Char Dham Yatra: A Divine Himalayan Journey
ఒక్క క్షణం కళ్లు మూసుకోండి…
చుట్టూ మంచు పర్వతాలు…
ఆకాశాన్ని తాకుతున్నట్లున్న శిఖరాలు…
గాలిలో గంటానాదాల ప్రతిధ్వనులు…
నిరంతరం ప్రవహించే పవిత్ర నదుల హోరు.
ఈ అసాధ్యమైన ప్రకృతి ఒడిలో, అద్భుతమైన దైవత్వాన్ని దర్శించుకునే ఆ ప్రయాణం ఏమిటో తెలుసా? అదే.. మన భారతీయ ఆధ్యాత్మికతకు మూలస్థంభమైన ‘చార్ ధామ్ యాత్ర’. భారత దేశంలోని అత్యంత పవిత్రమైన తీర్ధ యాత్రల్లో ఉత్తరాఖండ్ చార్ ధామ్ ఒకటి. అసలు ఈ యాత్ర మొదట ఎలా ప్రారంభమైంది… చార్ ధామ్ విశేషాలు ఏమిటి? ఇప్పుడు చూద్దాం.
హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరు దర్శించుకోవాలనుకునే నాలుగు ధామాల యాత్రని చార్ ధామ్ యాత్ర అంటారు. శ్రీ ఆది శంకరాచార్య సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుండి ఈ తీర్ధయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతూ వస్తుంది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికులు ప్రతి ఏటా ఏప్రిల్ – మే నెలల్లో తెరిచే నాలుగు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దీపావళి తరువాత శీతాకాలంలో ఎముకలు కొరికే చలి, మంచు కారణంగా ఈ ఆలయాల ద్వారాలను మూసి వేస్తారు.
ఈ యాత్రలో భాగంగా హిమాలయ పర్వతాలలో ఉన్న నాలుగు పవిత్ర క్షేత్రాలను దర్శించుకుంటారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ నాలుగు ధామాలను కలిపి చార్ ధామ్ అంటారు. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ఏప్రిల్ లేదా మే నెలల్లో ప్రారంభమై వాతావరణ పరిస్థితులను బట్టి నవంబర్ వరకు కొనసాగుతుంది. చార్ ధామ్ యాత్రను యమునోత్రి నుంచి ప్రారంభించి, తర్వాత గంగోత్రి, కేదార్నాథ్, చివరగా బద్రీనాథ్ దర్శనంతో ఈ యాత్ర ముగుస్తుంది.
మన ప్రయాణం మొదట యమునోత్రితో మొదలవుతుంది. మంచు పర్వతాల మధ్య నుంచి ఉద్భవించే యమునా నదిని చూస్తుంటే, ఏదో తెలియని పవిత్రత మనసును తాకుతుంది. అక్కడ ‘సూర్య కుండ్’లో వేడినీటి బుగ్గలను చూస్తుంటే… ప్రకృతి ఎంతటి అద్భుతమైన కళాకారుడో కదా అనిపిస్తుంది.” యమునోత్రి ఆలయం చేరడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యానులు, కార్లు, బస్సులు వెళతాయి.అక్కడినుండి గుర్రం, డోలీ, లేదా కాలి నడకన ఆలయంకు చేరుకోవాలి.
చార్ ధామ్ యాత్రాలో రెండవ ధామం గంగోత్రి. గంగోత్రి ఆలయం మే నెలలో వచ్చే అక్షయ తృతీయ రోజున తెరుస్తారు.
శివుని జటాజూటం నుంచి భూమిపై గంగ పడిన తొలి ప్రదేశమే గంగోత్రి. గంగోత్రిలో గంగామాత ఆలయాన్ని దర్శించుకోవచ్చు. గంగోత్రిని బస్సు లేక కారులో ప్రయాణించి చేరుకోవచ్చు. అందుకే యమునోత్రి కంటే గంగోత్రికి వచ్చే సందర్శకుల సంఖ్య అధికంగా ఉంటుంది. అయితే గంగ పుట్టిన ప్రదేశంగా భావించే గోముఖ్ పర్వతానికి చేరుకోవాలంటే మాత్రం ట్రెక్కింగ్ చేయాల్సిందే!
మూడో ధామం కేదార్నాథ్.
అసలైన పరీక్ష మనకు ఎదురయ్యేది కేదార్నాథ్ వెళ్లేటప్పుడే! కొండ కోనల మధ్య, ఎత్తైన శిఖరాల ఒడిలో పరమశివుడు లింగ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం అది. ఆ కఠినమైన నడక… ఆ చలి… కానీ ఒక్కసారి ఆ ఆలయ శిఖరాన్ని చూడగానే మనసులో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం. ఆ శివనామ స్మరణలో గడిపే ప్రతి నిమిషం… ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. గత కొన్ని సంవత్సరాలుగా కేదార్నాథ్కు హెలికాప్టర్ సర్వీసులు కూడా భారత ప్రభుత్వం నడుపుతోంది.
నాలుగవ ధామం బద్రీనాథ్.
చివరగా మన ప్రయాణం చేరుకునేది బద్రీనాథ్. వైకుంఠధామం అంటారు కదా, సరిగ్గా అలాగే ఉంటుంది. బద్రీనాథ్ ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో అలకనందానదీ తీరంలో సముద్ర మట్టానికి సుమారు 3133 మీటర్ల ఎత్తులో ఉంది. స్కంద పురాణంలో వివరించిన ప్రకారం స్వర్గంలోనూ నరకంలోనూ అనేక పవిత్ర క్షేత్రాలు ఉన్నా బద్రీనాధ్ లాంటి పవిత్ర క్షేత్రం ఎక్కడా లేదని తెలుస్తోంది.
అలకనంద నది ఒడ్డున, ఎత్తైన పర్వతాల మధ్య వెలసిన బద్రీనాథుడిని చూస్తుంటే… మనం భూమి మీద ఉన్నామా లేక స్వర్గంలో ఉన్నామా అన్నట్లు ఉంటుంది. ఆ పక్కనే ‘మానా’ గ్రామం… వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించిన ఆ వ్యాస గుహలో కూర్చుంటే… కాలం ఆగిపోయినట్లు ఉంటుంది.” బద్రీనాథ్ ఆలయం సమీపం వరకు బస్సులు, కార్లు వెళతాయి కాబట్టి ప్రయాణంలో ప్రయాస ఉండదు.
“యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్… ఈ నాలుగు ధామాల యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, మన అంతరాత్మను మనం వెతుక్కునే ఒక దివ్యమైన యాత్ర.
మీరు చార్ ధామ్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
