‘కమలం’ కష్టాల్లో పడింది – పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

‘కమలం’ కష్టాల్లో పడింది

– పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడమేనా…?

– శాసనసభ ఎన్నికల్లో అదే పరిస్థితి…

నర్సంపేట, నేటిధాత్రి : కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి గ్రామస్థాయి నుండి డివిజన్‌ స్థాయి వరకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి పార్టీ ఉన్నప్పటికీ ఓటింగ్‌ శాతం పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో పార్టీ క్యాడర్‌లో సమన్వయం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పలువురు విమర్శించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి జాటోతు హుస్సేన్‌నాయక్‌ బరిలో ఉండగా, నర్సంపేట నియోజకవర్గం నుండి మెజార్టీ ఓట్లు వస్తాయని భావించినట్లు సమాచారం. కానీ గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా పోటీ చేయగా ఆయనకు 1476ఓట్లు (0.78శాతం) మాత్రమే నమోదయ్యాయి. నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మొదటిస్థానంలో, కాంగ్రెస్‌ పార్టీ రెండవస్థానంలో, స్వతంత్ర అభ్యర్థి మూడవస్థానంలో ఉండగా, ఎడ్ల అశోక్‌రెడ్డికి నాల్గవ స్థానం లభించింది. దీనికి కారణం అభ్యర్థి ఎడ్ల అశోక్‌రెడ్డి నియోజకవర్గంలోని పార్టీ నాయకులను కలుపుకోకపోవడమే కారణమని పలువురు నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలకు ముందు నర్సంపేట పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించగా 1500మంది కార్యకర్తలు హాజరైనట్లు నాయకులు తెలపగా ఓటింగ్‌ శాతం మాత్రం ఎందుకు తగ్గిందని నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకున్నారు. ఈనెల 11వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో గతంలో కంటే ఓటింగ్‌శాతం పెరిగేనా అని పలువురు విమర్శించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు పట్టిపట్టనట్లుగా ఉంటున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుందా అని పలువురు చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ ఓటింగ్‌ శాతం పెంచడానికి చేసిన ప్రయత్నాలు ఫలించేనా అని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *