Police Crackdown on Illegal Soil Transport
జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై పోలీసుల కొరడా
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లాలోని అనుమతిలేని మట్టి తవ్వకాలు, రవాణాపై ప్రత్యేక నిఘాఅక్రమంగా మట్టి తరలించినా, తవ్వకాలు చేసినా సమాచారం అందించాలని పిలుపుజిల్లా ఎస్పీ మహేష్ బి. గితే జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. అనుమతి లేకుండా మట్టి తవ్వడం, తరలించడం, నిల్వ చేయడం వంటి అక్రమ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేపడుతోందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా మట్టి వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో అక్రమ మట్టి రవాణాపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ పలు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో అక్రమ మట్టి రవాణాకు సంబంధించి మొత్తం 19 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే 45 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటిలో 27 ట్రాక్టర్లు, 11 టిప్పర్లు, 7 జేసీబీలు ఉన్నాయని తెలిపారు.
అక్రమ మట్టి తవ్వకాలు, రవాణాపై ఎక్కడా రాజీ పడబోమని, నియమ నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మట్టిని తవ్వడం, నిల్వ చేయడం లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించాలంటే సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు. అనుమతి లేకుండా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
గడిచిన వారం రోజులుగా జిల్లాలో పోలీసులు చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదు చేసి మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. బోయినపల్లి పరిధిలో ఒక జేసీబీతో పాటు నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోగా, రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు టిప్పర్లు, ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేశారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా పరిధిలో ఎక్కడైనా అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు, రవాణా లేదా నిల్వ జరుగుతున్నట్లు సమాచారం తెలిసినా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ కోరారు. ప్రజల సహకారంతో అక్రమ మట్టి రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
