Farmer Awareness Meets Held
రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు
# నెక్కొండ, నేటి ధాత్రి:
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం, రైతు వారోత్సవాల్లో భాగంగా నెక్కొండ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పలు రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు నిర్వహించారు. నెక్కొండ, రెడ్లవాడ, నాగారం, అలంకనిపేట, తోపనపల్లి, పెద్దకోర్పోల్, దీక్షకుంట క్లస్టర్ పరిధిలోని రైతులు పాల్గొన్నారు.
నెక్కొండ రైతు వేదికలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ, రైతులు ప్రతీ ఏటా ప్రత్తి, మొక్కజొన్న పంటలకే పరిమితం కాకుండా పంటమార్పిడి వైపు అడుగులు వేయాలని సూచించారు. ఆయిల్ పామ్, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచి ఆదాయాన్ని పెంచుకోవాలని తెలిపారు.
వ్యవసాయ శాఖ అధికారులు సేంద్రీయ వ్యవసాయం, వరిలో సన్న రకాల సాగు, యాసంగి ధాన్యం సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు వివరించారు. మండల పశువైద్య అధికారి డాక్టర్ మమత ,పశుగ్రాస జొన్న విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ సెక్రటరీ కృష్ణమీనన్ పంటలను మార్కెట్కు తేవడంలో శుభ్రత పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
