Nirmala Sitharaman Creates History with 9th Union Budget
నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.
భారత్ ఎదిగితే ప్రపంచం ఎదుగుతుందని యూరోపియన్ యూనియన్ అధ్యక్షులు చెప్పడం విశేషమని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాల దృష్ట్యా ఈ బడ్జెట్లో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు. అమరావతిని చట్టబద్ధమైన ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్యాకేజీలు, నాబార్డ్ వంటి సంస్థల నుంచి ఆర్థిక సహాయం అందనుందని వెల్లడించారు.
ప్రపంచ ఆక్వా ఎగుమతుల్లో భారత్ వాటా 76 శాతం కాగా, అందులో 60శాతం కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే జరుగుతోందని వివరించారు. ఈ రంగానికి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత లభించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాల వల్ల ప్రపంచ వాణిజ్య సంస్థలకు ఆంధ్రప్రదేశ్‌పై నమ్మకం పెరిగి, భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మొత్తంగా, ఈ బడ్జెట్ అటు దేశ భద్రతకు, ఇటు వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
విజయవాడలో బీజేపీ వారధి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాకా సత్యనారాయణ హాజరై మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం బీజేపీ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించారు. ప్రజల సమస్యలను వివిధ ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకెళ్లి, వాటికి త్వరితగతిన పరిష్కరించేలా ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.
ప్రతి శుక్రవారం ఒక ప్రజా ప్రతినిధి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో ఈ ‘వారధి’ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలపారు. ప్రజలు తమకు ఉన్న ఇబ్బందులను, సమస్యలను ఈ వేదిక ద్వారా తెలియజేసి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య ఒక ‘వారధి’లా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పాకా సత్యనారాయణ పేర్కొన్నారు.
