ఆటలో అరటిపండు ఈటెలే!

`బిజేపిలో అడుగడుగునా అడ్డంకులే!

`అటు బండి కోపాలు..ఇటు సీనియర్లు వేసే బ్రేకులు.

`కష్టపడుతున్నా…కలిసిరావడం కలే!

`నాడు బిఆర్‌ఎస్‌ లో నోరు జారి తెచ్చుకున్న ఇబ్బందులు.

`గొప్పలకు పోయి తెచ్చుకున్న తిప్పలు.

`పదవిలో వుంటూ ఆడిన పరిహాసాల ఫలితం.

`పదవి పోగొట్టుకొని, పార్టీ నుంచి వెళ్లగొట్టేలా చేసుకొని…

`అతిబలవంతుడనుకొని…

`తన బలహీనతలను తాను బైటపెట్టుకొని…

`పడరాని తిప్పలు కొని తెచ్చుకొని..

`బిజేపిలో చేరిన నాటి నుంచి తలపట్టుకొని…

`అడుగు ముందుకేయలేక…వెనక్కి వెళ్లలేక…

`ఆత్మాభిమానం తాకట్టు పెట్టుకోలేక..

`బిజేపిలో ఇమడలేక…

`బయటకు వెళ్లలేక..

`మరో మార్గం కనబడక,

`ప్రత్యామ్నాయం లేక,

`తనతో ఎవరూ కలిసిరాక..

`కల చెదిరి..కలత చెంది..

`భవిష్యత్తు మీద ఆశలుడిగి..

`తనకు మాలిన ధర్మమే ఎక్కడైనా నీతి.

`ఈటెలకు అదెప్పుడూ దక్కదు బిజేపి తోటి.

`తత్వం బోధపడ్డా తప్పు కోలేని పరిస్థితి.

`సందిగ్ధత.. అస్పష్టత..ఈటెల భవిత.

ఒకనాటి ఈటెల కాదు. ఆనాటి పటిమ లేదు. ఆ మాటల పదును లేదు. ఆ గొంతులో గాంభీర్యం లేదు. గుక్కతిప్పుకోకుండా వేసే పంచులు లేవు. తాను మాట్లాడితే ఎదుటివారికి సమాధానం లేనంత చాతుర్యం లేదు. ఈటెల్లాంటి విసుర్లు లేవు. గతంలో గర్జించినంత శక్తి లేదు. అంతటి ధైర్యం కూడా ఇప్పుడు కనిపించడం లేదు. కాని ఒకనాటి ఈటెల వేరు. ఆయన మాటల వాడి వేరు. వేడి వేరు. ఆయన చేసే ఎదురుదాడి వేరు. ఆ పదాల దొంతరలను అల్లిన తీరు వేరు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదం వినిపంచే వాదనలో ఆరితేరిన ఈటెల..గొంతులో ఇప్పుడు జీర తప్ప గాంభీర్యంలేదు. అది ప్రజా సభ అయినా, చట్ట సభ అయినా, పోరాట వేదికైనా సే మాటల ఈటెలు రాజేందర్‌ విసురుతుంటే తట్టుకునే శక్తి ఆనాడు ఎవరికీ లేకుండే. మరి ఇప్పుడు ఈటెలలో మాటరాని మౌనం ఆవహించింది. అందుకు కారణాలేమిటో ఆయనకే కాదు, తెలంగాణ ప్రజానీకానికి కూడా తెలుసు. కాకపోతే తెలంగాణ ప్రజలు ఈటెల రాజేందర్‌ను ఊహించుకున్నట్లు ఆయన లేడు. బిజేపి నీడలో చేరి సేదదీరుతున్నాడు. కాని అక్కడ అంత స్ధితిమితంలో కూడా లేడు. అయినా తప్పని స్ధితి. పరిస్ధితులను ఎదుర్కొలేని నిస్సహాయ స్ధితి. అసహాయ దుస్ధితి. గతంలో వున్న బలాన్ని చేజేతులా పోగొట్టున్నాడు. అద్దె బలం ముసుగులో కనిపించీ, కనిపించని రాజకీయాన్ని అనుసరిస్తున్నాడు. బిజేపిలో సంతోషంగా లేడు. ఆ పార్టీలో వున్నందుకు ఆనందంగా లేడు. పైకి ఎన్ని చెప్పినా, ఆత్మ వంచన చేసుకున్నా, తనేమిటో, తన విధానాలేమిటో..కేవలం రాజకీయం కోసం పడిన రాజీ ఏమిటో ఈటెలకు తెలుసు. కాకపోతే సమయం కోసం ఎదురుచూస్తున్నాన్న భ్రమలో ఈటెల వున్నాడే..కాని ఎప్పుడైతే బిఆర్‌ఎస్‌ నుంచి బైటకు వచ్చాడో అప్పుడే ఆయన రాజకీయానికి చరమగీతమైంది. ప్రతి మనిషికి ఆశ సహజం. కాని రాజకీయాల్లో ఆశలు అనుకున్నంతగా అందిరకీ నెరవేరవు. కలలు పండవు. పదవులు అందువు. అయితే వున్న పదవులను పోగొట్టుకొని మరో పార్టీ పంచన చేరి,పదవుల కోసం ఎదురుచూడడం అంటే ఆకాశంలో మబ్బులను చూసి ముంత ఒలకపోసుకోవడమే! ఇప్పుడు రాజేందర్‌ చేస్తున్నదే. 

