“600 Litres Illicit Liquor Destroyed”
గుడుంబా స్థావరంపై దాడి.. కేసు నమోదు
600 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం, 5 లీటర్ల నాటుసార స్వాధీనం
నర్సంపేట/గీసుగొండ,నేటిధాత్రి:
గుడుంబా తయారీ స్థావరంపై దాడి నిర్వహించి కేసు నమోదు చేసినట్లు గీసుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. విశ్వేశ్వర్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధి గీసుకొండ మండలంలోని గొర్రెకుంట గ్రామ శివారులో నందనాయక్ తండాకు చెందిన భూక్యా శంకర్ అనే వ్యక్తి ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారు చేస్తున్నాడనే సమాచారం మేరకు దాడి నిర్వహించామన్నారు.దాడిలో సుమారు 600 లీటర్ల గుడుంబా పానకాన్ని ధ్వంసం చేసి, 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపారు. గుడుంబా తయారీ, నిల్వ, రవాణా, విక్రయం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. అక్రమ మద్యం వల్ల ప్రాణాపాయం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీ లేదా అమ్మకాలపై సమాచారం ఉన్న వారు సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని సీఐ విశ్వేశ్వర్ పేర్కొన్నారు.
