నగరంలో కుక్కలు…’బౌ’బోయ్ !
మొరిగే కుక్క కరవదంటారు…కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు…మొరిగే కుక్కలు సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజలను కుక్కలు వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్రవాహనంపై వెళ్లే వారిని కూడా కుక్కలు వదలడం లేదు. కుక్కల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా…బయటకు వచ్చిన వారు తిరిగి ఇంటికి చేరుకోవాలన్నా బిక్కుబిక్కుమంటూ వెళ్లాల్సి వస్తోంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో…అని ప్రజలు అనేకసార్లు డివిజన్ కార్పొరేటర్లకు, వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు మొరపెట్టుకున్నారు. అధికారులు ఆ దిశగా ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కుక్క కాటుకు ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నా అధికారుల్లో కనీస స్పందన లేకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కుక్కలు వీరవిహారం చేస్తున్నాయని, రాత్రి సమయాల్లో రోడ్డుపై ఆటో దిగి ఇంటికి వెళ్లే దారిలో ఖచ్చితంగా కుక్కల బారిన పడవలసి వస్తుందని ప్రజలు చెపుతున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యం నగరంలో జరుగుతూనే ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో ఇటీవల కుక్కలు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని గాయాలపాలు చేస్తున్నాయి. కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద నివారించేందుకు చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. గ్రేటర్ అధికారులు కుక్కల బెడదను తీవ్రంగా పరిగణించి నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నగరంలో కరీమాబాద్, శివనగర్, రామన్నపేట, రంగశాయిపేట్, అండర్ రైల్వే గేట్, గిర్మాజీపేట, కాశిబుగ్గ వివిధ ప్రాంతాలలో ఈ వీధి కుక్కలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. వీధి వీధినా గుంపులు గుంపులుగా దర్శనం ఇవ్వటంతో నగర ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వరంగల్ నగరంలో వీధికుక్కల విహారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏ రోడ్డులో చూసిన కుక్కలు గుంపులుగుంపులుగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు సెలవులు ఇవ్వటం వల్ల ఇంటి ఆవరణలో ఆడుకోవటానికి బయటకు వెళ్లాలంటే వీధికుక్కలను చూసి బయటకు వెళ్లడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఇంట్లోనే ఉండి టివి చూస్తూ గడుపుతున్నారని, దీంతో వారు సంతోషంగా వేసవి సెలవులను గడపడం లేదని అన్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులపై వెళుతున్న వారి వెంటపడి కుక్కలు మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటీవల 21వ డివిజన్ కరీమాబాద్ గుండుబావులు ప్రాంతంలో ఒక చిన్నారి కుక్క కాటుకు గురి కావటం జరిగింది. నగరంలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వాటిని నివారించాలని కార్పొరేటర్లకు, అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మనుషుల మీద పడి కరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాలలో వీటి ఆగడాలకు హద్దు, ఆదుపు లేకుండా పోతున్నాయన్నారు. రాత్రివేళల్లో చిన్నపిల్లలకు కుక్కల అరుపులకు నిద్ర పట్టక ఆరుబయట పిల్లలను నిద్రించేందుకు ఉపక్రమిస్తే ఎక్కడ కుక్కలు వచ్చి పీక్కుతింటాయోనని భయంతో నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా అత్యవసర పనులపై బయటకు రావాలంటే భయాందోళనకు గురి కావలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను దష్టిలో పెట్టుకుని నగరంలో వీధికుక్కల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వీధి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాల్లో వదిలివేయడానికి చర్యలు చేపడుతున్నామని, కుక్కల కొరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కొంత బడ్జెట్ విడుదల చేసినా చర్యలకు మాత్రం అధికారులు చొరవ చూపడం లేదని వాపోయారు. మునిసిపల్ కమిషనర్‌కి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా లాభం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. అయితే నేటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికయినా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పందించి కుక్కల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు వేడుకుంటున్నారు.