ACB Raids on Deputy Collector Houses
మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు..
నేటిధాత్రి, మేడ్చల్.
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీ మోహన్‌కు సంబంధించిన ఎనిమిది ఇండ్లలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ భూములను భారీ ఎత్తున అక్రమంగా స్వాహా చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అక్రమాస్తుల కేసు నమోదు చేసి ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన వంశీ మోహన్‌పై అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలోని పిగ్లీపూర్ ప్రాంతంలో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన మామ పేరుతో భూమిని రిజిస్ట్రేషన్ చేయించి, అనంతరం ఓ రియల్టర్‌కు బదిలీ చేసినట్లు అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంలో ఓ రియల్టర్ నుంచి పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో స్వీకరించినట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను వంశీ మోహన్ కూడబెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
