`మితిమీరిన అక్కసు మీడియా కెందుకు ?
`సీమాంధ్ర మీడియా అంత విరుచుకుపడుతుంటే నమస్తే తెలంగాణ ఏం చేస్తున్నట్లు?
`టి. న్యూస్ ఏం సంకేతాలు పంపుతున్నట్లూ?
`నిజా నిజాలు ఎందుకు చెప్పకపోతున్నట్లు?
`టి. న్యూస్ మౌనం దేనికి సంకేతం?
`ఇతర మీడియాలు డిబేట్ల మీద డిబేట్లు పెడుతుంటే టి. న్యూస్ ఏం చేస్తున్నట్లు?
`డిల్లీ లిక్కర్ పాలసీ కేసెలావుతుంది?
`స్కామ్ అనడానికి ఆస్కారమేముంది?
`అయితే గియితే అది డిల్లీ ప్రభుత్వానికి సంబంధించినది?
`డిల్లీ ప్రభుత్వం స్కీమ్ విరమించుకున్నాక తవ్వకం కక్ష కాక మరేమిటి?
`అది ప్రభుత్వ వ్యాపారం కాదు… కుంభకోణానికి ఆస్కారమే లేదు?
`నష్టపోతే వ్యాపారులకు దెబ్బ?
`రాజకీయాలలో ఎన్నికల ప్రచారానికి కూడా మీడియేటర్లు కావాలి? మీడియా కూడా అందరికీ కావాలి?
`మరి మీడియా కూడా స్కామ్ చేస్తున్నట్లేనా?
`ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఆదేశాలు కూడా తప్పేనా?
`వ్యాపారమన్నాక మధ్య వర్తులు లేకుండా జరుగుతుందా?
`ఆదాని వ్యాపారంలో ఇతరుల పాత్ర లేదా?
`దేశమంతా కవితపై కక్ష సాధింపు అన్నది చర్చ జరుగుతోంది?
`కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేయకతప్పదని తెలుస్తోంది?
`అనవసరంగా రాష్ట్ర బిజేపి నేతల మాట విని అధిష్టానం అంతర్మధనంలో పడినట్లుంది?
` అందుకే అరవింద్ వాయిస్ లో మార్పు వచ్చింది?
`బండి వ్యాఖ్యలకు పార్టీకి సంబంధం లేదని అరవింద్ నోట వచ్చింది?
`ఈ సంకేతాలు చాలు కవితపై కక్ష నిజమే! అని చెప్పడానికి?
ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు విశ్లేషణాత్మక కథనం.
హైదరాబాద్,నేటిధాత్రి:
ఈ తరం రాజకీయాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్ధానం. దేశ రాజకీయాల్లో కీలక స్ధానం. తెలంగాణ రాజకీయాల్లో విశిష్ట స్ధానం. ప్రతిభ, సేవాభావం, రాజకీయం, ప్రగతి పధకం, జాగృతి పదనిర్ధేశం అన్నవి గొప్ప అంశాలు. ఇవన్నీ పునికి పుచ్చుకున్న నాయకురాలు కవిత. ఇప్పుడున్న పరిస్ధితుల్లో అలాంటి నాయకురాలు మా పార్టీలో లేదన్న అసూయ, ఆక్రోశం కూడా ఇతర రాజకీయ పార్టీలలో చాలా కాలంగా వుంది. నిరంతరం ప్రజల్లోవుండడం, ప్రజా సమస్యలపై స్పందిచే తత్వం కవితది. అందరికీ తెలిసిందే. కల్వకుంట్ల కవిత లాంటి డైనమిజం వున్న నేత మరే రాష్ట్రంలో లేదు. బిజేపి, కాంగ్రెస్‌పార్టీలో అంతకన్నా లేదు. దాంతో ఆమె నాయకత్వం భవిష్యత్తు తరంలో పెద్ద పెద్ద నాయకులకు కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం వుంది. నిజామాబాద్ ఎంపిగా ఆమె చేసిన సేవలను ప్రజలు మర్చిపోయేట్లు చేసి, మభ్యపెట్టిన బిజేపి గెలిచింది. గెలిచిన ఆ మరుక్షణం ఆ పార్టీ మాట మార్చి అభివృద్ధి కుంటుపర్చడాన్ని ప్రజలుకూడా గమనిస్తున్నారు. ఈసారి నిజామాబాద్‌లో బిజేపికి కాలం చెల్లినట్లే..