Indiramma House Inauguration Held in Sircilla
ఘనంగా నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణంలోని చంద్రంపేట 12వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షులు సూర దేవరాజు నిర్మల ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులైన ఇరు కుటుంబాలకు నూతన వస్త్రాలను బహుకరించారు.
ఈ సందర్భంగా సూర దేవరాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, రూ.500కే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు ఋణ మాఫీ, పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ వంటి పథకాల ద్వారా ప్రజా సంక్షేమం సాధ్యమవుతోందని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు నూనె త్రివేణి, గుడిసెట్టి బాలరాజు, కత్తెరపాక ఎల్లయ్య, వార్డు అధ్యక్షులు నూనె శ్రీనివాస్, సద్దుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
