వైద్యాధికారుల నిర్లక్ష్యం, చర్యలు తీసుకునేవారే అలసత్వం ప్రదర్శిస్తున్నారు?
ఇటీవల నగరంలో వరుసగా ఫెయిల్ అవుతున్న అపెండిక్స్ ఆపరేషన్ లు
ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు?
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం, వారి అబ్బాయి తనీష్ (13) కి కడుపు నొప్పితో బాద పడుతుండగా హనుమకొండ బాలసముద్రం లోని, శ్రీఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురాగా, హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ జితేందర్, 13 సంవత్సరాల కుర్రాడైన తనిష్ కు చేసిన అపెండిస్ ఆపరేషన్ వికటించి ప్రాణాపాయస్థితికి చేరుకోగా.. తమ ఏకైక కుమారుడి ప్రాణాలను కాపాడుకోవాలన్నా తాపత్రయంతో తమ బంధువులు, స్నేహితులు వద్ద అప్పుచేసి దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో, హైదారాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించి తమ బిడ్డను ప్రాణాలతో రక్షించుకోగలిగారు ఆ కుర్రాడి తల్లిదండ్రులు. తమ కుమారుడి ప్రాణాలను రక్షించుకోగలిగిన ఆ అమాయకపు తల్లిదండ్రులు, చేసిన అప్పులను మాత్రం తీర్చలేక చచ్చిన జీవశవంలా మిగిలిపోయారు. ఆ ఆసుపత్రి యాజమాన్యంపై, సదరు డాక్టర్ పై అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు.
డి.ఎం.హెచ్.ఓ, పోలీస్ అధికారుల నుండి స్పందన కరువు..?
ఆసుపత్రి యాజమాన్యం అలాగే ఆపరేషన్ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూలై 31, 2024 రోజున దరఖాస్తు సమర్పిస్తే, మూడు నెలల అనంతరం, అనగా.. నవంబర్ 13, 2024 రోజున ఓ అధికారిని ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించి చేతులు దులుపుకున్న హనుమకొండ డి.ఎం.హెచ్.ఓ. ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వయిరీ చేశాడా? అంటే.. ఆ రెండు ఆసుపత్రుల నుండి కేసు షీట్లు తెప్పించుకొని ఓ మూలన పడేశాడు తప్ప ఇప్పటివరకు ఎలాంటి పురోగతి సాధించలేదు అని బాదితుల ఆవేదన. కనీసం పోలీసుల వద్ద తమకు న్యాయం జరుగుతుందని ఆశతో మార్చి 23, 2024 రోజున వరంగల్ కమిషనర్ కు పోస్టు ద్వారా ఫిర్యాదు చేయగా.. స్పందన కొరవ. దీంతో లాభం లేదని భావించి, డిసెంబర్ 04, 2024 రోజున కమిషనర్ ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేయడంతో, హనుమకొండ ఏసీపీ ని సంఘటనపై విచారించాలని ఆదేశించారు. ఏసీపీ కేవలం కుర్రాడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు తప్ప ఆసుపత్రి యాజమాన్యాన్ని లేదా ఆ డాక్టర్ ను విచారించడం లేదు అని బాలుడి తల్లిదండ్రుల ఆవేదన. దీంతో పోలీసు కమిషనర్ ను మరోసారి కలిసి పిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఎన్.హెచ్.ఆర్.సి, ఆరోగ్య శాఖ మంత్రికి ఫిర్యాదు
అధికారులపై నమ్మకం కోల్పోయిన కుర్రాడి తల్లిదండ్రులు, ఈసారి ఎన్.హెచ్.ఆర్.సి కి ఫిర్యాదు చేశారు. ఎన్.హెచ్.ఆర్.సి నుండి కూడా అనుకున్న స్థాయిలో స్పందన కొరవవడంతో ఇక చివరి ప్రయత్నంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి, హన్మకొండలో జరిగిన డి.ఎం.హెచ్.ఓ నిర్లక్ష్యం పై ఫిబ్రవరి 10, 2025 రోజున పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.
బాలుడి సంఘటనపై “నేటిధాత్రి” వరుస కథనాలు….
ఆసుపత్రి యాజమాన్యం, అపెండిక్స్ ఆపరేషన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యంపై నేటిధాత్రి వరుస కథనాలు ప్రచురించినప్పటికీ, హనుమకొండ వైద్యాధికారుల నుండి స్పందన కరువైంది.. కనీసం ఎన్.హెచ్.ఆర్.సి నుండి అయిన బాధితులకు న్యాయం జరగాలని కోరుకుందాం.