దేశ రాజకీయాల్లో కూడా బిజేపికి గడ్డుకాలమే…అందుకే కల్వకుంట్ల కవిత లాంటి నాయకురాలు బిజేపిలో వుంటే ఆ పార్టీకి తిరుగులేకుండా వుంటుందన్న ఆలోచన కూడా బిజేపి చేసినట్లు కూడా గతంలోనే తేలిపోయింది. బిజేపి ఎన్ని ప్రయత్నాలు చేసినా కవిత బిజేపిలో చేరే అవకాశాలు లేవని తేలిపోయింది. దాంతో నయానో, భయానో బిజేపిలోకి చేర్చుకునే ఎత్తుగడ కూడా బిజేపి చేసిందనేది విధితమే..ఈ సంగతి సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా బిజేపి అరాజకీయ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి తెలిపే క్రమంలో వెల్లడిరచారు. అయినా బిజేపి తన ప్రయత్నాలు ఆపలేదు. ఎంత ప్రయత్నించినా కవిత బిజేపిలోకి వచ్చే అవకాశాలు మృగ్యమైపోవడంతో, డిల్లీ మద్యం పాలసీ కేసుతో ఇబ్బందులకు గురిచేయాలని నిర్ణయించారు. ఒక రకంగా చెప్పాలంటే కక్షకట్టారు. బిజేపికి తెలియని విషయం ఏమిటంటే? అందరిలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ పేరు చెప్పుకొని ఎదిగిన నేత కాదు. కేవలం ముఖ్యమంత్రి కేసిఆర్ పేరు చెప్పుకొని పదవులు పొందిన నేత కాదు. ఆమె స్వయంకృషితో ఎదిగిన నేత. ప్రజల ప్రేమాభిమానాలు చూరగొన్న నేత.
చాలా మందికి తెలియని విషయమేమిటంటే 2014 ఎన్నికల ముందు వరకు ఆమె టిఆర్‌ఎస్ పార్టీ నాయకురాలు కూడా కాదు. బిఆర్‌ఎస్ సానుభూతి పరురాలు మాత్రమే… అయినా ఆమె తెలంగాణ ఉద్యమంలో తాను ప్రత్యేకమైన దారిని ఎంచుకున్నది. తన ప్రత్యేకతను చాటుకున్నది.
ఒక నాయకురాలుగా చెప్పుకోలేదు. బిఆర్‌ఎస్ పేరుతో రాజకీయాలు చేయలేదు. అలా అనుకుంటే ఆమె 2009లోనే రాజకీయాలు చేసేది. పదవులు అందిపుచ్చుకునేది. కాని ఆమె జాగృతి అనే స్వచ్ఛంధ సంస్ధ ద్వారా యువతకు సేవ చేసింది. వారికి ఉపాధి కల్పనలో మెలుకవలు నేర్పించేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. కొన్ని వేల మందికి ఐటి రంగంలో పోటీ పడేందుకు అవసరమైన శిక్షణలు ఇప్పించింది. ఎంతో మందికి ఆ రోజుల్లో లాప్‌టాప్‌లు కూడా అందించి ప్రోత్సహించింది. మరో వైపు తెలంగాణ ఉద్యమంలో మహిళల తరుపున ఆమె చేసిన ఉద్యమం ఒక చరిత్ర. ఒక నిఘంటువు. ఆ రోజు ఉద్యమంలో ఎక్కడా లేని వాళ్లు కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు శతవిధాల ప్రయత్నించినవారు కూడా ఇప్పుడు కల్వకుంట్ల కవితను నానా రకాలుగా విమర్శిస్తున్నారు. అయినా ఆమె ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో వాటిని వింటూ వదిలేస్తారు. నాటి నుంచి నేటిదాకా ప్రజలకు సేవ చేస్తూనే వున్నారు. ఉద్యమ కాలంలో కూడా ఇలాగే కొంత మంది విమర్శలు చేశారు. అయినా ఆమె అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడూ పట్టించుకోలేదు. ఆమె చేసిన ఉద్యమం మూలంగా తెలంగాణ యాసను కించపర్చేలా వున్న అనేక సినిమాలను అడ్డుకున్నారు. ఒక దశలో సీమాంధ్ర సినీ పరిశ్రమ శంకర్ తీసిన జై బోలో తెలంగాణ సినిమాకు అడ్డంకులు సృష్టిస్తే, అల్లు అర్జున్ ఆర్యా2, మహేష్‌బాబు సైనికుడు, జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ లాంటి సినిమాలు తెలంగాణలో ఒక్క షో కూడా పడకుండా చేశారు. తెలంగాణ శక్తి ఏమిటో చూపించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర ఎంత శక్తివంతమైనదో ఆ ఒక్క సంఘటనతో చూపించారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్న వారెవరైనా ఆ పని ఆనాడు చేశారా? అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశారా? కల్వకుంట్ల కవిత సాగించిన తెలంగాణ ఉద్యమ ప్రస్తానంలో అధ్భుతమైన కొన్ని వందల సంఘటనలున్నాయి. కాని ఇప్పుడు పదే పదే మాట్లాడుతున్నవారికి చెప్పుకోవడానికి కనీసం ఒక్క ఘటనైనా వుందా? నోరుంది కదా! మాట్లాడుతున్నవారికి కనీసం బిఆర్‌ఎస్ నేతలు కూడా సరైన కౌంటర్లు ఇవ్వకపోవడం బాధాకరం.
అసలు డిల్లీ లిక్కర్‌ది కేసే కాదు…అసలు అది సమస్యే కాదు…అది ఒక పాలసీలో భాగమైన చర్య…చర్చ…అంత వరకే…
అయినా ఆ పాలసీ ఎప్పుడో డిల్లీ ప్రభుత్వం ఉప సంహరించుకున్నది. ఈ విషయాలు రాష్ట్ర బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఇతర సీనియర్ నాయకులకు తెలియదా? బిఆర్‌ఎస్‌కు దేశంలో ఏ పార్టీకి లేనంత కార్యకర్తల యంత్రాంగం వుంది. సమారు 66లక్షల మందికార్యకర్తలున్నారు. కొన్ని వేల మంది క్రియాశీలక నాయకులున్నారు. రాష్ట్ర స్ధాయిలో అనేక పదవుల్లో వున్న నాయకులువందల్లో వున్నారు. వీళ్లెవరికీ అసలు డిల్లీ లిక్కర్ పాలసీ మీద అవగాహన లేకపోవడం విడ్డూరం. అంతే కాదు ఏడెనమిది నెలలుగా నలుగుతున్న ఈ సమస్యపై కనీసం ఏ ఒక్క బిఆర్‌ఎస్ నాయకుడు కూడా పెద్దగా స్పందించకపోవడం బాదాకరం. ఇప్పటికే బిఆర్‌ఎస్ నాయకులు బిజేపిని ఉతికి ఆరేయాల్సింది. కాని బిఆర్‌ఎస్ నేతల ఉదాసీనతే బిజేపికి మరింత బలం చేకూరింది. బిజేపి చేసిన అసత్య ప్రచారంలో నిజానిజాలు కూడా తెలుసుకోకుండా బిఆర్‌ఎస్ నేతలు కూడా లిక్కర్ స్కామ్ నిజమే అని నమ్మడం గమనార్హం. పదవుల కోసం వున్న శ్రద్ద బిఆర్‌ఎస్‌లో చాలా మందికి పార్టీని కాపాడుకోవడంలో లేదు. పార్టీమీద చిత్త శుద్ది లేదు. పార్టీ బలోపేతానికి వారు చేస్తున్నదేమీ లేదు. బిఆర్‌ఎస్‌లో అంతో ఇంతో ఉద్దండులైన నాయకులు, పాలన మీద అవగాహన వున్న సీనియర్ నేతలు కూడా స్పందించకపోవడం విచారకరం. అసలు లిక్కర్ అంశం డిల్లీలో అదొక పాలసీ మేటరే గాని, స్కామ్ అనే మాటకే అవకాశం లేదని నేటిధాత్రి చెప్పేదాక బిఆర్‌ఎస్ నేతలు చాలా మందికి అవగాహన లేకపోవడం మాత్రం శోచనీయం.
కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు అనగానే రాజకీయ పార్టీలకన్నా, ఎక్కువగా సీమాంధ్రకు చెంది, తెలుగు తెగులును ముందు పెట్టుకున్న ఓ పార్టీకి మీడియాకు ఎనలేని సంతోషం కలిగినట్లుంది.
ఇంత కాలం మొసలి కన్నీరు కార్చే మీడియా మొత్తం ఒక్కసారిగా ముఖ్యమంత్రి కేసిఆర్ కుటుంబంపై మాట్లాడే అవకాశం దొరికందన్నంతగా అత్యుత్సాహం ప్రదర్శించాయి. డిబేట్ల మీద డిబేట్లు…అసలు ఈడీ కేసులేమిటి? వాటి సెక్షన్‌లేమిటి? వాటి వల్ల ఏం జరగొచ్చు? కవితను అరెస్టు చేస్తే శిక్షేమిటి? నుంచి మొదలు ఇక కవిత అరెస్టు? అయినట్లే అన్నదాకా తీసుకెళ్లాయి? సాయంత్రం ఆరు గడిచినా ఎమ్మెల్సీ కవిత బైటకు రాకపోవడం, ఇక సీమాంద్ర మీడియా గొట్టాలకు పూర్తి స్ధాయి చెప్పింది. ఇక తాము చెప్పిందే జరిగిందన్న సంతోషాన్ని ఒక దశలో వ్యక్తం చేశాయి. ఆ రోజు బాగోతం అంతా ఇంతా కాదు…ఇలా తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కవిత లాంటి నాయకురాలకు అన్యాయం జరిగితే అండగా నిలవాల్సిన మీడియా కూడా వెలికి వేశాలకు తెరతీసింది. ఇప్పటికీ ఆ మీడియాకు గుప్పిట దాగిన కసి చూపిస్తూనే వుంది.
తెలంగాణ మీడియా ఏం చేస్తున్నట్లు? ప్రభుత్వం ప్రటనలు ఇవ్వడం లేదు?
అంటూ నిత్యం మాట్లాడే తెలంగాణ మీడియా అసలు స్కీమే కాని కేసులో స్కామ్ బూచి చూపి, ఎమ్మెల్సీ కవిత మీద క్షక్ష సాధింపు చర్యలు చేపడుతుంటే ఎందుకో తెలంగాణ మీడియాకు రాయడానికి అక్షరాలు రాలేదు? ఎలక్రానిక్ మీడియా నోరెందుకు పెగళ్లేదు? అంతే కాదు బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ, టి. న్యూస్ ఏం చేస్తున్నట్లు అనే ప్రశ్నలు కూడా తెలంగాణ వాదుల నుంచి ఉత్పన్నమౌతున్నాయి. నిజాలేమిటో కూడా చెప్పలేకపోవడం ఏమిటని బిఆర్‌ఎస్ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. కనీసం నేటిధాత్రిలో వచ్చినంత సమాచారంలో కొంత భాగమైనా ఎందుకు రాయలేకపోయారు… టి. న్యూస్‌లో వినిపించలేపోయారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత రాజీకీయం భవిష్యత్తు దేశ ప్రగతికి, ప్రగతిశీల సమాజానికి ఎంతో అవసరం. ఆమెకు నేటిధాత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు…