ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు
తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్.ఎ. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి….
తెలుగునాట.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పలువురు శాసనసభ్యులు వారి ముఖ్యమంత్రులకు కంట్లో నలుసుల్లా తయారవుతున్నారా? ఎం.ఎల్.ఎ. అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ.. అంటే చట్టసభ సభ్యులు. చట్టసభల్లో చట్టాలు చేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజలపాలిట సమస్యగా మారుతున్నారు. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింప జేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 2004 నుంచి ప్రారంభమైన ఈ ధోరణి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వెర్రితలలు వేస్తోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులకు అపరిమిత స్వేచ్ఛను ఇవ్వడంతో వారు ప్రభుత్వ కార్యాలయాలను తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకూ అదే ఆదర్శమైంది. గతానికి భిన్నంగా ఈ జాడ్యం ఇప్పుడు తెలంగాణకు కూడా విస్తరించింది. 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన వారిని ఉద్దేశించి, వాటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు చెప్పాలని సూచించేవారు. ఇది ప్రజలకు రుచించలేదు. అది వేరే విషయం! 1983కు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉనికి ఉండేది కాదు. అక్కడి ప్రజా సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించేవి. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండేవారు కారు. ఎమ్మెల్యేలను కలుసుకోగలిగే పరిస్థితి జిల్లా స్థాయిలో కొద్దిమందికే ఉండేది. ఇక మంత్రులు, జిల్లా కలెక్టర్లను కలుసుకోవడం అరుదైన అవకాశంగా ఉండేది. అలా కలుసుకోగలిగిన వారికి పలుకుబడి ఉన్నట్టు పరిగణించేవారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేశారు. దీంతో ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరగక తప్పలేదు. ఫలితంగా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను, కుటుంబ పంచాయితీలను పరిష్కరించవలసిందిగా కూడా ఎమ్మెల్యేలను కోరేవారు. మొగుడూ పెళ్లాల పంచాయితీలు తామెందుకు పరిష్కరించాలని ఆ రోజుల్లో ఎమ్మెల్యేలు విసుక్కొనేవారు. హైదరాబాద్‌లో ఉండే తమ ఎమ్మెల్యేలను తెలంగాణ జిల్లాలకు చెందిన ప్రజలు వచ్చి కలుసుకొని బాధలు చెప్పుకొనేవారు. కొంతమందైతే తిరుగు ప్రయాణాలకు చార్జీలు ఇవ్వవలసిందిగా ఎమ్మెల్యేలను కోరేవారు. తమను కలవడానికి వచ్చిన వారికి కాఫీ, టీలు తాగించడంతో పాటు భోజనం, వసతి కూడా ఏర్పాటు చేయవలసి రావడంతో శాసనసభ్యులు ఆర్థికంగా నలిగిపోయేవారు. పెళ్లిళ్లు, చావులకు వెళ్లడం విధిగా మారింది. అదే సమయంలో ఖర్చుల కోసం డబ్బు కూడా డిమాండ్ చేసేవారు. తెలంగాణలో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉంది. కొంత కాలం క్రితం ఒక లారీ డ్రైవర్ తమ నియోజకవర్గ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి తాను డ్యూటీ మీద దూరంగా ఉన్నాననీ, పురిటి నొప్పులతో బాధపడుతున్న తన భార్యను ఆస్పత్రిలో చేర్పించి ప్రసవం చేయించవలసిందిగా కోరారు. ఇలాంటి విచిత్రమైన అనుభవాలను శాసనసభ్యులు గతంలో పంచుకొనేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా, దండ నాయకులుగా తయారయ్యారు. తెలంగాణలో కూడా ఈ పోకడలు మొదలయ్యాయి. తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది.
రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తిచేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తనను కలసి తన సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకొని కూర్చున్నారు. ఈ వ్యవహారం మంత్రి, ముఖ్యమంత్రి వరకూ వెళ్లింది. దీంతో సంబంధిత శాఖ మంత్రి కల్పించుకొని సదరు ఎమ్మెల్యేను పిలిపించుకొని సర్దిచెప్పారు. ఈ ధోరణిని ఏమనాలి? ఇల్లు తగలబడుతుంటే బొగ్గులు ఏరుకోవడానికి ప్రయత్నించినట్టుగా లేదా? కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ విషయంలో ఒకరికొకరు ఆదర్శం అయ్యారు. ఫలితంగా తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధిపత్యం పెరిగిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్ కట్టాలన్నా శాసనసభ్యుడి అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్ అధికార యంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ, మరోవైపు భూ కబ్జాలు, దందాలలో ఎమ్మెల్యేలు మునిగితేలారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన శాసనసభ్యులపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో కేసీఆర్ అభ్యర్థులను మార్చకుండా పాతవాళ్లు అందరికీ టికెట్లు ఇచ్చారు. అప్రతిష్ఠపాలైన శాసనసభ్యులను మార్చి ఉంటే కేసీఆర్ అధికారం కోల్పోయి ఉండేవారు కాదన్న అభిప్రాయం భారత రాష్ట్ర సమితి ముఖ్యులలో ఇప్పటికీ ఉంది.