Gautama Buddha Jayanti Celebrated with Spiritual Fervor
గౌతమ బుద్ధ జయంతి శుభాకాంక్షలు
పరకాల,నేటిధాత్రి
వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే గౌతమ బుద్ధ జయంతి(బుద్ధ పూర్ణిమ)ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది.బౌద్ధ మతానికి ఆది గురువైన గౌతమ బుద్ధుడు క్రీస్తూ పూర్వం 6వ శతాబ్దంలో నేటి నేపాల్లోని లుంభినిలో జన్మించినట్లు చరిత్రకారులు,పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.కపిలవస్తు రాజు శుద్ధోదనుడు,మహామాయల కుమారుడిగా జన్మించిన సిద్ధార్థుడు,రాజభవనంలో సుఖసౌకర్యాల మధ్య పెరిగాడు.యశోదరతో వివాహం కాగా రాహులుడు అనే కుమారుడు జన్మించాడు.అయితే జీవితంలోని వృద్ధాప్యం, వ్యాధి, మరణం వంటి దృశ్యాలను చూసిన అనంతరం జీవన సత్యంపై ఆలోచనలో పడ్డాడు.29 ఏళ్ల వయసులో రాజభవనాన్ని విడిచి,సత్యాన్వేషణ కోసం బయలుదేరిన సిద్ధార్థుడు, బీహార్ రాష్ట్రంలోని బోధ్ గయలో బోధి వృక్షం క్రింద తపస్సు చేసి 35వ ఏట బుద్ధుడిగా అవతరించాడు. మానవ దుఃఖాలకు కోరికలే కారణమని,వాటి నివారణకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలని ఆయన బోధించారు.అష్టాంగ మార్గం ప్రధానసూత్రాలు.దృష్టి,సంకల్పం,వాక్కు,కర్మ,జీవనోపాధి, ఏకాగ్రత,స్మృతి,సమాధి అనే ఎనిమిది మార్గాల ద్వారా సత్యనిష్ఠ,అహింస,ధ్యానం, నైతిక విలువలతో జీవించాలనే సందేశాన్ని బుద్ధుడు అందించారు.బుద్ధుని బోధనలలో ప్రేమ,కరుణ,అహింసకు ప్రాధాన్యం ఉంది.ద్వేషం,కోపం,ప్రతీకారాల కంటే సహనంతో,దయతో జీవించడం గొప్పదని ఆయన ఉపదేశించారు.కోపం మనిషిని నాశనం చేసే అగ్ని వంటిది అని హెచ్చరిస్తూ,శాంతి మార్గాన్ని అనుసరించాలని సూచించారు.ఈ సందర్భంగా ఆసియా దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతస్థులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తూ బుద్ధుని సందేశాలను స్మరించుకుంటున్నారు. శాంతి,సమాధానం,ప్రేమ, సహాయ భావన వంటి విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిస్తున్నారు.సారాంశంగా గౌతమ బుద్ధుని బోధనలు నేటికీ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.మానవ జీవితంలో కోరికలను నియంత్రిస్తూ,నిజాయితీ, ధర్మం,కరుణతో జీవించడం ద్వారానే ప్రశాంత జీవితం సాధ్యమని బుద్ధుని సందేశం స్పష్టంగా చెబుతోంది.
ఇనుగాల దిలీప్ మహారాజ్.ధర్మ సమాజ్ పార్టీ నాయకులు
సెల్:84660 26237
