పిల్లలను పీడిస్తూ..పట్టభద్రులను బుజ్జగిస్తూ!

-ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఫీజుల పీడన చూపిస్తారు.

-తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు!

-ఫీజులో రూపాయి తక్కువైనా అంగీకరించరు.

-తల్లిదండ్రులు కాళ్లా, వేళ్లా పడ్డా కనికరించరు.

-రకరకాల ఫీజులతో తల్లిదండ్రులను వేధిస్తుంటారు.

-విద్యా సంస్థలు విస్తరించగానే రాజకీయాలలోకి వస్తారు.

-ప్రజా సేవ చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు.

-విద్యా చట్టం అమలును తుంగలో తొక్కుతారు.

-ఒక విద్యా సంస్థల్లో 15 శాతం ఉచిత విద్యను ఎక్కడా అమలు చేయరు.

-అలాంటి వాళ్లు రాజకీయ నాయకులై సమాజాన్ని ఉద్దరిస్తారా?

-పట్టభద్రుల హక్కుల కోసం పోరాటం చేస్తారా?

-నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేస్తారా?

-తమ విద్యా సంస్థలలో పని చేసే అద్యాపకులకే సరైన వేతనాలు ఇవ్వరు.

-ఉపాధి పేరుతో అడ్డికి పావుసేరుకు నిరుద్యోగుల చేత వెట్టి చాకిరి చేయిస్తారు.

-కార్మిక చట్టాలను నిలువునా పాతేస్తారు.

-అద్యాపకులను కట్టు బానిసలను చేసుకుంటారు.

-విద్యా సంవత్సరం మొదలైన సమయంలో అధ్యాపకులకు టార్గెట్లు విధిస్తారు.

-ఉద్యోగుల చేత అదనంగా గంటల కొద్ది పనిచేయిస్తారు.

-అలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలైతే ఎవరికి లాభం!

-ప్రభుత్వంతో కొట్లాడి సాధించేదేముంటుంది?

-మరిన్ని విద్యా సంస్థల ఏర్పాటుకు రాజకీయమే మార్గమౌతుంది.

-విద్యార్థులను పీడిరచి ఫీజులు వసూలు చేయడానికి మాత్రం పనికొస్తుంది.

-ప్రభుత్వం గుప్పిట్లో వుంటుంది.

-విద్యా సంస్థలు పేరుతో ఎన్ని అరాచకాలు చేసినా చెల్లిపోతుంది.

-పట్ట భద్రుల కోసం పోరాటం చేసే విద్యార్థి నాయకులను పార్టీలు ఎంపిక చేయాలి.

-అభ్యర్థులుగా యువతరానికి అండగా వుండే వారికి అవకాశాలు ఇవ్వాలి.

