‘నీతి’ కోసం పోరులో ‘అవినీతి’లో మునిగిన ఆప్‌

తాను తప్పు పట్టిన పార్టీలతోనే జట్టుకట్టిన వైనం

14 కాగ్‌ నివేదికలను తొక్కిపట్టిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం

ఈశాన్య ఢల్లీి స్కూళ్ల మౌలిక సదుపాయాలపై ఢల్లీి హైకోర్టు చీవాట్లు

‘స్వచ్ఛ’ యమున హామీ నెరవేర్చలేదు

కాలుష్య నియంత్రణలో వైఫల్యం

అధికారంకోసం అడ్డదారులు

అమలు చేయలేని అలవికాని హామీలు

అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా జైలుకెళ్లిన రికార్డు

ఎన్నికల్లో ‘ఊడ్చేసిన’ ఢల్లీి ఓటర్లు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఢల్లీి పీఠాన్ని 2/3వవంతు మెజారిటీతో కైవసం చేసుకోవడంతో గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించిందన్న ఆనందం భారతీయ జనతాపార్టీని ముంచెత్తడం సహజం. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశమేంటంటే ఓట్లశాతాన్ని పరిశీలించినప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం రెండుశాతం మాత్రమే అధికం. కొన్ని సందర్భాల్లో ఒక్కశాతం ఓట్లు కూడా పార్టీల అదృష్టాలను తల్లక్రిందులు చేయడం చూస్తూనే వున్నాం. ప్రస్తుతం ఢల్లీి అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా వీటిల్లో 48 భాజపాకు, 22 ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు లభించాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపాకు 45.8%, ఆప్‌కు 43.8%, కాంగ్రెస్‌ కు 6.4% ఓట్లు వచ్చాయి.అదే 2020 ఎన్నికల్లో భాజపాకు 38.5%, ఆప్‌కు 53.6%, కాంగ్రెస్‌కు 4.3% ఓట్ల షేర్‌ నమోదైంది. కాంగ్రెస్‌పార్టీ ఏఏపీతో జట్టుకట్టకపోవడం వల్లనే ఓట్లు చీలి భాజపాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయన్న వాదన ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ టర్మ్‌ పాలనలో ఆప్‌పై గతంలో ఎన్నడూ లేని రీతిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. శీష్‌మహల్‌, లిక్కర్‌కుంభకోణం వంటివి పార్టీ ఇమేజ్‌ను చాలా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్‌ జట్టు కట్టినా ఆ పార్టీ ఓట్లు ఆప్‌ ఖాతాలో పడతాయని చెప్పడం కష్టం. అదీకాకుండా కేవలం భాజపాతో పోలిస్తే కేవలం రెండుశాతం ఓట్ల తేడానే కదా అని వాదించేవారు కొన్ని నియోజకవర్గాల్లో ఆప్‌కు భారీ మెజారిటీ రావడం ఈ ఓట్లశాతం అధికంగా కనిపించడానికి ప్రధానకారణమన్న సంగతిని గుర్తించాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్ర మే అదికూడా ముస్లింలు అధికంగా వున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఆప్‌ థంపింగ్‌ మెజారిటీని సాధించింది. ఇది ఆపార్టీ ఓట్లశాతం దాదాపు చెక్కుచెదరలేదన్న భావనకు కారణమవుతోంది. నిజం చెప్పాలంటే 2020లో ఆప్‌ సాధించిన ఓట్లతో పోలిస్తే 2025 ఎన్నికల్లో 9.8% ఓట్ల షేర్‌ను కోల్పోయింది. ఈ విధంగా కోల్పోయిన ఓట్లు భాజపా ఖాతాలో 7.8%, కాంగ్రెస్‌ ఖాతాలో 2.1% చొప్పున జమ అయ్యాయి. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఆ రెండు పార్టీలకు ఆ మేరకు అధికశాతం ఓట్లు నమోదుకావడం సహజమే. గుర్తించాల్సిన మరో ప్రధానాంశ మేమంటే 2015`2020 వరకు ఆప్‌ ఓట్లశాతం 54.3%, 53.6% నమోదు కావడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉన్నదన్న సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లలో విజయం సాధించగలిగింది. నిజానికి ఈ రెండు ఎన్నికల్లో ఒకటికంటే తక్కువ ఓట్ల శాతం తగ్గిన ఫలితంగా ఐదుసీట్లు తగ్గిపోయాయి. ఇది 2025 ఎన్నికల కు ప్రమాద ఘంటికలుగా అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిగణించకపోవడం ఇప్పుడు పార్టీ ఓటమికి కారణ మైంది.
ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే 1993లో ఢల్లీి ఎన్నికల్లో 34.5% ఓట్లు సాధించగా, 42.8% ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2025లో మాత్రమే పార్టీ మళ్లీ అధికా రంలోకి రాగలిగింది. 1998, 2003 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకొని వరుసగా 47.8%, 48.1% ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక అక్కడినుంచి కాంగ్రెస్‌ పతనపథం అప్రతిహ తంగా కొనసాగుతూ వచ్చి 2015, 2020, 2025 సంవత్సరాల్లో వరుసగా 9.7%, 4.4%, 6.4% ఓట్లషేరు సంపాదించింది. 2020తో పోలిస్తే ఈసారి రెండుశాతం ఓట్లు ఎక్కువ రావ డానికి ప్రధాన కారణం, ఆప్‌ కోల్పోయిన ఓట్లు తన ఖాతాలో పడటమే!
ఆప్‌ పతనానికి కారణాలేంటి?
కాంగ్రెస్‌ నాయకురాలు శీలాదీక్షిత్‌ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పాటు ఢల్లీిని పాలించిన కాలంలో అవినీతి ఆరోపణలు పరాకాష్టకు చేరాయి. ఈ నేపథ్యంలో చైతన్యశీలురైన ఢల్లీి ప్రజలు 2011లో ఒక మార్పు అవసరమన్న నిర్ణయానికి వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో అవినీతిని నిర్మూలిస్తామంటూ 2012 అక్టోబర్‌ 2న ‘ఆమ్‌ ఆద్మీ’ పార్టీని స్థాపించి కెజ్రీవాల్‌ ప్రజల్లోకి రావ డంతో ఈయన చక్కటి ప్రత్యామ్నాయంగా భావించిన 2013 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. తర్వాతి కాలంలో అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్‌ పార్టీలో జట్టు కట్టే ప్రసక్తే లేదని కేజ్రీవాల్‌ శపథం చేశారు కూడా! డిల్లీని కాలుష్య రహితం చేస్తామని, 24I7 స్వచ్ఛమైన నీటిని అందిస్తామని,యమునానదిని ప్రక్షాళన చేస్తామని, ఢల్లీి రోడ్లను లండన్‌ రోడ్లతో పోటీపడేలా అందంగా తీర్చిదిద్దుతామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన భీషణ ‘ప్రతిజ్ఞ’ను తుంగలో తొక్కి అధికారం కోసం కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. తర్వాతి కాలంలో ఆయన దృష్టి ఢల్లీికి పరిమితం కాలేదు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలేష్‌ యాదవ్‌, లల్లూప్రసాద్‌ యాదవ్‌లతో చేతులు కలిపారు. ఈ విధంగా ఏ అవినీతికి వ్యతిరేకంగా ‘ఆప్‌’ స్థాపితమైందో, తాను ఏ పార్టీలపై అవినీతి ఆరోపణలు చేసారో, వాటితోనే అరవింద్‌ కేజ్రీవాల్‌ కలవడం, ప్రజల్లో ఆయనపట్ల అనుమానాలు పెంచేలా చేసింది. తర్వాతికాలంలో ఇతర పార్టీల అవినీతి మాట అట్లావుంచితానే పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. పార్టీ ముఖ్యనేతలైన మనీష్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌, సత్యేంద్రసింగ్‌ జైన్‌ చివరకు కేజ్రీవాల్‌ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. చివరకు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో జైలుపాలవక తప్పలేదు.
ఢల్లీి విద్యావ్యస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. కానీ ఈశాన్యఢల్లీిలోని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై గత ఏప్రిల్‌లో ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఈ రంగంలో అవినీతిని అరికట్టే ఉద్దేశంతో ‘మొహల్లా క్లినిక్‌’లు ఏర్పాటు చేశారు. కానీ ఈ క్లినిక్‌ల్లో కేవలం 11నెల ల్లో 65వేల మంది రోగులకు చికిత్స చేసినట్టు తప్పుడు లెక్కలను రికార్డుల్లో నమోదు చేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఢల్లీిలో అమలు చేయడానికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కూడా న్యాయవ్యవస్థ తప్పుపట్టింది.
