Paddy Procurement To Be Accelerated In Chennur
చెన్నూర్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం
మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర కార్మిక,ఉపాధి శిక్షణ,కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద ఒక ప్రకటనలో తెలిపారు.చెన్నూర్ నియోజకవర్గంలో ఈసారి వరి పంట అంచనాలకు మించి అధిక దిగుబడి వచ్చిందని,ప్రస్తుతం నెలకొన్న అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయడం కోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు.రైతులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం ద్వారా కొనుగోలు వేగవంతంగా జరుగుతుందని తెలిపారు.చెన్నూర్ ప్రాంతంలో ధాన్యం నిల్వ కొరకు గోదాముల సౌకర్యం,హమాలీల సంఖ్య పెంపొందించడం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న లారీలకు 75 లారీలను అదనంగా కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్,అధికార యంత్రాంగం ధాన్యం కొనుగోలు ప్రక్రియపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారని,రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.రాబోవు వారం రోజులలో రైతుల వద్ద నుండి ప్రతి గింజ కొనుగోలు చేసి ప్రభుత్వ నిర్దేశిత మద్దతు ధర చెల్లించడం జరుగుతుందని,రైతులు ఆలస్యం చేయకుండా వరి ధాన్యంను కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని తెలిపారు.