-విద్యా సంస్థల అధినేతలను పార్టీలు పక్కన పెట్టాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రాజకీయాలు మరింత దిగజారుతున్నాయనడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీలే ఎన్నికలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు ఇప్పుడే మొదలు కాకపోయినా, వాటి కొనసాగింపు మాత్రం సరైంది కాదు. ఎక్కడో అక్కడ వీటికి పుల్‌స్టాప్‌ పడాల్సిన అవసరం వుంది. ఫలానా వాళ్లే రాజకీయాలు చేయాలి. ఎన్నికలలో పోటీ చేయాలి. ప్రజా ప్రతినిధులు కావాలి అనే నియమం లేకపోవడం మన దౌర్భగ్యమనే చెప్పాలి. ప్రజా స్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, గెలవొచ్చు అనే సంప్రదాయాం వల్ల ఆర్థికంగా ఆధిపత్యం చెలాయించే వారు రాజకీయాలలోకి ఎక్కువగా వస్తున్నారు. రాజకీయ పార్టీలు వారినే ప్రోత్సాహిస్తున్నాయి. వారినే అందలమెక్కిస్తున్నాయి. గెలుపు గుర్రాల పేరుతో వారికే అవకాశాలిస్తున్నాయి. దాంతో అసలైన ప్రజాస్వామిక వాదులకు చట్ట సభలలో చోటు లేకుండా పోతోంది. ప్రజా గొంతుకలకు చట్ట సభలు వేదికలు కాకుండా పోతున్నాయి. ఆదిపత్య రాజకీయాలు రాజ్యమేలుతున్న రోజుల్లో సామాన్యులు రాజకీయాలలో రాణించడం దుర్లభమౌతోంది. దశాబ్దాల తరబడి పార్టీల జెండాలు మోసిన వారికి కాకుండా ఎన్నికలలో ఖర్చులు పెట్టే వారిని అందలమెక్కిస్తున్నారు. అక్కున చేర్చుకుంటున్నారు. అవకాశాలు కల్పిస్తున్నారు. వారినే ఆదిస్తున్నారు. దాంతో నిజమైన ప్రజాసేవకులు రాజకీయాలకు దూరమౌతున్నారు. ఎన్నికల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇది ప్రస్పుటంగా కనిపిస్తోంది. మండలి అంటే పెద్దల సభ. రాజకీయాలకు సంబంధం లేని సభ. మేధావులు మాత్రమే కూర్చోవాల్సిన సభ. ప్రజల చేత నేరుగా ఎన్నికైన శాసనసభ సభ్యులంతా కలిసి, ఏవైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అడ్డుకునేదే మండలిసభ. ప్రభుత్వాలు చేసే ప్రజా వ్యతిరేక నిర్ణయాలును ఎండగట్టేదే పెద్దల సభ. అలాంటి బిల్లులను నిలువరించేదే పెద్దల సభ. కానీ రాను రాను మండలి అనేది రాజకీయ పునరావాస కేంద్రమౌతోంది. రాజకీయంగా కొన్ని సార్లు అవకాశం రాని నాయకులకు వేధకౌతోంది. అందుకే మండలి నిర్వహణ విమర్శల పాలౌతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మండలి రాజకీయ వేధిక కావడం ప్రజలకు తీరని నష్టం జరుగుతుందని ఎన్టీఆర్‌ మండలిని రద్దు చేశారు. ఇప్పటికీ చాలా రాష్ట్రాలలో మండలి లేదు. 2004 తర్వాత కాంగ్రెస్‌ పార్టీ మండలిని పునరుద్ధరించింది. నాయకులకు అవకాశాలు కల్పించింది. అయితే ఎమ్మెల్యేల చేత ఎన్నికయ్యే సభ్యులను, ప్రజా ప్రతినిధుల ఓట్లతో గెలిచే సీట్లను నాయకులకు అప్పగించడం వరకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని పెద్దల సభకు పంపడం ఆనవాయితీ. దానిని ఎప్పుడైతే పాలక పక్షాలు తుంగలో తొక్కడం మొదలైందో అప్పటి నుంచే రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడం మొదలుపెట్టాయి. త్వరలో కరీంనగర్‌, నిజామాబాదు, మెదక్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానంలో గత ఎన్నికలలో మాజీ మంత్రి టి. జీవన్‌ రెడ్డి గెలుపొందారు. నిజానికి గత ఎన్నికలలో ఆయనకు అవకాశం కల్పించడం అంటేనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. ఈసారి ఆ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఓ విద్యాసంస్థల అధినేతను