కోవిడ్‌ మహమ్మారి తీవ్రస్థాయిలో వున్న సమయంలో తన అధికార నివాసం శీష్‌మహల్‌కు మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయల వ్యయంతో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించుకోవడంతీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో నీళ్ల ట్యాంకర్ల మాఫియా, రోడ్లు అధ్వాన్నంగాతయారవడం వంటి సమస్యలను పట్టించుకోలేదు. వీటిపై కూడా ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆప్‌ పాలనలో గత 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది, ప్రభుత్వం నిధుల లోటును ఎదుర్కొంది. ఫలితంగా నేషనల్‌ స్మాల్‌ సేవింగ్స్‌ ఫండ్‌ నుంచి రూ.10వేల కోట్లు అప్పు తీసుకోవడంతో ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదీ ప్రజలకు తెలిసొచ్చింది. కాంగ్రెస్‌ పాలనలో అంతటి స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిన దుస్థితి రాలేదు!
ఇక యమునా నది నీటిని శుభ్రం చేస్తానన్న హామీని కూడా కేజ్రీవాల్‌ అమలుపరచలేకపోయారు. ముఖ్యంగా ఛాట్‌పూజ సందర్భంగా మహిళలు కాలుష్యమయంగా వున్న యమునానదిలోకి దిగి ‘అర్ఘ్యం’ వదిలిన చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చెల్‌ చేశాయి. ఇక కేజ్రీవాల్‌ లిక్కర్‌ పాలసీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లిక్కర్‌ పాలసీ పుణ్యమాని వీధివీధికీ లిక్కర్‌షాపులు పుట్టుకొచ్చాయి. చివరకు ఈ స్కామ్‌లోనే ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. 11 నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు చెల్లింపులు జరపకపోవడంతో కేజ్రీవాల్‌ ఇచ్చిన మహిళా సంక్షేమంపై హామీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మహిళలకు నెలకు రూ.1000 చెల్లిస్తామన్న హామీని కూడా కేజ్రీవాల్‌ అమలుచేయలేదు.
అవకాశవాద రాజకీయాలు
కేజ్రీవాల్‌ రాజకీయాలు అవకాశాన్ని బట్టి మారుతూ వచ్చాయి. ముస్లింలను బుజ్జగించే చర్యల్లో భాగంగా మౌల్వీలకు నెలవారీ జీతాలు చెల్లించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం హిందూ, సిక్కు పూజారు లను పూర్తిగా విస్మరించింది. ఈ రెండు వర్గాల పూజార్లు కేవలం ఎన్నికల సమయంలో మాత్ర మే గుర్తుకురావడం కేజ్రీవాల్‌ మార్క్‌ రాజకీయానికి చిహ్నం! అయోధ్య రామమందిరానికి, హిందువులు పవిత్రంగా భావించే స్వస్తిక్‌ చిహ్నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కేవలం మైనారిటీలను బుజ్జగించడానికే! మిగతా హామీలు ఎట్లావున్నా, తమ భావోద్వేగాలపై కేజ్రీవాల్‌ చేస్తున్న దాడిని ఢల్లీిలోని హిందూ, సిక్కు ఓటర్లు మరచిపోలేదు. మరి పారదర్శకతకో గొంతు చించుకు న్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన 14 నివేదికలను తొక్కిపట్టి, అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇవన్నీ కేజ్రీవాల్‌ రాజకీయ, పాలనాపరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాలి.
ఆమ్‌ ఆద్మీ పార్టీని మిగిలిన పార్టీకంటే భిన్నంగా స్వచ్ఛమైందిగా చెప్పుకున్న కేజ్రీవాల్‌, తర్వాతి కాలంలో అధికారంకోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. అలవికాని హామీలు గుప్పిం చడం ఇందులో భాగమే. దీర్ఘకాల అభివృద్ధి పనులను పట్టించుకోకుండా, తాత్కాలిక ప్రయోజనా ల కల్పనతో అధికారంలోకి రావాలనుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఢల్లీి పూర్తి భిన్నం. ఇక్కడ మధ్యతరగతి, విద్యావంతులు అధికం. ప్రతి విషయాన్ని వారు జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, ఎప్పటికప్పుడ చైతన్యశీలంగా వుంటారు. వీరిని తక్కువ అంచనా వేయడం కేజ్రీవాల్‌ ఘోర తప్పిదం! ఇన్ని కారణాలతో ఆప్‌ ప్రస్తుతం ఓటమిపాలై, అలవికాని హామీలు గుప్పించే ఇతర పార్టీలకు ఒక గుణపాఠంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!