Child Safety Awareness Program Held in Mogullapally
– చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమం
-ఈ కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ ముప్పు సురేష్
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
బాల బాలికలు మరియు వారి తల్లిదండ్రులు చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, చిన్నప్పటినుండే పిల్లలకు తల్లిదండ్రులు బాలికల భద్రతకు సంబంధించిన వివిధ చట్టాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలని మొగుళ్లపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ కోరారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో అంగన్వాడీ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీ వీక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి మొగుళ్ళపల్లి ఎస్ఐ ముప్పు సురేష్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు మరియు బాలబాలికల భద్రతపై అవగాహన కల్పించడం ప్రస్తుత సమాజంలో అత్యంత ఆవశ్యకమని, మహిళలు మరియు పిల్లలు వారి రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని, ఆపద సమయంలో ధైర్యంగా ఎలా వ్యవహరించాలో కూడా తెలుసుకోవాలన్నారు. భద్రత యాప్ లు మరియు హెల్ప్ లైన్ల నెంబర్ల గురించి కూడా పూర్తి అవగాహన ఉండాలని, సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆన్లైన్ వేధింపుల నుండి ఎలా రక్షణ పొందాలో కచ్చితంగా తెలుసుకోవాలని, బాలికలకు వారి తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ లోని చిన్న చిన్న మెలకువలను నేర్పించాలని, అనుమానాస్పద వ్యక్తుల నుండి ఎలా తప్పించుకోవాలో కూడా తల్లిదండ్రులు నేర్పాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు బాలికలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలని, కౌమార దశలో వచ్చే శారీరక మార్పుల గురించి శాస్త్రీయంగా వివరించాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమతో వ్యవహరించినప్పుడే వారికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుంటారని, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని, ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉండడం వల్ల తల్లిదండ్రులు పిల్లలకు పూర్తిగా సహకరించాలని, పోస్టర్లు మరియు కరపత్రాల ద్వారా పిల్లలకు చట్ట పరమైన నిబంధనలు మరియు హెల్ప్ లైన్ ల గురించి సమాచారం ఇవ్వడం వలన పిల్లలలో మార్పు కలుగుతుందని, పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజంలోని ప్రమాదం గురించి మరియు వారి హక్కుల గురించి అవగాహ నకల్పించడం మనందరి బాధ్యత అని చైల్డ్ సేఫ్టీ వీక్ అనేది పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించే ఒక వేదిక కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మేదరమట్ల గ్రామ సర్పంచ్ వైనాల ధనలక్ష్మి, ఏఎన్ఎం షబీదా, మహిళా సమైక్య పావని, చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్ కళావతి, పంచాయతీ సెక్రెటరీ శారద, జిపిఓ రజిత, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు, కిశోర బాలికలు, తల్లులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