రంగంలోకి దించాలని పాలకపక్షం ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ అభ్యర్థి కూడా ఇప్పటికే తన ప్రచారం ముమ్మరం చేశారు. పెద్ద ఎత్తున పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ దగ్గరుండి పూర్తి చేశారు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి పోటీ చేసే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నట్లు సమాచారం. వచ్చిన చిక్కల్లా ఆ వ్యక్తి ఒక ప్రైవేటు విద్యా సంస్థల అధినేత కావడం గమనార్హం. నిజానికి ఆయన విద్యా వ్యవస్థకు చేసిన మేలు ఏమీ లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ద్వారా పెద్ద ఎత్తున పేద విద్యార్థులకు ఉచిత వైద్య అందించిన సందర్బాలు లేవు. సుమారు 60 వరకు తెలంగాణ లో ప్రైవేటు విద్యా సంస్థలున్న ఆ వ్యక్తి పిల్లలను పీడిస్తూ ఎలా ఫీజులు వసూలు చేస్తారో తెలియంది కాదు. ఇప్పుడు అదే పెద్ద మనిషి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేసి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాడన్న నమ్మకం అసలే లేదు. గురువింద కింద నల్లన అన్నట్లు తన విద్యా సంస్థల మూలంగా విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించిన వ్యక్తులు ఎన్నికలలో గెలిచినా ప్రయోజనం ఏమీ వుండదు. ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పాటు చేసి విద్యార్థుల నుంచి ఎలా ఫీజులు వసూలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్పొరేట్‌ విద్యా సంస్థలలో కిండర్‌ గార్టెన్‌ నుండి ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారో తల్లిదండ్రులుకు తెలుసు. అడ్మిషన్‌ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, స్కూల్‌, కాలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఫీజులు, లైబ్రరీ ఫీజులు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్‌ వుంటుంది. చదువు చెప్పేది పావలా అయితే వసూలు చేసేది పదిరూపాయలౌతోంది. తల్లిదండ్రుల సంపాదన మొత్తం పిల్లలు చదువులకే సరిపోవడం లేదు.తల్లిదండ్రులు అప్పులు చేయక తప్పడం లేదు. తల్లిదండ్రుల బలహీనతలను ప్రైవేటు విద్యా సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. కోట్లు గడిస్తున్నారు. ఫీజులు ఇష్టానుసారం వసూళ్లు చేస్తూ తల్లిదండ్రులకు నరకం చూపిస్తారు! ఒకవేళ తల్లిదండ్రులకు ఏవైనా ఇబ్బందులు ఎదురై, విద్యా సంస్థలకు నిర్ణీత గడువులో ఫీజులు చెల్లించని మరు క్షణమే విద్యార్థులను ఇంటికి పంపించేస్తారు. తరగతి గదులకు అనుమతించరు. ఫీజులో రూపాయి తక్కువైనా అంగీకరించరు. తల్లిదండ్రులు కాళ్లా, వేళ్లా పడ్డా కనికరించరు. ఫీజుల విషయంలో అంత నిక్కచ్చిగా, నిక్సర్షగా వ్యవహారించే విద్యా సంస్థల అధినేతలు వ్యవస్థను ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తారే, గాని ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి ముగింపు పలుకుతారను కోవడం హాస్యాస్పదంగా వుంటుంది. అడవికి పులిని రాజును చేస్తే సాదు జంతువులను రక్షిస్తాయని నమ్మడం ఎంత అమాయకత్వమో, ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలను మండలికి పంపించి, నిరుద్యోగుల హక్కుల కోసం పోరాటం చేస్తారని నమ్మడం కూడా అంతే అవివేకమనిపించుకుంటుంది. అలాంటి వారిని చట్ట సభలకు పంపినా ప్రయోజనం కన్నా ప్రమాదమే ఎక్కువ జరుగుతుంది. తర్వాత