Crane Collapse Kills 5 in Shankarpally
శంకర్పల్లి లో ఘోర ప్రమాదం
క్రేన్ కుప్పకూలి ఐదుగురు మృతి , 11 మందికి తీవ్ర గాయాలు
మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల పరిహారం ప్రకటన
శంకర్ పల్లి, నేటిధాత్రి :
శంకర్పల్లి మండలం మహాలింగాపురం సమీపంలో సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బలమైన ఈదురు గాలులు వీయడంతో
భారీ క్రేన్ అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడ పని చేస్తున్న కార్మికులపై పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు, సహచర కార్మికులు స్పందించి శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై ఎన్ సీసీ సంస్థ స్పందిస్తూ, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం క్రేన్లో సాంకేతిక లోపం లేదా భద్రతా ప్రమాణాల లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
