Special Leave For Blood Donors Demanded
రక్తదానం చేసిన కార్మికులకు స్పెషల్ లీవ్ ఇవ్వాలి
ఆర్కే న్యూటెక్ యాజమాన్యంపై సీఐటీయూ నేత అల్లి రాజేందర్ ఆగ్రహం
శ్రీరాంపూర్ : నేటి ధాత్రి
అనుకోని ప్రమాదాలలో గాయపడిన వారికి, గర్భిణీ మహిళలకు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, తలసేమియా, సికిల్ సెల్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వస్తున్న కార్మికులను ఇబ్బందులకు గురి చేయడం తగదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్ ప్రకటనలో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్తదానం చేసిన వారికి గుర్తింపుగా ఒక రోజు ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని జీవోఎంఎస్.నం.13020/1/2017 ద్వారా సూచించిందని తెలిపారు. అలాగే సింగరేణి సంస్థ కూడా సిఆర్పి/పిఇఆర్/ఐఆర్/డబ్ల్యూ/642/10Th We/12 తేదీ 05-01-2022 సర్కులర్ ద్వారా రక్తదానం చేసిన కార్మికులకు స్పెషల్ లీవ్ ఇవ్వాలని పేర్కొన్నదని గుర్తు చేశారు.సింగరేణిలోని పలు ఏరియాలలో గతంలో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో పాల్గొన్న కార్మికులకు ప్రత్యేక సెలవులు మంజూరు చేసిన యాజమాన్యం, ప్రస్తుతం ఆర్కే న్యూటెక్ గనిలో మాత్రం స్పెషల్ లీవ్ మంజూరు చేయకపోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని విమర్శించారు.ఇప్పటికైనా గని యాజమాన్యం పునరాలోచన చేసి రక్తదానం చేసిన కార్మికులకు స్పెషల్ లీవ్ మంజూరు చేసి, మరింత మంది ప్రాణదాతలుగా నిలిచేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