రకరకాల ఫీజులతో తల్లిదండ్రులను వేధిస్తుంటారు. సహజంగా ఇటీవల విద్యా సంస్థల అధినేతలు రాజకీయాలలోకి రావడం, ప్రజా ప్రతినిధులు కావడం వెనుక దాగి వున్న రహస్యం ఇదే. విద్యా సంస్థలు విస్తరించగానే రాజకీయాలలోకి వస్తారు. ప్రజా సేవ చేస్తామని గొప్పలు చెప్పుకుంటారు. ముందు తమ విద్యా సంస్థలలో అక్రమ ఫీజుల దోపిడీ ఆపగలమని, ఇతర విద్యా సంస్థలకన్నా అతి తక్కువ ఫీజులే వసూలు చేస్తామని హామీ ఇవ్వగలరా! విద్యా హక్కు చట్టాన్ని తుచ తప్పకుండా అమలు చేస్తామని మాట ఇవ్వగలరా! విద్యా చట్టం అమలును తుంగలో తొక్కుతొక్కిన వాళ్లు యువతకు మేలు చేస్తామంటే నమ్మగలమా? వారి పక్షాన పోరాటం చేస్తామని చెబితే విశ్వసించగలమా!! తమ విద్యా సంస్థల్లో 15 శాతం ఉచిత విద్యను ఎక్కడా అమలు చేయరు. కానీ అంతా ప్రభుత్వమే ఉచిత విద్య అందించాలని డిమాండ్‌ చేయగలరా! ప్రైవేటు విద్య లేకుండా ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని డిమాండ్‌ చేయగలరా! తమ విద్యా సంస్థలను ప్రభుత్వ పరం చేయగలరా? అలాంటి నిర్ణయాలు తీసుకోలేని వాళ్లు రాజకీయ నాయకులై సమాజాన్ని ఉద్దరిస్తారా? అది మనల్ని నమ్మమంటారా! పట్టభద్రుల హక్కుల కోసం పోరాటం చేస్తారా? నిరుద్యోగుల పక్షాన ఉద్యమాలు చేయడానికి సిద్దపడతారా! తమ విద్యా సంస్థలలో పని చేసే అద్యాపకులకే సరైన వేతనాలు ఇవ్వరు. అద్యాపకుల అర్హతలను, వసూలు చేసే ఫీజులను బట్టి జీతాలు చెల్లిస్తున్నారా! అద్యాపకులకు న్యాయంగా అందాల్సిన జీతాలు అందిస్తున్నారా! కనీస వేతనాలు కార్పొరేట్‌ విద్యా సంస్థలలో అమలు చేస్తున్నారా! ఉపాధి పేరుతో అడ్డికి పావుసేరుకు నిరుద్యోగుల చేత వెట్టి చాకిరి చేయిస్తారు. కార్మిక చట్టాలను నిలువునా పాతేస్తారు. అద్యాపకులను కట్టు బానిసలను చేసుకుంటారు. విద్యా సంవత్సరం మొదలైన సమయంలో అధ్యాపకులకు టార్గెట్లు విధిస్తారు. ఉద్యోగుల చేత అదనంగా గంటల కొద్ది పనిచేయిస్తారు. అలాంటి వాళ్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలైతే ఎవరికి లాభం! ప్రభుత్వంతో కొట్లాడి సాధించేదేముంటుంది? మరిన్ని విద్యా సంస్థల ఏర్పాటుకు రాజకీయమే మార్గమౌతుందే తప్ప, నిరుద్యోగ సమాజానికి పైసా లాభం జరగదు. అలాంటి వారిలి పదవులు వస్తే విద్యార్థులను పీడిరచి ఫీజులు వసూలు చేయడానికి మాత్రం పనికొస్తుంది. ప్రభుత్వం వారి గుప్పిట్లో వుంటుంది. అంతేకాకుండా విద్యా సంస్థలు పేరుతో ఎన్ని అరాచకాలు చేసినా చెల్లిపోతుంది. అందువల్ల రాజకీయ పార్టీలు ఇలాంటి వారిని ఎంపిక చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. విద్యార్థి నాయకులతో చర్చించాలి. మేధోమధనం జరగాలి. పట్ట భద్రుల కోసం పోరాటం చేసే విద్యార్థి నాయకులను పార్టీలు ఎంపిక చేయాలి. వారి హక్కుల కోసం నిరంతరం ప్రజా క్షేత్రంలో వుండే వారికి ప్రాధాన్యత కల్పించాలి. అభ్యర్థులుగా యువతరానికి అండగా వుండే వారికి అవకాశాలు ఇవ్వాలి. విద్యా సంస్థల అధినేతలను ముమ్మాటికీ పార్టీలు పక్కన పెట్టాలి. అప్పుడే యువతరం ఆశలు నెరవేరుతాయి. ప్రైవేటు విద్యా వ్యవస్థలో దోపిడీకి అడ్డుకట్ట వేయబడుతుంది. సమాజానికి మేలు కలుగుతుంది. ఇలాంటి ఎన్నికలలో ప్రైవేటు విద్యా సంస్థల పెద్దలకు అవకాశం కల్పిస్తే వారికి మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. సమాజానికి ఎల్లకాలం దోపిడే మిగులుతుంది. ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!