Rajagopal Reddy Sparks “Car Party” Rumors in Telangana Politics
కారు పార్టీ వైపు రాజగోపాల్ రెడ్డి?
రాజకీయాల్లో ఎప్పుడు ఏ వింత జరుగుతుందో చెప్పలేం అనడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలే నిదర్శనం. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టి తన తండ్రి కేసీఆర్‌పై విమర్శలు చేయడాన్ని రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేసుకోవడం సహజం, కానీ ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అయి ఉండి, తమ ప్రత్యర్థి కేసీఆర్ పట్ల ఇంత సానుభూతి చూపడం వెనుక అసలు ఉద్దేశం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆరా తీస్తున్నారు.
”తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది?” అంటూ రాజగోపాల్ రెడ్డి పై మండిపడ్డారు. నిన్నటి దాకా కేసీఆర్ పాలనను, ఆయన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వ్యక్తి, ఇప్పుడు కేసీఆర్ ఒక ఉద్యమకారుడని, ఆయన్ని విమర్శిస్తే తనకు బాధేస్తోందని అనడం చూస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. సొంత తమ్ముడి కంటే ఎదురింటి బాబాయ్‌కే ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని, ఇది రాజకీయం కంటే ఎక్కువగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ‘ఓవర్ యాక్షన్’ లా కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు, రాజగోపాల్ రెడ్డి ఈ సాకుతో కవితను టార్గెట్ చేస్తూనే, కేసీఆర్ దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. కవితకు డిపాజిట్లు రావని ఎద్దేవా చేస్తూనే, కేసీఆర్‌ను వెనకేసుకొస్తుండటం వెనుక భవిష్యత్తులో ఆయన “కారు” ఎక్కే ప్లాన్ ఏమైనా ఉందేమోనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
