బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలమే అని అఫిడవిట్లు ఇచ్చిన వారిపై రాజీనామాకు ఒత్తిళ్లు?
`ఎలాగైనా ఉప ఎన్నికలు తేవాలన్నదే కేసిఆర్ ఎత్తుగడ!
`పది సీట్లు గెలుచుకుంటేనే బిఆర్‌ఎస్ మనుగడ!
`ఉప ఎన్నికలు వస్తే జగిత్యాల నుంచి ‘‘కవిత’’ పోటీ.
`ఉప ఎన్నికలు తెచ్చి ఒక్క సీటు ఓడిపోయినా బిఆర్‌ఎస్ అడ్రెస్ గల్లంతే!
`ప్రజలు బీజేపి వైపు చూస్తున్నారని సంకేతాలు వెళ్లినట్లే!
`ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టాలని ఆదేశాలు.
`అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.
`తాము బీఆర్‌ఎస్ లో వున్నామని చెప్పినా సుప్రీం కోర్టు అంగీకరించినా, పార్టీ పరంగా అంగీకరించకూడదని నిర్ణయం.
`అందరూ అఫిడవిట్లు దాఖలు చేసేదాకా ఎదురు చూడాలనుకుంటున్నారు.
`అదును చూసి రాజీనామాలు చేయించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
`అఫిడవిట్లు ఇస్తే అటు కాంగ్రెస్ ఆదరించదు.
`ఇటు బీఆర్‌ఎస్ దరి చేరనివ్వదు.
`రాజీనామా చేయని గత్యంతర పరిస్థితుల్లోకి ఎమ్మెల్యేలు.
`నియోజకవర్గాల వారిగా ఇప్పటికే నివేదికలు.
`కొన్ని నియోజకవర్గాలలో నాయకులకు కేసిఆర్ అభయం.
`ఆశావహులను కూడా పరిగణలోకి తీసుకొని, సమిష్టి నిర్ణయం తీసుకోనున్నారు.
`నాయకుల అభిప్రాయాల మేరకు టిక్కెట్లు కేటాయించాలని అనుకుంటున్నారు.
`అటు కేటిఆర్, ఇటు హరీష్ రావులు అదే పనిలో నిమగ్నమై వున్నారు.
`కేటిఆర్ జిల్లాల పర్యటన కూడా అందులో ఒక భాగమే అంటున్నారు.
`ప్రజాభిప్రాయ సేకరణ నేరుగా సేకరించాలనుకుంటున్నారు.
`పార్లమెంటు ఎన్నికల సమయంలో తొందరపడి పరువు పోగొట్డుకున్నారు.
`ఆ తొందరపాటు మళ్లీ పునరావృతం కాకుండా అడుగులేయాలనుకుంటున్నారు.
`ఇక కొడితే రాజకీయాలు షేక్ కావాలని చూస్తున్నారు.
`బీఆర్‌ఎస్ బలం రుచి చూపించాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాలలో తొందరపాటు ఎంత అనర్ధ దాయకమో పది మంది జంపింగ్ ఎమ్మెల్యేలను చూస్తే అర్దమౌతుంది. ఇప్పుడు లాక్కొలేక, పీక్కోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్దితి వస్తుందని ఊహించలేదు. ఆసల్యం అమృతం విషమనుకున్నారు. తొందరపాటు మొదటికే మోసమని గ్రహించలేకపోయారు. పరిస్దితులను అర్ధం చేసుకోలేకపోయారు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోలేకపోయారు. పార్టీ మారితే ప్రాదాన్యత పెరుగుతుందనుకున్నారు. పదవులు, పనులు వచ్చి ఒళ్లో వాలుతాయని కలలుగన్నారు. వరుస పెట్టి క్యూ కట్టారు. వరద ఆగిపోగానే దిక్కులు చూస్తున్నారు. తమ పలాయనం తర్వాత బిఆర్‌ఎస్ ఖళీ అవుతుందనుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎనలేని ప్రాదాన్యత లభిస్తుందనుకున్నారు. నియోజక వర్గ అభివృద్దికి నిధుల వరద పారుతుందనుకున్నారు. అదనంగా పదవులు, అనుచరులకు మేలు కల్గుతుందని అనుకున్నారు. కాని డామిట్ కధ అడ్డం తిరిగింది. కాంగ్రెస్‌లో చేరి ఇంత కాలమైనా గుర్తింపు లేదు. ఆదరింపు లేదు. అలకపూనినా పలకరించేవారు లేదు. ఆపద వస్తున్నా అయ్యే అనేవారు లేదు. అసలు కాంగ్రెస్ నేతలకు తప్ప కప్పదాటు నాయకులకు పార్టీలో చోటే లేదని తెలుసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు పదవులు ఇచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి నటరాజన్ తేల్చి చెప్పడంతో దిక్కు తోచని స్తితిలోకి నెట్టేయబడ్డారు. ఇదిలా వుంటే బిఆర్‌ఎస్ అధినేత సైలెంటుగా తన వ్యూహాలు తాను చేసుకుంటూ పోతున్నారు. ఇవ్వాల కాకపోయినా, రేపైనా సరే ఉప ఎన్నికలు ఖాయమన్న నమ్మకంతో కేసిఆర్ వున్నారు. పైగా సుప్రింకోర్డులో బలంగానే పార్టీ తరుపున వాదనలు వినిపిస్తున్నారు. దాంతో ఏ క్షణమైనా పిరాయింపు