దేవరకద్ర యం ఈ ఓ బలరాం..
లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు ఏక రూప దుస్తుల పంపిణీ..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని
దేవరకద్ర మండల విద్యాధికారి పి.బలరాం అన్నారు.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నూతన యం ఈ ఓ గా బాధ్యతలు స్వీకరించిన బలరాం శనివారం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల తరగతి బోధన, తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల హెచ్ ఎం ఎం.ఏ. బాసిద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో యంఈ ఓ, బల రాం మాట్లాడుతూ, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు గుణాత్మక మైన విద్యతో పాటు అక్షయ పాత్ర ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు.పాఠ్యపుస్తకాలు రెండు జతల ఏక రూప దుస్తులు సైతం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ల ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్విని యోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యా బుద్దులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ నిధుల తో పాటు ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారంతో లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ప్రగతికి చేస్తున్న కృషిని వివరించారు. కాగా మండల విద్యాధికారి బాధ్యతలు స్వీకరించిన తదుపరి లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల ను సందర్శించిన యంఈ ఓ, బలరాం ను ఈ సందర్భంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ యం లు , ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ ఎం లు బాసిద్, మురళీధర్ ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ , ఎస్.కల్పన, ఆస్ర ఖాద్రి, దోమ శంకర్, సుజాత, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.