మంత్రి వివేక్ కు ఆందోళన, గుబులు మొదలయ్యింది…
చెన్నూర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ రాజా రమేష్ బాబు…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఆందోళన, గుబులు మొదలయ్యిందని చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అప్పుడెట్లుండే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఇప్పుడెట్లుంది అనే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.

రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని మంత్రి వివేక్ కు ఆందోళన మొదలైందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో 50 సీట్లు కూడా గెలవలేదని మంత్రి నిరాశకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చెన్నూర్, క్యాతన్ పల్లి మునిసిపాలిటీలను గెలుపొందాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. డబ్బుతో నాయకులను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గత బిఆర్ఎస్ బాల్క సుమన్ పరిపాలన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి పరిపాలనను గమనిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాలలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మంత్రికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి గిఫ్ట్ గా ఇస్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