ఒక మాట సూటిగా విశ్లేషించుకున్నా బిఆర్‌ఎస్‌లో వున్నంత స్వేచ్ఛ బిజేపిలో వుంటుందా? అడుగడుగునా అడ్డకుంలు వుంటాయి. అదే ఈటెల బిఆర్‌ఎస్‌లో వున్నప్పుడు ఆయన ఏ మాట్లాడాలనుకున్నా అది స్వేచ్ఛగా మాట్లాడేవారు… కాకపోతే ఈ స్వేచ్చే తన కొంప ముంచేదాకా తెచ్చుకున్నాడు. నోరుంది కదా? అని ఏది పడితే అది మాట్లాడితే రాజకీయాల్లో చెల్లదు. అది తెలిసిన రాజేందర్‌ ఎందుకు తొందరపడ్డాడనేది పక్కన పెడితే…రాజకీయం వివేకం కూడా చంపేస్తుందని చెప్పడానికి ఈటెల రాజకీయమే నిదర్శనం. తెలంగాణ వస్తుందన్న నమ్మకమే ఉద్యమ కాలంలో ఎవరికీ లేదు. అంతెందుకు కొట్లాడిన రాజేందర్‌కు కూడా తెలియదు. ఉద్యమ కారుడిగా ముఖ్యమంత్రి దీక్షే చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర సాధన అన్నదే వుండకపోవు. తెలంగాణ వస్తే ఏమొస్తుందన్న వారికి సమాధానం చెప్పాల్సిన ఈటల రాజేందరే ఐదేళ్లపాటు ఆర్ధిక మంత్రిగా పనిచేసి, తెలంగాణ ప్రగతిని అవహేళన చేస్తే ఏ పార్టీ అధి నాయకుడు ఊరుకుంటాడు? తెలంగాణ రాకముందు పరిస్ధితులేమిటి? అరవైఏళ్ల గోసేమిటి? తెలిసిన రాజేందరే… కళ్లముందు నీళ్లు, పచ్చని పొలాలు, మత్తుళ్లు దుంకుతున్న చెరువులు, పండుతున్న పంటలు, రైతు సంతోషాలు, పెరుగుతున్న సాగు విస్తీర్ణం, కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ ఈటెల రాజేందర్‌ భాగస్వామ్య ప్రభుత్వమే సాధించిన విజయం. అయినా దాన్ని చిన్నది చేసి ఈటెల మాట్లాడడమే ఇంత దూరం తెచ్చింది? ఇది రాజకీయ నాయకులకు ఒక పాఠం అని కూడా చెప్పొచ్చు. అరవైఏళ్లు అరిగోస పడిన తెలంగాణ ప్రజలకు రైతాంగానికి నీళ్లొచ్చినై. ఇంటింటికీ మంచినీళ్లొచ్చినయ్‌…రైతు బంధు వస్తోంది. పంట రాష్ట్ర ప్రభుత్వమే కొంటోంది. ఒక్క గింజ కూడా పండని బీడలన్నీ పొలాలై సాగౌతున్నాయి. బంగారు పంటలు పండుతున్నయి. కరంటు బిల్లులు కట్టినా కరంటు రాని రోజు నుంచి, ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ రైతుకు అందుతోంది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందడం లేదు. మరి అంతటి గొప్ప కార్యక్రమం అమలౌతున్న దానిన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన చోట, పంట గురించి స్త్రావించకుండా, పరిగలేరుకొని రైతు బతుకుతున్నాడంటూ ఈటెల వ్యాఖ్యలు చేయడం సరైందేనా? 

