Arunodaya Elects New Warangal Committee
అరుణోదయ సాంస్కృతిక సమైక్య వరంగల్ జిల్లా ఉమ్మడి కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా ఇట్టబోయిన రవి, కార్యదర్శిగా గుర్రం అజయ్
నర్సంపేట,నేటిధాత్రి:
అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఉమ్మడి వరంగల్ జిల్లా 7వ మహాసభ సోమవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఇట్టబోయిన రవి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా గుర్రం అజయ్ ఎన్నికయ్యారు. సభకు ముందు ఇట్టబోయిన రవి అరుణోదయ జెండాను ఆవిష్కరించారు.
సభలో ముఖ్య వక్తలుగా యోచన, ప్రజాకవి వాగ్గేయకారుడు, అరుణోదయ సహాయ కార్యదర్శి చిరంజీవి, ఇడంపాక శ్రీశైలం మాట్లాడారు. హైదరాబాద్లో ఏప్రిల్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న అరుణోదయ రాష్ట్ర 7వ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గుర్రం అజయ్ మాట్లాడుతూ, దోపిడీ, పీడన, అణచివేతలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల తరఫున పోరాడుతున్న సాంస్కృతిక సంస్థగా అరుణోదయ పనిచేస్తోందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో 1974లో అరుణోదయ ఆవిర్భవించిందని తెలిపారు. ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ, నృత్యం వంటి జానపద కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిందన్నారు. సారా, కరువు, డ్రగ్స్, గంజాయి, వరకట్నం, మూఢనమ్మకాలపై పాటల ద్వారా ఉద్యమాలు నిర్వహించిందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా కళారూపాలతో ప్రజలను ఉద్యమం వైపు నడిపించిందన్నారు.

గిరిజన, దళిత, ముస్లిం మైనారిటీ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జరిగిన ఉద్యమాల్లో అరుణోదయ కీలక పాత్ర పోషించిందన్నారు. అమరులైన కళాకారులను స్మరించుకుంటూ గతాన్ని సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునేందుకు హైదరాబాద్లో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అలాగే జిల్లా కమిటీ సభ్యులుగా జన్ను కార్తీక్, మల్లయ్య చారి, సౌందర్య, గద్దల వసంత, గద్దల శ్యాంసుందర్, నంబియార్ తదితరులను సభ్యులుగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, నాయకులు బండి కోటేశ్వర్లు, గట్టి కృష్ణ, గంగుల దయాకర్, జక్కుల తిరుపతి, పూలక్క, మల్లన్న, పాణి, ఆకుల వెంకటస్వామి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
