Mobile Addiction Weakening Human Bonds
మొబైల్ మోజులో మానవ బంధాలు మాయం
స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్న యువత
పరకాల,నేటిధాత్రి
సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనిషి జీవితం సులభతరం అవుతున్నప్పటికీ,అదే సాంకేతికత ఇప్పుడు మనిషిని మౌన బానిసగా మార్చుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో యువత, చిన్నారులు వాస్తవ జీవితానికి దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక చిత్రం సమాజంలోని ఈ వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.చిత్రంలో ఒక కుక్కను గొలుసుతో కట్టేసి చూపించగా,దిగువన ఒక వ్యక్తి మొబైల్ ఛార్జింగ్ వైర్‌కు బంధింపబడి ఫోన్లో మునిగిపోయినట్టుగా చిత్రీకరించారు.ఈ దృశ్యం ద్వారా మనిషి ఇప్పుడు మొబైల్‌కు బానిసగా మారిపోయాడు అనే సందేశం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రస్తుతం యువతలో గంటల తరబడి మొబైల్ ఫోన్ వినియోగం పెరగడంతో చదువులు,కుటుంబ సంబంధాలు,ఆరోగ్యం దెబ్బతింటున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా ఫోన్లలో గడపడం వల్ల నిద్రలేమి,మానసిక ఒత్తిడి,ఏకాగ్రత లోపం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అదేవిధంగా చిన్నారులు బయట ఆటలు,పుస్తక పఠనం వదిలి మొబైల్ గేమ్స్,వీడియోలకే పరిమితమవుతున్న పరిస్థితి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.సాంకేతికతను అవసరానికి మాత్రమే ఉపయోగించి,సమయ పరిమితులు పాటించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.స్మార్ట్‌ఫోన్ వినియోగంపై ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి,కుటుంబ సభ్యులతో సమయం గడపడం,పుస్తక పఠనం,క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