                   ఇక రాజకీయాల విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలలో ఎంత మంది నాయకులు వున్నా, ఎంత మంది దాని ఎదుగుదలకు కారణమైనా, ఆ పార్టీలు నడిచేవి, ఎదిగేవి కేవలం ఆ పార్టీ అధినాయకుడిని చూసే, తప్ప పార్టీలో వున్న ఇతర నేతలను చూసి కాదు. ఈ విషయం తెలిసిన ఈటెల , నేను కూడా గులాబీ జెండాకు ఓనర్నే అనడంలో ఆత్మ సంతృప్తి కనిపించలేదు. ఆత్మాభిమానం ముసుగులో అహం తొనికిసలాడిరది. ప్రశ్న వినిపించింది. పార్టీ అధిష్టానంపై దిక్కరణ కనిపిస్తోంది. అందుకే ఆయన పార్టీ నుంచి వెలివేయడబడిరది. ఇలాంటి విషయాలల్లో ఏ ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఉపేక్షించడు. కాని ముఖ్యమంత్రి కేసిఆర్‌ చాలా కాలం ఈటెల రాజేందర్‌ విషయంలో ఓపికపట్డాడు. అది ఈటెల అర్ధం చేసుకోలేదు. కాకపోతే అది ఈటెల మనసులో మాటలు మరిన్ని బైట పెట్టేందుకు దోహదమయ్యింది. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ఎదురేలేని తరుణంలో సొంత గూటి నాయకుడు, బాధ్యత కల్గిన ఉద్యమ కారుడుగా ఈటెల రాజేందర్‌ పార్టీమీద, ప్రభుత్వం మీద వ్యాఖ్యలు చేసి తప్పు చేశాడు. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఈటెలను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి సాగనంపాడు. వ్యతిరేకతను మొగ్గలోనే తుంచితేనే బాగుంటుంది. ప్రపంచ రాజకీయం చరిత్ర ఇదే చెబుతోంది. అందుకే ముఖ్యమంత్రి కేసిఆర్‌ కొంత కాలం ఆగినా, తుంచితే తప్ప కొత్త చిరుగురకు ఆస్కారం లేదనుకున్నాడు. ఈటెలను పంపించేశాడు. ఇప్పుడు ఈటెల తన గతాన్ని తల్చుకొని మధనపడుతున్నాడు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంత ప్రాధాన్యతినిచ్చినా ఈటెల నిలుపుకోలేదు. ఇప్పుడు బిజేపిలో ఆ గౌరవానికి తావులేదు. నిజానికి బిజేపిలో ఇప్పుడున్న నాయకుల్లో అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడు ఈటెల రాజేందర్‌. అందరికంటే ఎక్కువ గుర్తింపు వున్న నాయకుడు కూడా ఆయనే…అయితేనేం ఎక్కడైనా బావే కాని, వంగతోట కాడ కాదన్నట్లు, ఈటెల ఎంత పెద్ద నాయకుడైనా బిజేపిలో మాత్రం జూనియరే..అదే ఇప్పుడు ఆయనకు కూడా బోధపడుతున్న తత్వమని అర్ధమౌతోందంటున్నారు. రాజకీయాల్లో ఒక్కసారి తప్పటడుగులు పడ్డ నాయకుడు కోలుకున్నట్లు చరిత్రలో లేదు. సరిదిద్దుకునే అవకాశం లేని అడుగులేసిన నాయకులు సొంతగూటికి రాకడ అన్నది కూడా కుదరని అంశం. ఎందుకంటే ప్రజల ఆలోచనా దోరణిని బట్టే నాయకుల రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి వుంటుంది. వ్యక్తులుగా ఈటెల రాజేందర్‌ లాంటి నాయకులకు ప్రజల్లో ఎంత పరపతి వున్నప్పటికీ స్వతాహాగా ఎదిగిన నేత కాదు. ఆయన కేసిఆర్‌ చేతిలో మలచబడిన నాయకుడు. అది తెలుసుకొని రాజకీయం చేయాల్సిన అవసరాన్ని విస్మరించి, తనను తాను అతిగా ఊహించుకొని, దారి తెలియని పద్మవ్యూహాన్ని తానే రూపొందించుకున్నాడు. అందులో ఈటెలే చిక్కుకున్నాడు. బైటకు రాలేక గిలగిల లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఊగిసలాడుతున్నాడు. ఆయనతో ఎవరూ కలిసి వచ్చే అవకాశం కనపడక ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అటు బిజేపిలోకి నాయకులను తేలేకపోతున్నాడు. తన దారి తాను చూసుకుందామనుకుంటే, ఆయన ద్వారా వచ్చిన వారు మళ్లీ నమ్మకుండా పోతుందన్న భయంతో బిజేపిలోనే కొనసాగుతున్నాడు. కర్నాటక ఎన్నికల తర్వాత కుదేలైనట్లు కనిపిస్తున్న బిజేపికి జోష్‌ తెచ్చి, తన పరపతి పెంచుకోవాలని ఆశ పడుతున్నా, అదీ నెరవేరడం లేదు. ఎటు చూసినా గందరగోళమే…రాజకీయ భవితం అంతా అంధకారమే! జై ఈటెల అని ఇప్పుడు జేజేలు కొడుతున్న వారు కూడా రేపటి రోజు మర్చిపోయేలా నష్టపోతున్నది ఈటెలే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *