Women Protest Over Missing Loan Money
సొమ్ముల స్వాహా.. పదిమంది సభ్యుల సంఘం పేరిట తీసుకున్న లోన్ లో రూ.4.60 లక్షల కాజేసిన లీడర్.
ఈ వ్యవహారంలో రెండవ లీడర్ కూడా భాగస్వామినే.
సొమ్ము లీడర్లకు లోన్ వాయిదాలు సంఘ సభ్యులకు..
డబ్బులు ఇచ్చేదాకా కదల బోమంటున్న 8 మంది సంఘ సభ్యులు.. లీడర్ ఇంటి ముందు నిరసన
కోదాడ, నేటి ధాత్రి:
శ్రీ మణికంఠ సమభావన సంఘం పరిధిలోని శ్రీనిధి గ్రూప్‌లో రుణ నగదు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గ్రూప్‌కు మంజూరైన రుణంలో రూ.4.60 లక్షలు గల్లంతయ్యాయని ఆరోపిస్తూ సభ్యులు శనివారం కోదాడ పట్టణంలోని ఆజాద్‌నగర్ లీడర్ ఇంటి ముందు నిరసనకు దిగారు. మొదటి లీడర్ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.గ్రూప్ సభ్యుల కథనం ప్రకారం.. శ్రీనిధి గ్రూప్‌లో మొత్తం 10 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘం ద్వారా రుణం మంజూరుకాగా, అందులో మొదటి లీడర్ తమ్మిశెట్టి బుజ్జి రూ.4.60 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుందని సభ్యులు ఆరోపించారు. రెండవ లీడర్ కూడా ఈ వ్యవహారంలో భాగస్వామిగా ఉన్నారని తెలిపారు. అలాగే డ్వాక్రా లోను 10 లక్షలు రుణానికి సంబంధించిన వాయిదాలు మాత్రం సభ్యులపై పడటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు మాకు ఇవ్వకుండా మోసం చేశారు.ఇప్పుడు బ్యాంకు వాయిదాల కోసం ఒత్తిడి తెస్తోంది అంటూ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో బాధిత మహిళలు శనివారం ఉదయం నుంచే ఆజాద్‌నగర్‌లోని లీడర్ ఇంటి ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. మా డబ్బులు మాకు ఇవ్వాలి.బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ నినాదాలు చేశారు. అధికారుల జోక్యంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.స్థానికులు స్పందిస్తూ మహిళా సంఘాల పేరుతో తీసుకునే రుణాలు పారదర్శకంగా వినియోగించకపోతే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడ్డారు. సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధిత మహిళలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
