TJS Demands More Procurement Centers
పంటకు తగ్గట్టు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలి
అన్నదాతలను ఆదుకోవాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ డిమాండ్
నర్సంపేట, నేటిధాత్రి:
పంట దిగుబడికి అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు.సమయానికి హమాలీలు రాక, ట్రాన్స్పోర్ట్ వాహనాలు లేక రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని కొందరు రైతులు తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని తెలిపారు. అప్పుడప్పుడు వచ్చే వడగాలులు, వానలు రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నాయని ఆయన అన్నారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బందిని పెంచి, రవాణా ఎప్పటికప్పుడు జరిగేలా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. మొక్కజొన్న రైతుల బాధలు ఇలా ఉంటే, వరి పంట కూడా రానుందని, వరి ధాన్యం కొనుగోలు కోసం అధిక సంఖ్యలో కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టీజేఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్, కార్యదర్శి వెలిశాల రాజేష్, రాష్ట్ర నాయకులు గుంటి రామచందర్, బోనగాని రవీందర్, జిల్లా నాయకులు గుంటి సంజీవ, ఎండి సంధాని, సోల్తి సాయి కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