ఎమ్మెల్యేపై వేటు పడొచ్చన్న ఆశతో బిఆర్‌ఎస్ నాయకులున్నారు. ఇదిలా వుంటే సుప్రింకోర్టు కూడా ఈ విషయంలో సీరియస్‌గానే వున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిరాయింపుల చట్టం అమలు కోసం డైరెక్షన్ ఇచ్చేలానే వుంది. జంపింగ్ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేలా కనిపిస్తోంది. అందుకే ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత కాలమంటూ తెలంగాణ స్పీకర్ కార్యాలయానికి నోటీసులు కూడా పంపింది. ఈ నెల 22 లోపు ఏదో ఒక సమాధానం చెప్పాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సుప్రింకోర్టు స్పీకర్‌కు సైతం నోటీసులు జారీ చేసింది. అప్పుడు కొంత సమయం కావాలంటూ స్పీకర్ తరుపున న్యాయవాదులు సమయం కోరారు. అదే సమయంలో ఇంకెంత కాలం కావాలంటూ సుప్రింకోర్టు ప్రశ్నించింది. సరైన సమయం చూసి నిర్ణయం తీసుకుంటారని స్పీకర్ తరుపు న్యాయవాదులు చెప్పడంతో, సరైన సమయం అంటే ఎంత కాలం..పుణ్యకాలం వెళ్లిపోయేంత వరకా? అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22 డెడ్ లైన్ పెట్టింది. దాంతో స్పీకర్ కార్యాలయం ఈ నెల22లోపు ఏదో ఒక సమాధానం చెప్పలేని పరిస్ధితి ఎదురైంది. ఆలోపు తాము పార్టీ మారలేదంటూ కొంత మంది ఎమ్మెల్యేలు సుప్రింకోర్టుకు వ్యక్తిగతంగా లిఖితపూర్వక సమాదానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. స్పీకర్‌తోపాటు, ఎమ్మెల్యేలకు కూడా సుప్రింకోర్టు విడివిడిగా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాము పార్టీలోనే వున్నామని, కాకపోతే అభివృద్దిపనులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడం మాత్రమే జరిగిందని నోటీసులకు సమాదానం చెప్పినట్లు కూడా సమాచారం. అయితే ఈ సమాధానాలు సుప్రింకోర్టు అంగీకరిస్తుందా? బిఆర్‌ఎస్ పార్టీ తరుపున న్యాయవాదులు ప్రశ్నించకుండా వుంటారా? ఎమ్మెల్యేలుకండువాలు మార్చకున్న ఫోటోలు, వీడియాలో సుప్రింకోర్టుకు సమర్పించకుండా వుంటారా? అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒకడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపిగా పోటీచేశారు. బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఎమ్మెల్యే పదవిని వదులుకోలేదు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఎంపి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తరుపునపోటీ చేసి ఓడిపోయారు. ఆయనపై ఖచ్చితంగా వేటు పడుతుందని అంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా వేటు పడుతుందనే అనుకుంటున్నారు. ఆయన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా బిఆర్‌ఎస్ నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తన కూతురుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపి టికెట్ తెచ్చుకున్నారు. ఎంపి ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఒక పార్టీ ఎమ్మెల్యేగా వుంటూ మరో పార్టీకి ప్రచారం చేయడం తప్పు. అది ఎన్నికల నియమావళికి విరుద్దం. అందువల్ల కడియం శ్రీహరి ఎన్నిక రద్దయ్యే అవకాశం లేకపోలేదు. ఇక మిగతా ఎమ్మెల్యేలలో కొంత మంది మళ్లీ బిఆర్‌ఎస్ గూటికి చేరుకునేందుకు సిద్దంగా వున్నారు. అయినా బిఆర్‌ఎస్ ఎప్పుడో డోర్స్ క్లోజ్ చేసింది. వారికి శిక్ష పడాలనే కోరుకుంటోంది. రాజకీయాల్లో కక్షసాదింపులు, వేధింపులు కొత్త కాదు. రాజకీయాలు పుట్టిన నాటి నుంచే వున్నాయి. వాటిని తట్టుకొని నిలబడినప్పుడే రాజకీయాలలో ఎదుగుతారు. ఇవన్నీ తెలియకుండానే రాజకీయాల్లోకి ఎవరూ రారు. సామాన్యంగా క్షేత్ర స్దాయి రాజకీయాలను చేసే వారే అధికార పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయినా