మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా?
వీటిని సైతం విడిచి పెట్టరా?
పెంచిన వంట గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలి
పేదలపై పెనుభారం మోపవద్దు
దోపిడీ, మోసానికి కేరాఫ్
మోదీ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను యాభై రూపాయల మేర పెంచడంతో సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని, తక్షణమే పెంచిన ధరను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు డిమాండ్ చేశారు. దోపిడీ, మోసానికి మోదీ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నదని, చివరకు గ్యాస్ సిలిండర్లను సైతం విడిచిపెట్టడం లేదని మండి పడ్డారు. వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను పెంచడం వల్ల పేద కుటుంబాలకు మరింత నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో, కొత్తగా గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి జీవన వ్యయాన్ని మరింత పెంచి, వారి రోజు వారీ జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉజ్వల యోజన ద్వారా పేదలకు సబ్సిడీతో కూడిన గ్యాస్ సిలిండర్లను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈధరల పెంపు ఆహామీలను గాలికి వదిలేసినట్లుగా కనిపిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోక పోవడం దారుణమని, వంట గ్యాస్ ధర పెంచడం వల్ల గృహిణులు, చిరు వ్యాపారులు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన ధరల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మోదీ జీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు ఒక్కటే మిగిలాయా ? అని మండిపడ్డారు ఈసారి ద్రవ్యోల్బణం కొరడా దెబ్బ పేద మహిళల పొదుపు పైనా పడిందనీ, దోపిడీ, మోసం అనే పదాలకు మోదీ ప్రభుత్వం పర్యాయ పదంగా మారిందని రాజేందర్ రావు ధ్వజమెత్తారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించక పోవడం దారుణమని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పేద, మధ్య తరగతి కుటుంబాల జీవనం దుర్భరంగా మారిందని రాజేందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. పదకోండు ఏళ్ల మోడీ సర్కార్ హాయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకాన్నీ పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. దీంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజేందర్ రావు పేర్కొన్నారు. తరచూ పెట్రోలు, డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచుకుంటూ పోతున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.