అంతా కలిసి అల్లు అర్జున్‌పై నెట్టేశారు: పవన్‌ కళ్యాణ్‌

 

గోళ్లతోపోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు

రేవంత్‌ సమర్థవంతమైన నాయకుడు

ప్రభుత్వాన్ని ‘కెలికింది’ సినీ పెద్దలే

అండగా ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి

లౌకిక రాజకీయంతో మొదటికే మోసం

ప్రమోషన్లకు హీరోలు వెళ్లకుండా ఉండటమే మంచిది!

హైదరాబాద్‌,నేటిధాత్రి:

సంధ్య ధియేటర్‌ సంఘటనపై సోమవారం మంగళగిరిలో జరిగిన మీడియా ‘ఆఫ్‌ ది రికార్డ్‌’ చిట్‌చాట్‌లో సంధ్య థియేటర్‌ సంఘటనపై పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు మీడియా విపరీతమై న హైప్‌ ఇస్తుండటంతో, ఛానళ్లలో మరో వార్తకు స్థానంలేకుండా పోయింది. ఇంతకూ వైరల్‌ అవుతున్న వార్తల సారాంశమేంటంటే సంఘటన జరిగిన వెంటనే వెళ్లి పరామర్శించి సారీ చెప్పినట్లయితే సమస్య ఇంత దాకా వచ్చేదికాదంటూ మాట్లాడారు. సినిమా అన్నప్పుడు హీరో ఒక్కడు మాత్రమే కాదు, టీమ్‌ వర్క్‌ వుంటుంది. రేవతి మరణం చాలా బాధాకరమైన సంఘటన. మరు నాడు సినిమా టీమ్‌ సభ్యులు పరామర్శించి, మేమున్నామని భరోసా ఇచ్చినట్లయితే సమస్యల ఇంత దూరం వచ్చి వుండేది కాదు. అంతా కలిసి అల్లు అర్జున్‌పై మొత్తం నెట్టేశారన్నారు. సిని మా ప్రమోషన్లకు హీరోలు పోకుండా వుంటేనే మంచిదని, తాము కూడా గతంలో ఇటువంటి పరిస్థితులను గమనించి ఆవిధంగా వెళ్లడాన్ని విరమించుకున్నామని, గోటితో పోయేదాన్ని గొడ్డలి దాగా తీసుకొచ్చారని కూడా ఆ యన వ్యాఖ్యానించినట్టు మీడియాలో వార్తలు వెల్లడిస్తున్నాయి. రేవంత్‌ రెడ్డి మంచి డైనమిక్‌ లీడర్‌ అంటూనే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కొంత సాఫ్ట్‌ గా వ్యవహరించి వుంటే బాగుడేదన్న అభిప్రాయపడ్డారని కూడా తెలుస్తోంది. మొత్తంమీద ఇంతకాలానికి అల్లు అర్జున్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా వున్న మేనమామ పవన్‌ కళ్యాణ్‌ స్పందన ఏంటో స్పష్టమైంది. నిజం చెప్పాంటే సంఘటన జరిగిన ఇంతకాలం తర్వాతదీనిపై స్పందించడం అంత సమంజసం కాకపోవచ్చు. ఇప్పటికే సంధ్య థియేటర్‌ ఎపిసోడ్‌ తె లంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పెద్ద దుమారమే సృష్టించింది. మళ్లీ ఇప్పుడు అనవసరంగా ఈ సమస్యను కెలికినట్లయింది.

