Shankar as Villain?
కమల్-రజనీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్?
దక్షిణాది సినిమా ముఖచిత్రాన్ని మార్చిన దర్శకుల్లో శంకర్ ఒకరు. 90వ దశకంలో జెంటిల్‌మ్యాన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, ఒకే ఒక్కడు చిత్రాలతో ఆయన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత కూడా అపరిచితుడు, రోబో లాంటి అద్భుతాలను వెండితెరపై ఆవిష్కరించారాయన. కానీ గత దశాబ్ద కాలంగా ఆయనకు కలిసి రావడం లేదు. ముఖ్యంగా గత రెండేళ్లలో ఇండియన్-2, గేమ్ చేంజర్ చిత్రాలతో కెరీర్లో పతనం చవిచూశాడు శంకర్.
రెండు గట్టి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ.. వెనక్కి తగ్గకుండా ‘వేల్పారి’ అనే భారీ చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.
ఐతే ఈ చిత్రానికి భారీ బడ్జెట్, కాస్టింగ్ అవసరం కావడంతో ప్రాజెక్టు కొంచెం లేటవుతోంది. ఈలోపు శంకర్.. ముఖానికి రంగు వేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని విలన్ పాత్రలో చూపించాలని యువ దర్శకుడు శిబి చక్రవర్తి చూస్తున్నాడట.
రజనీ-కమల్ మల్టీస్టారర్ కోసం ఈయన విలన్‌గా మారబోతున్నాడనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కమల్‌హాసన్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. నటుడిగా కాస్త జోరు తగ్గించినప్పటికీ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ 173వ మూవీలో కమల్ నటించడంతో పాటు నిర్మిస్తున్నారు కూడా. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే ఓ వీడియో వదలగా అదేమో హైప్ పెంచేసింది. ఇప్పుడు ఆ హైప్‌ని రెట్టింపు చేసే విషయం ఒకటు బయటకు వచ్చింది.
ఈ సినిమాకు కొత్త లుక్ తీసుకొచ్చేందుకు శిబి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా రజినీని సరికొత్త అవతారంలో చూపించడమే కాదు.. కొత్త విలన్ గా శంకర్ ను కూడా తీసుకురావాలని చూస్తున్నాడు. శంకర్‌తో ఆ పాత్ర చేయించాలన్నది అతడి ఆలోచనట. మరి ఇప్పటిదాకా నటన వైపే చూడని శంకర్ ఒకేసారి సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్ర అంటే.. మెప్పించగలడా అన్నది సందేహం.
