య హక్కులు రద్దయ్యాయి. దీంతో హుండీ ఆదాయంలో వారికి వాటా లేకుండా పోయింది. తర్వాతి కాలంలో పూజార్లనుంచి వచ్చిన తీ వ్రమైన ఒత్తిడి నేపథ్యంలో 2006లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేసి ఇందులోని వివాదాస్పద రెండు క్లాజ్‌లను రద్దుచేసింది.
పాలనా బాధ్యతలు ట్రస్ట్‌వే
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ప్రధానంగా శ్రీవేంకటేశ్వర ఆలయ పాలనా బాధ్యతలను ని ర్వహిస్తుంది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న హిందూ దేవాలయాల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంటుంది. ఇందులో చారిత్రక దేవాలయాలు, టీటీడీ కొత్తగా నిర్మించినవి భాగంగా వుంటాయి. ప్రభుత్వంలో ఎన్ని శాఖలుంటాయో దాదాపు అన్ని శాఖలు టీటీడీలో కూడా పనిచేస్తున్నాయి. భక్తులకు టీటీడీ అనేక సదుపాయాలు కల్పిస్తోంది. రవాణా, ఆహారం, వసతి ఏర్పాట్లు భక్తులకు అందుబాటులో వుంటాయి. క్యూలైన్ నిర్వహణ, కళ్యాణకట్ట, లడ్డూల పంపిణీని కూడా చక్కగా నిర్వహిస్తోంది. దేవస్థానం ఆధ్వర్యంలో జూనియర్ Ê డిగ్రీ కళాశాలలు, హైస్కూళ్లు కళ్యాణ మండపాలు పనిచేస్తున్నాయి. దేవస్థానానికి చెందిన పరిశోధక విభాగం సంస్కృత గ్రంథాలపై అధ్యయనం చేసి వాటినుంచి తెలుగుతో సహా భారతీయ భాషల్లోకి అనువదించి అందరికీ అం దుబాటులోకి తీసుకువస్తోంది. ఏటా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో, క్యూ నిర్వహణ కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సహాయంతో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను డిజైన్ చేయడం ద్వారా మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు వృద్ధి చేస్తోంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌లో భక్తుకు ఉచిత అన్నప్రసాద వితరణ నిత్యం కొనసాగుతోంది. మాతృశ్రీ తరిగొండ అనంత కోటిరాజు ఇందుకు దాత. ఆలయానికి విరాళాల ద్వారా నెలకు వచ్చే ఆదాయం సగటున రూ.13కోట్లు. 2011లో తలనీ లాల వేలం ద్వారా వ చ్చిన ఆదాయం రూ.150కోట్లు కాగా 2012లో ఇది రూ.203కోట్లకు పెరిగింది. 2007లో టిక్కెట్ల అమ్మకం ద్వారా ఆలయానికి వచ్చిన ఆదాయం 25 మిలియన్ డాలర్లు. లడ్డూ తయారీకి టీటీడీ జర్మనీకి చెందిన మైకో బోస్చ్ కంపెనీనుంచి యంత్రాలను కొనుగోలు చేసింది. 2007లో లడ్డూల అమ్మకం ద్వారా టీటీడీ ఆదాయం 10 మిలియన్ డాలర్లు. ఇంతటి ప్రాభవం వున్నదంటే అందుకు స్వామివారి కరుణ, దయే కారణం.
కర్మ వదిలిపెట్టదు
ధార్మికతకు, సనాతనధర్మ పరిరక్షణకు కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఎన్ని ఆరోపణలు వచ్చినా హిందువుల్లో వున్న సహనశీలత, శ్రీవారిపై వున్న అనన్యమైన భక్తి ప్రేమల వల్ల టీటీడీ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతమైన దేవస్థానంగా పరిగణించబడుతోంది. అంతటి ఆదాయం కలిగి, ప్రపంచ వ్యాప్తంగా భక్తులను, విరాళాలను ఆకర్షిస్తున్న ప్రముఖ ధార్మిక కేంద్రమైన తిరుమలను అపవిత్రం చేయడానికి, ప్రాభవాన్ని దెబ్బతీయడానికి ఎన్నోశక్తులు ప్రయత్నిస్తూనే వుంటాయి. కానీ దివ్యమైన శ్రీవారి క రుణా వీక్షణాలు ఆయన భక్తులను ఎప్పుడూ కాపాడుతూనే వుంటాయి. అటువంటి పెద్దాయనతో పెట్టు కున్నవారు, భక్తులను దోచుకోవడమే కాకుండా, పవిత్రక్షేత్రంలో అక్రమాలకు పాల్పడిన వారు భయంకరమైన కష్టనష్టాలకు గురైన సంఘటనలు ఎన్నో. చేసిన పాపాన్ని బట్టి కష్టాలభా రం అను భవిస్తున్నవారి ఉదంతాలను తిరుమలలోని స్థానికులు చెబుతున్నప్పుడు వింటే స్వామి వారి మహత్మ్యం స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని అర్థం చేసుకున్నవారు భక్తినే నమ్ముకుంటారు. అక్రమాలకు పాల్పడేవారిని భగవంతుడైనా క్షమిస్తాడేమో కాని, కర్మ మాత్రం వదిలిపెట్టదు. ఇది చాలా కఠినమైంది. అంతకుదగ్గ ఫలితాన్ని ఇవ్వక మానదు. ఈ సత్యం తెలిసినవాడు వత్తిలా వెలుగుతాడు, తెలియనివాడు బూడిదైపోతాడు.