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఆయన సమర్థించిన తీరు బాధ్యతాయుతంగా వుందనేచెప్పాలి. ఎందుకంటే తాను కూడా ఒక రాష్ట్రానికి బాధ్యతాయుత పదవిలో వున్నాడు కనుక ఆయన ఆవిధంగా మాట్లాడక తప్పదు. ఇక్కడ రేవంత్‌ ప్రభుత్వాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఎందుకంటే సినిమావాళ్లకు కావలసిన వాటిల్లో ఆయన ఏవీ కాదనడంలేదు. సినిమాలకు బెనిఫిట్‌షోలు, టిక్కెట్లు పెంచుకోవడానికి అనుమతులిచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ ను ఎవ్వరూ తప్పుపట్టలేరు. పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్టు, మంచి ఫామ్‌లో ఉన్న హీరోలు ఇటువంటి షోలకు వెళ్లకుండా వుండటమే మంచిది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో అభిమానులు రాకుండా మానరు. అంతా సక్రమంగా జరిగితే ఓకే. అడ్డంతిరిగి, అనుకోని సంఘటన జరిగితేనే అసలు సమస్య. సంధ్య థియేటర్‌ ఎపిసోడ్‌లో జరిగిందిదే! దీంతో ఒక్కసారి దుమారం చెలరేగింది. అంతపెద్ద సంఖ్యలో అభిమానులను చూసైనా, అల్లు అర్జున్‌ జాగ్రత్తపడి వుండాల్సింది. సరే…ఇప్పు డు జరిగిందేదో జరిగింది. ఇక ముందు ఏం జరగాలో చట్టం చూసుకుంటుంది. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ గర్విష్టి అన్న అపప్రధ తెచ్చుకున్నారు. జరిగిన విషాదంపై రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అల్లు అర్జున్‌ బెయిల్‌ పిటిషన్‌పై వినిపించిన వాదనల్లో, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా తన వాదనలను గట్టిగా వినిపించిన నేపథ్యంలో, ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నది స్పష్టమైంది. మృతురాలు రేవతి భర్తకు ఉద్యోగమిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా రూ.2కోట్లు ఆర్థిక సహాయం అందించడం ద్వారా సమస్యకు ఏదోవిధంగా పరిష్కరిద్దామన్న సినీపెద్దలఆలోచన బూమరాంగ్‌ అయింది.
తొక్కిసలాట జరగడం, ఒక మహిళ ప్రాణం పోవడం పోలీసు వ్యవస్థ రంగంలోకి దిగేలా చేసింది. ఇక్కడ చట్టం ప్రధానం. పోలీసులు చూసీచూడనట్టు పోతే, ఇక ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించేది కూడా మనమే. ఇక్కడ రేవంత్‌ ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదు! జరిగిన సంఘటన ‘యాక్సిడెంటల్‌గా’ జరిగిందా?’ లేక కావాలని జరిగిందా అన్నది కాదు ప్రశ్న. తొక్కిసలాట, ఒక ప్రాణం పోవడం, మరో బాలుడు కోమాలోకి వెళ్లడం అనేది ప్రధానం. ఇందుకు కారణమేంటనేది తెలుసుకోవడం పోలీసు వ్యవస్థ బాధ్యత! తన విధిని నిర్వర్తించిన పోలీసులను తప్పుపట్టడానికి వీల్లేదు. ఆ పోలీసు వ్యవస్థకు బాస్‌ అయిన ముఖ్యమంత్రి చట్టాన్ని సమర్థిస్తాడు తప్ప, పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించడు! సినీరంగానికి ఇవ్వాల్సిన వెసులుబాట్లు ఇవ్వకుండా, బెనిఫిట్‌ షోలకు, టిక్కెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వకుండా వుంటే, అప్పుడు రేవంత్‌ వేధి స్తున్నాడను కోవచ్చు. ఇక్కడ అట్లాంటిదేంలేదు కదా! రేవంత్‌ మరింత కఠినంగా వ్యవహరించే లా చేసింది కేవలం సినిమాపెద్దలే! అల్లు అర్జున్‌కు బాసటగా వున్నామన్న కలరింగ్‌ ఇవ్వడానికి సినీపెద్దలు పోలో అనుకుంటూ పరామర్శలకు వెళ్లడం, రేవంత్‌ అసెంబ్లీ ప్రకటన చేసిన తర్వాతకౌంటర్‌గా అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టడం ప్రభుత్వ అహాన్ని దెబ్బతీశాయి. ఆ పరిస్థితిలో ప్రభుత్వం ఏవిధంగా రియాక్ట్‌ అవుతుందో పవన్‌ కళ్యాణ్‌కు స్పష్టంగా తెలుసు. అందుకనే ఆయన రేవంత్‌కు మద్దతుగా మాట్లాడారు. ఇన్ని స్వయంకృతాపరాధాలు చేసి ప్రభుత్వం సహకరించడంలేదనే భావన కల్పించడం తప్పు!
ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. ‘అల్లు అర్జున్‌ అరెస్ట్‌ సక్రమమే’ అని పవన్‌ అనట్టుగా మీడియాలో వార్తలు తెగ వైరలవుతున్నాయి. కానీ ఆయన అంతా కలిసి అల్లు అర్జున్‌పైకి నెట్టేశారన్న మాట పెద్దగా ఫోకస్‌ కావడంలేదు. ఆమాట నూటికి నూరుపాళ్లు నిజం. ఎందుకంటే సినిమా ప్రమోషన్లకు హీరోలు, ఇతర నటులు రావడం ఇటీవలికాలంలో సహజంగా జరుగుతున్న విషయమే. ఇదికూడా బిజినెస్‌లోభాగం. తొక్కిసలాట జరిగే ప్రమాదం వున్న సందర్భాలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత హీరోలతో పాటు, సినిమా టీమ్‌, థియేటర్‌ యాజ మాన్యం వంటి ఈ ప్రక్రియలో భాగంగా వున్న ప్రతి ఒక్కరికీ వుంది.
ఈ ఎపిసోడ్‌లో రేవంత్‌ ప్రభుత్వం కొద్దిగా సాఫ్ట్‌గా వ్యవహరించి వుండాల్సిందని పవన్‌ అనడం లో తప్పులేదు. కాకపోతే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పించింది మాత్రం సినీ పెద్దలే. ఈ నేపథ్యంలో కొందరు అతి అభిమానులు సినీపరిశ్రమ ఆంధ్రకు తరలించాలని వ్యా ఖ్యానించవచ్చు. కానీ అదంత తేలికైన పనికాదు. మద్రాసునుంచి హైదరాబాద్‌కు రావడానికే నాలుగుదశాబ్దాలు పట్టింది. మరి ఇక్కడ పరిశ్రమ వేళ్లూనుకొని, స్థిరపడిరది. కేవలం ఒక్క సంఘటన ఆధారంగా అంత తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం లేదు కూడా! ఇటువంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగి ఇదే పరిస్థితి ఎదురైతే మళ్లీ ఎక్కడికి సినీపరిశ్రమను తరలిస్తారు? అదీకా కుండా మొత్తం తెలుగువారి కలల నగరం హైదరాబాద్‌! తెలుగు సంస్కృతిలో భాగమైన భాగ్యనగరం ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చుకున్న సంగతి మరువరాదు.
ఇక పవన్‌ కళ్యాణ్‌ చేశారంటూ చెబుతున్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు కేవలం రాజకీయపరమైనవి తప్ప మరో కోణానికి చెందినవికావు. ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలు ఒక బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి మాట్లాడినట్టుగానే ఉన్నాయి తప్ప, సాధారణ రాజకీయవేత్త చేసే వ్యాఖ్యల మాదిరిగా లేవు. రేవంత్‌ తీసుకున్న నిర్ణయాలను సమర్థించడానికి ఇదే కారణం. నిజం చెప్పాలంటే పవన్‌ కళ్యాణ్‌లో ఒక పరిణితి చెందిన రాజకీయవేత్త, బాధ్యతను విస్మరించని మంత్రి కనిపిస్తున్నారు. కొన్ని లోపాలుంటే వుండవచ్చు గాక! స్పందనలో నిజాయతీ కనిపిస్తున్నది, కొన్ని విషయాల్లో సినిమా నాటకీయత కనిపించినా, ‘నటన వారి వృత్తి’ అని సరి పెట్టుకోవచ్చు. ఈ మొత్తం విషయంలో అర్థంకాని విషయం ఒకటుంది. సర్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఈ అంశంపై పవన్‌ ఇంత ఆలస్యంగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని? కాకపోతే మరో రెండు రోజులపాటు మీడియాకు వార్తలపరంగా మంచి ‘పోషకాహారాన్ని’ సమకూర్చినట్టు తప్ప మరోటికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!