Legal Aid Help Desk Opened in Women’s Jail
నర్సంపేట మహిళా కారాగారంలో లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్ ప్రారంభం
మహిళా ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులోకి
నర్సంపేట, నేటిధాత్రి:
వరంగల్ జిల్లా నర్సంపేట ప్రత్యేక మహిళా కారాగారంలో ఖైదీలకు చట్టపరమైన సేవలు వేగంగా, సులభంగా అందించేందుకు “లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్”ను ప్రారంభించినట్లు వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఏ. ప్రదీప్ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జైలుకు వచ్చే ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులకు “ములాఖత్” ప్రక్రియను సరళీకరించడం ఈ డెస్క్ ప్రధాన ఉద్దేశమన్నారు. ముఖ్యంగా మహిళా సంరక్షకులు, వృద్ధులు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి అవసరమైన న్యాయ అవగాహన, మార్గదర్శకత్వం ఇక్కడ అందిస్తామని తెలిపారు.ఖైదీలను కలిసేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన చట్టపరమైన సహాయం అందజేస్తామని చెప్పారు.

అర్హులైన ఖైదీలకు ఉచిత న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రైవేట్ న్యాయవాదులను నియమించుకోలేని వారికి ప్రభుత్వ ఖర్చుతో ప్యానెల్ లాయర్లను కేటాయిస్తామని వివరించారు.బెయిల్ దరఖాస్తులు, కేసుల ప్రస్తుత స్థితి, కోర్టు ఆదేశాలు, అవసరమైన పత్రాల భద్రత వంటి అంశాలపై ఖైదీల కుటుంబాలకు సహాయం అందించనున్నట్లు తెలిపారు. లీగల్ ఎయిడ్ వాలంటీర్లు కేసుల పురోగతిపై సమాచారం అందిస్తారని చెప్పారు.“చట్టం ముందు అందరూ సమానులే. జైలులో ఉన్నంత మాత్రాన ప్రాథమిక హక్కులు కోల్పోరు. ఖైదీలు, వారి కుటుంబాలు ఈ హెల్ప్ డెస్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి” అని న్యాయమూర్తి ఏ. ప్రదీప్ సూచించారు.
అనంతరం న్యాయమూర్తులు మహిళా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట న్యాయమూర్తులు ఎం.డి. యూసుఫ్, గిరిధర్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఆర్. రజినీ, జైలు సందర్శక న్యాయవాది టి. సునిత, ఇన్చార్జి సూపరింటెండెంట్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