తట్టుకొని పార్టీకోసం పనిచేస్తారు. అలాంటిది ఎమ్మెల్యే స్ధాయి నాయకులు కూడా తమ స్వలాభాపేక్ష కోసం పార్టీ మారడాన్ని ఎవరూ సహించరు. ఈ సంగతి ఇలా వుంటే పది స్ధానాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ స్ధానాలలో ఎవరిని నిలబెట్టాలన్న దానిపై కూడా బిఆర్‌ఎస్‌లో చర్చల మీద చర్చలు జోరుగా సాగుతున్నాయి. అంతే కాకుండా ఈ పది సీట్లలో ఉద్యమ కారులను నిలబెట్టి, బిఆర్‌ఎస్ ఉద్యమకారుల పార్టీయే అని మరోసారి నిరూపించాలని అనుకుంటున్నారు. బిఆర్‌ఎస్ పేరు మారినా తెలంగాణ ఆత్మ నిండా నింపుకొని వున్న ఏకైక పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమే అని ఇతర పక్షాలకు తెలిసొచ్చేలా చేయాలని అనుకుంటున్నారు. అందుకే అవకాశ వాదులకు కాకుండా ఉద్యమ కారులైన బిఆర్‌ఎస్ నాయకులకు ఈసారి పది టిక్కెట్లు ఇవ్వాలని పార్టీ కోరుకుంటోంది. బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ కూడా అదే అనుకుంటున్నారు. దాంతో ఆశావహులు పెరుగుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజక వర్గాలలో నాయకులకు పనులు చేసుకొమ్మని కూడా కేసిఆర్ హమీ ఇచ్చినట్లు కూడా సమాచారం. ఎలాగైనా ఉప ఎన్నికలుతేవాలి. మళ్లీ బిఆర్‌ఎస్ ఊపు తగ్గలేదని నిరూపించాలన్న కసితో బిఆర్‌ఎస్ వుంది. నాయకులు కూడా అదే స్ధాయిలో పనిచేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఉప ఎన్నికల్లో పదికి పది బిఆర్‌ఎస్ గెలవకపోతే ఆ పార్టీ బలహీనపడినట్లే అని అనుకోవాల్సి వస్తుంది. ఏ ఒక్క సీటు కోల్పోయినా అంతర్మధనంలో పడాల్సివస్తుంది. వచ్చేనాలుగేళ్లు బాగా కష్టపడాల్సి వస్తుంది. ఉప ఎన్నికల్లో గెలిస్తేనే తెలంగాణ రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌ది పై చేయి అవుతుంది. లేకుంటే అవతలి నుంచి బిజేపి తరుముకొస్తుంది. ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి బలం పెంచుకున్నది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన మంచి ఊపు మీద వుంది. బిఆర్‌ఎస్ బలహీనపడిరదన్న సంకేతాలు అందితే ఇక బిజేపి దూకుడు పెంచుతుంది. గ్రామ గ్రామాన బలపడుతుంది. బిఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకులను ఆకర్షిస్తుంది. ఉప ఎన్నికల్లో ఏమాత్రం బిఆర్‌ఎస్ గెలుపుకు అవరోధం ఏర్పడినా, ఒక్క సీటునైనా కాంగ్రెస్, బిజేపిలు కైవసం చేసుకుంటే బిఆర్‌ఎస్‌లో ముందడుకున్నా వెనుకడుగే ఎక్కువ వేయాల్సి వస్తుంది. అందుకే బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు క్షేత్ర స్ధాయి పర్యటలను మొదలు పెట్టారు. వాటి పర్యవేక్షణ, రాజకీయాలను హరీష్‌రావు దగ్గరుండిచూసుకుంటున్నారు. ఇద్దరు రెండు వైపుల నుంచి రాజకీయాలను కనుసైగల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాష్ట్రంలో వున్న రాజకీయ పరిస్దితులను అవగతం చేసుకునేందుకు బయలు దేరారు. ఇక ఉప ఎన్నికలలో జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే ఆమె జగిత్యాల నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కాని త్యాగం చేశారు. కాగల కార్యం గందర్వులే తీర్చినట్లు ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారి, కవితకు అవకాశం కల్పించనట్లైంది. మిగతా స్ధానాలలో ఎవరిని ఎంపిక చేసి రంగంలోకి దింపుతారో చూడాలి. కాని జంపింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ కాంగ్రెస్ అవకాశం కల్పిస్తుందా? లేదా అన్నది కూడా తేలాల్సి వుంది. ఎందుకంటే పదవులు ఇచ్చేందుకే కాంగ్రెస్ పార్టీ సుముఖంగా లేనప్పుడు, ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం కనిపించడం లేదు. స్వయం కృతాపరాధమంటే ఇదే! మరి.