Collector’s Surprise Inspection at KGBV School
కస్తూరిబా గాంధీ విద్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
పట్టుదల క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి.
జిల్లాలోని అన్ని విద్యాసంస్థలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలి.
విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.
జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్.
కేసముద్రం/ నేటి ధాత్రి
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ, అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలలో హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ లపై క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ప్రత్యేక అధికారులు సంబంధిత సిబ్బంది ముందుకు సాగాలని, పిల్లలకు అందించే సౌకర్యాలలో ఎలాంటి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు.

బుధవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ విద్యాలయంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యాలయంలోని స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందిస్తున్న సౌకర్యాలు, డైట్ మెనూ, తరగతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని, పక్కాగా డైట్ మెనూ ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం స్నాక్స్ అందించాలని, తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు.

ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థిని, గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు.
ప్రత్యేక అధికారులు ఇప్పటికే వారికి కేటాయించిన విద్యా సంస్థలలో తనిఖీలు నిర్వహించి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడం జరుగుతుందని, ప్రతిరోజు ఉదయం సాయంత్రం వసతిగృహాలు, విద్యా సంస్థల నివేదికలు సమర్పించాలని సూచించారు.
కేజీబీవీ పాఠశాలలో పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, స్పెషల్ అధికారినీ సోమలక్ష్మిని పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి వారికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలని, లేనిపక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, స్థానిక తహసిల్దార్ వివేక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
